Skip to main content

జేఈఈ మెయిన్ (ఫిబ్రవరి)-2021 షెడ్యూల్ ఇదే: ఫిబ్రవరి 23 నుంచి..

సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్-2021 సవరించిన నోటిఫికేషన్ బుధవారం వెలువడింది.

2021 ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. మరోవైపు బుధవారం నుంచే ఆన్‌లైన్‌లో (jeemain.nta.nic.in) దరఖాస్తుల స్వీకరణకు చర్యలు చేపట్టింది.

తెలుగు సహా 13 భాషల్లో జేఈఈ మెయిన్
మొదటిసారి 13 భాషల్లో జేఈఈ మెయిన్ జరగనుంది. గతంలో ఇంగ్లిష్, హిందీ, గుజరాతీ భాషల్లో మాత్రమే నిర్వహించిన ఎన్‌టీఏ వివిధ రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు మొత్తంగా 13 భాషల్లో నిర్వహించనుంది. ఇందులో తెలుగు, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, మలయాళం, ఒడియా, పంజాబీ భాషల్లో నిర్వహించనుంది. 2019, 2020, 2021లో 12వ తరగతి/తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణులైన, 2021లో వార్షిక పరీక్షలు రాసే వారు జేఈఈ మెయిన్‌కు హాజరు కావచ్చు. వయో పరిమితి లేదు. కరోనా నేపథ్యంలో జేఈఈ రాసేందుకు కనీస మార్కుల విధానం లేదు. ఇంటర్మీడియట్‌లో 75 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనను గత జేఈఈ మెయిన్ నుంచే తొలగించారు. రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఇంటర్మీడియెట్ పాస్ అయితే చాలు. దూర విద్యలో చదువుకున్న, ప్రస్తుతం సెకండియర్ చదువుతున్న వారు కూడా అర్హులే.

Must Check: JEE Main Practice Tests, Previous Papers and Cutoff scores 

సీఎస్‌ఏబీ ప్రవేశాల్లో మాత్రం 75 శాతం..
జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) ఉమ్మడి ప్రవేశాలు ముగిశాక ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐలలో మిగిలిన సీట్ల భర్తీకి సెంట్రల్ సీట్ అలొకేషన్ అథారిటీ నిర్వహించే కౌన్సెలింగ్‌లో మాత్రం ఇంటర్‌లో కనీస మార్కుల నిబంధన ఉందని పేర్కొంది. విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో 75 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీలైతే 65 శాతం) ఉండాలని పేర్కొంది. ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐలలో ప్రవేశాలకు జోసా నిర్వహించే ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్‌లో కనీస మార్కుల నిబంధన అంశాన్ని ప్రస్తావించలేదు. అంటే జేఈఈ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేసే అవకాశం ఉంది.

జేఈఈ మెయిన్‌కు సంబంధించిన వివరాలు

  • కరోనా నేపథ్యంలో ఈసారి విద్యార్థులకు వెసులుబాటు కల్పించేందుకు ప్రశ్నల సంఖ్య పెంచారు. గతంలో 75 ప్రశ్నలే ఇవ్వగా, ఈ సారి 90 ప్రశ్నలు ఇస్తారు. అందులో 75 ప్రశ్నలకు సమాధానాలు రాస్తే సరిపోతుంది.
  • మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి సెక్షన్-ఏలో 20 చొప్పున బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-బిలో 10 చొప్పున న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-ఏలో 60 ప్రశ్నలు అన్నింటికీ సమాధానాలు రాయాలి. సెక్షన్-బిలో మూడు సబ్జెక్టుల్లో కలిపి ఇచ్చే 30 పశ్నల్లో ఒక్కో సబ్జెక్టుకు సంబంధించి 5 చొప్పున 15 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
  • ఒక్కో సబ్జెక్టులో 100 చొప్పున 300 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. సెక్షన్-బిలో నెగెటివ్ మార్కుల విధానం ఉండదు. సెక్షన్-ఏలో మాత్రం తప్పుడు సమాధానం రాస్తే ఒక మార్కు కట్ చేస్తారు.
  • బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో (బీఆర్క్) ప్రవేశాల కోసం నిర్వహించే పేపర్-2ఏలో 82 ప్రశ్నలు, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్‌లో ప్రవేశాల కోసం పేపర్- 2బీలో 105 ప్రశ్నలు ఇస్తారు.
  • బీఆర్క్, బీ ప్లానింగ్‌లో మ్యాథమెటిక్స్ సబ్జెక్టుకు సంబంధించి విద్యార్థులు 20 బహుళైచ్ఛిక ప్రశ్నలకు సమాధానం రాయాలి. మరో 10 న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నల్లో మాత్రం 5
  • పశ్నలకు సమాధానం రాస్తే సరిపోతుంది. న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నల్లో నెగెటివ్ మార్కుల విధానం ఉండదు.


ఇదీ ఫిబ్రవరి జేఈఈ మెయిన్ షెడ్యూలు..

  • 16-12-2020 నుంచి 16-01-2021 వరకు:ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సబ్మిషన్
  • 17-01-2021 వరకు: ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు
  • 19-1-2021 నుంచి 21-1-2021 వరకు: ఆన్‌లైన్ దరఖాస్తుల్లో పొరపాట్లు సవరణ
  • ఫిబ్రవరి మొదటి వారంలో హాల్‌టికెట్ల డౌన్‌లోడ్
  • 23-2-2021 నుంచి 26-2-2021 వరకు: ఆన్‌లైన్‌లో పరీక్షలు
  • ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు: మొదటి షిఫ్ట్ పరీక్ష
  • మ. 3 గంటల నుంచి సా. 6 గంటల వరకు: రెండో షిఫ్ట్ పరీక్ష
  • ఉదయం పరీక్షకు విద్యార్థులను ఉ. 7:30 గంటల నుంచి, మధ్యాహ్నం పరీక్షకు మ. 2 గంటల నుంచి అనుమతిస్తారు.
  • మార్చిలో ఫలితాలు (ఎన్‌టీఏ స్కోర్) వెల్లడి.


మార్చి, ఏప్రిల్, మే పరీక్ష తేదీలు..
మార్చి: 15, 16, 17, 18
ఏప్రిల్: 27, 28, 29, 30
మే: 24, 25, 26, 27, 28

ఇవీ పరీక్ష కేంద్రాలు
పరీక్షల కోసం తెలంగాణ 10 కేంద్రాలను ఏర్పాటు చేసింది. అందులో హైదరాబాద్/సికింద్రాబాద్,/రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట ఉన్నాయి. ఏపీలో 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. అందులో అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖ, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం ఉన్నాయి.

Published date : 17 Dec 2020 04:31PM

Photo Stories