Skip to main content

ఇక సీటెట్ వ్యాలిడిటీ ఏడేళ్లు కాదు...శాశ్వతం: ఎన్‌సీటీఈ

సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) వ్యాలిడిటీని శాశ్వతం చేయాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) పాలక మండలి నిర్ణయించింది.
ఇప్పటివరకు టెట్ వ్యాలిడిటీ ఏడేళ్లు మాత్రమే ఉంది. ఇకపై దాన్ని జీవితకాలం వ్యాలిడిటీగా మార్చాలని నిర్ణయించింది. గత నెలలో జరిగిన ఎన్‌సీటీఈ పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకుంది. దీనిప్రకారం ఇకపై టెట్‌లో అర్హత సాధించిన వారు మళ్లీ మళ్లీ టెట్ రాయాల్సిన పనిలేదు. ఇప్పటికే టెట్‌లో అర్హత సాధించిన వారి విషయంలో న్యాయ సలహా తీసుకున్నాకే తుది నిర్ణయం తీసుకోవాలని ఎన్‌సీటీఈ భావిస్తోంది. 2010లో టెట్‌ను అమల్లోకి తెచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాలు ప్రతి 6 నెలలకోసారి టెట్ నిర్వహించగా, కొన్ని రాష్ట్రాలు రెండు మూడేళ్లకోసారి టెట్ నిర్వహించాయి. మొదట్లో నిర్వహించిన టెట్‌లో అర్హత సాధించిన లక్షల మందికి సంబంధించిన టెట్ వ్యాలిడిటీ ముగిసిపోయింది. అందుకే వారి విషయంలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించింది.

Also check:
TET/DSC/TRT study material, bit bank, previous papers and guidance

అయోమయంలో 3 లక్షల మంది..
ఉమ్మడి ఏపీలో నాలుగు సార్లు, తెలంగాణ వచ్చాక 2 సార్లు టెట్ నిర్వహించారు. మొదటిసారి టెట్‌ను 2011 జూలై 1న నిర్వహించగా, అందులో పేపర్-1లో 1,35,105 మంది, పేపర్-2లో 1,66,262 మంది అర్హత సాధించారు. రెండో టెట్‌లో పేపర్-1లో 24,578 మంది, పేపర్-2లో 1,94,849 మంది అర్హత సాధించారు. మూడో టెట్‌లో పేపర్-1లో 26,382 మంది, పేపర్-2లో 1,94,849 మంది అర్హత సాధించారు. అయితే అందులో టెట్ స్కోర్ పెంచుకునేందుకు రెండోసారి మూడోసారి రాసిన వారు కూడా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మొదటి మూడు టెట్‌లలో మొత్తంగా 7 లక్షల మందికి పైగా అర్హత సాధించారు. వారితో పాటు, ప్రస్తుతం వ్యాలిడిటీ పరిధిలో (ఏడేళ్లు) ఉన్న వారికి న్యాయ సలహా మేరకు ఎన్‌సీటీఈ తీసుకునే నిర్ణయం వర్తించనుంది.
Published date : 22 Oct 2020 12:13PM

Photo Stories