జేఎల్ఎం 1,100 పోస్టుల భర్తీకి లైన్ క్లియర్.. త్వరలో నోటిఫికేషన్..!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్కోలో 1,100 జూనియర్ లైన్మెన్(జేఎల్ఎం) పోస్టుల భర్తీకి ఎట్టకేలకు న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయి.
దీంతో త్వరలో ఈ పోస్టుల నియామక ప్రక్రియ చేపడతామని ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు తెలిపారు. ఈ మేరకు ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. ఈ పోస్టుల భర్తీకి 2017 డిసెంబర్‌లో ట్రాన్స్‌కో నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జేఎల్‌ఎం పోస్టుల భర్తీలో వెయిటేజీ మార్కులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో కేసు వేయడంతో అప్పట్లో నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు/ఆర్టిజన్లకు వెయిటేజీ మార్కులు ఇవ్వడాన్ని సమర్థిస్తూ ఇటీవల కోర్టు తీర్పు వచ్చింది. దీంతో ఏడాది సర్వీసుకు 2 మార్కులు చొప్పున మొత్తం సర్వీసు కాలానికి 20 మార్కులకు మించకుండా వెయిటేజీ ఇవ్వనున్నారు. 174 సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి సైతం 2017 డిసెంబర్‌లో ట్రాన్స్‌కో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీలో సైతం వెయిటేజీ మార్కులు కల్పించడాన్ని సవాలు చేస్తూ కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టులో వేసిన కేసు పెండింగ్‌లో ఉంది. ఈ కేసు కొలిక్కి వచ్చిన తర్వాతే సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపడతామని ట్రాన్స్‌కో అధికారవర్గాలు తెలిపాయి.
Published date : 02 Aug 2021 03:32PM