Skip to main content

జేఈఈ 2021 పరీక్షలు సకాలంలో జరుగుతాయో.. లేదో..!

సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)-2021 పైనా కోవిడ్ నీలినీడలు కమ్ముకున్నాయి.

ఈ పరీక్షల నిర్వహణ సకాలంలో ఉంటుందా, ఉండదా.. అన్న సందేహాలు అలముకున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్-19 ప్రభావం కొనసాగుతుండడంతోపాటు రానున్న శీతాకాలంలో ఈ వైరస్ విజృంభిస్తే దాని ప్రభావం జేఈఈ నిర్వహణపై పడుతుందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

Check JEE Main and Advanced Previous Papers and Cut-off scores here.

ప్రక్రియ ఇప్పటికే రెండునెలల ఆలస్యం
జేఈఈ మెయిన్స్ ను ఏటా రెండుసార్లు (జనవరి, ఏప్రిల్ నెలల్లో), జేఈఈ అడ్వాన్స్ ను ఒకసారి నిర్వహిస్తున్నారు. జనవరిలో నిర్వహించే జేఈఈ మెయిన్స్ ప్రక్రియను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అంతకుముందు సంవత్సరం సెప్టెంబర్ నుంచే ప్రారంభిస్తుంటుంది. కానీ కోవిడ్ కారణంగా 2020 ఏప్రిల్‌లో నిర్వహించాల్సిన పరీక్షలు అయిదునెలలు ఆలస్యమయ్యాయి. దాని ప్రభావం 2021 జనవరి జేఈఈ మెయిన్స్ పై పడుతోంది.

  • షెడ్యూల్ ప్రకారం 2019 జనవరి, ఏప్రిల్ జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు.
  • కోవిడ్ కారణంగా 2020 జనవరి, ఏప్రిల్ పరీక్షలు షెడ్యూల్ మేరకు నిర్వహించలేకపోయారు. జనవరి పరీక్షలను జనవరి 7-9 తేదీల మధ్య నిర్వహించారు. ఏప్రిల్ పరీక్షలను ఆరునెలల తరువాత సెప్టెంబర్ 1-6 తేదీల మధ్య నిర్వహించారు. జేఈఈ మెయిన్స్ ర్యాంకులను సెప్టెంబర్ 11న ప్రకటించారు.
  • జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఆలస్యంతో వాటిలో అర్హత సాధించిన వారికి జేఈఈ అడ్వాన్సు పరీక్షలు సెప్టెంబర్ 27న నిర్వహించారు. అడ్వాన్సు ఫలితాలను అక్టోబర్ 5న ప్రకటించగా అక్టోబర్ 6 నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమై నవంబర్ 9 వరకు కొనసాగింది. ప్రస్తుతం ఎన్‌ఐటీలు ఇతర సంస్థల్లో మిగిలిన సీట్లకు సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు (సీఎస్‌ఏబీ) స్పెషల్‌రౌండ్ భర్తీ చేపట్టింది. ఈనెల 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. డిసెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభించే అవకాశం ఉంది.
  • 2019లో జేఈఈ మెయిన్స్ ర్యాంకులను ఏప్రిల్ 30న ప్రకటించగా అడ్వాన్సు ఫలితాలు జూన్ 14న విడుదల చేశారు. అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ను జూన్ 16 నుంచి జులై 23 వరకు కొనసాగించి అనంతరం తరగతులు ప్రారంభించారు.
  • 2021జనవరి జేఈఈ మెయిన్స్ కు సంబంధించి నోటిఫికేషన్ ఇతర ప్రక్రియలు సెప్టెంబర్‌లో ప్రారంభం కాకపోవడంతో జనవరి పరీక్షలు ఆలస్యం అవుతాయని పలు విద్యాసంస్థల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.

జేఈఈ గత షెడ్యూళ్లు ఇలా

ప్రక్రియ

2019

2020

 

జనవరి

ఏప్రిల్

జనవరి

ఏప్రిల్

దరఖాస్తు

2018 సెప్టెంబర్ 1-30

2019 ఫిబ్రవరి 8-మార్చి 7

2019 సెప్టెంబర్ 3-30

2020 ఫిబ్రవరి 7-మార్చి 6

పరీక్ష తేదీ

2019 జనవరి 6-20

2019 ఏప్రిల్ 6-20

2020 జనవరి 6-11

2020 ఏప్రిల్ 5-11

ఫలితాలు

2019 జనవరి 31

2019 ఏప్రిల్ 30

2020 జనవరి 31

2020 ఏప్రిల్ 30



ఇంటర్మీడియట్ తరగతుల ప్రభావం
ఈసారి ఇంటర్మీడియట్ తరగతులు ఆలస్యం కావడంతో వాటి ప్రభావం కూడా 2021 జనవరి జేఈఈ మెయిన్స్ పై పడుతోంది. ఇంటర్మీడియట్ తరగతులు దాదాపు అన్ని రాష్ట్రాల్లో జూన్ లేదా జూలై మొదటి వారం నుంచి ప్రారంభమవుతాయి. ఈసారి కోవిడ్ కారణంగా ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభం కాలేదు. మన రాష్ట్రంలో జూన్‌లో తెరుచుకోవలసిన ఇంటర్ కాలేజీలు నవంబర్ 2న ప్రారంభమయ్యాయి. ఇదే పరిస్థితి అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది. తరగతులు ఆలస్యం కావడంతో పరీక్షలు కూడా ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలన్నీ 2021 జనవరి జేఈఈ మెయిన్స్ పై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటివరకు నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం కూడా దీనికి ఊతమిస్తోంది.

Must Check: Inter Study material and Previous Papers

బోర్డు పరీక్షలు ఆలస్యమైతే ఇబ్బందే
అన్ని రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ సిలబస్, బోర్డుల పరీక్షలు పూర్తయ్యే దాని ప్రకారం జేఈఈ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఉంటుంది. కోవిడ్ ఇలాగే కొనసాగి బోర్డు పరీక్షలు ఆలస్యం అయితే జేఈఈ మెయిన్స్ కూడా కొంచెం ఆలస్యం కావచ్చు. ఈ సంవత్సరం కోవిడ్ మహమ్మారి కారణంగా ఏప్రిల్ పరీక్ష సెప్టెంబర్ వరకు ఆలస్యం అయినందున ఐఐటీ తదితర సంస్థల్లో చేరాలనుకునే విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
- జి.వెంకటేశ్వరరావు, మేథమెటిక్స్ నిపుణుడు, విజయవాడ

అధికారిక ప్రకటన వస్తేనే స్పష్టత
2021 జనవరి జేఈఈ మెయిన్స్ ప్రక్రియపై ఎన్‌టీఏ నుంచి ప్రకటన వస్తేనే ఒక స్పష్టత వస్తుంది. దాని ప్రకారం విద్యార్థులకు బోధనను త్వరితంగా ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. 2021 సంవత్సరం జేఈఈ మెయిన్స్ జనవరి పరీక్ష జరుగుతుందా లేదా అన్న అనుమానాలున్నాయి. జనవరిలో జరగడం కష్టమే. 2020లో ఒక రకమైన ఇబ్బంది ఉంటే 2021లో మరో రకమైన అవస్థలు విద్యార్థులకు తప్పేలా లేవు. బోర్డు పరీక్షల ప్రకారం కూడా జేఈఈ మెయిన్స్ ఆధారపడి ఉంటుంది.
- వి.శ్రీనివాసరావు, కెమిస్ట్రీ బోధకుడు, హైదరాబాద్

Published date : 18 Nov 2020 02:37PM

Photo Stories