ఏపీ ఎంసెట్- 2020 కౌన్సెలింగ్‌లోఈ కోర్సులకు ఆదరణ కరువు..
రాష్ట్రం మొత్తమ్మీద సీట్ల సంఖ్య తక్కువగానే ఉన్నా వాటిలో భర్తీ అయ్యే సీట్లు మరీ తక్కువగా ఉన్నాయి. యూనివర్సిటీల కాలేజీల్లోని ఫార్మసీ సీట్లకు కాస్త డిమాండ్ ఉన్నా ప్రయివేటు కాలేజీల్లోని సీట్లకు చాలా తక్కువమంది ఆప్షన్ ఇస్తున్నారు.
120 కాలేజీల్లో 4,133 సీట్లు
రాష్ట్రంలో 120 కాలేజీలు ఫార్మసీ కోర్సులు నిర్వహిస్తున్నాయి. వీటిలో యూనివర్సిటీ కాలేజీలు 9, ప్రయివేటు ఫార్మసీ కాలేజీలు 111. ఇటీవలి ఎంసెట్‌లో ఈ కాలేజీల్లో సీట్ల భర్తీని చేపట్టగా మొత్తం 4,133 సీట్లకుగాను 345 మాత్రమే భర్తీ అయ్యాయి. వర్సిటీ కాలేజీల్లోని 286 సీట్లలో 79 (27.62 శాతం) సీట్లు భర్తీకాగా, ప్రయివేటు కాలేజీల్లోని 3,847 ఫార్మసీ సీట్లలో 266 (6.91 శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి.
ఫార్మా డీ.. అదే పరిస్థితి
ఫార్మా డీ కోర్సులో విద్యార్థుల చేరికలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన రెండు విడతల ఎంసెట్ కౌన్సెలింగ్‌లో 4.14 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయంటే ఫార్మా కోర్సులకు ఆదరణ ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ఫార్మా డీ కోర్సుకు సంబంధించిన కాలేజీలు వర్సిటీ పరిధిలో 1 ఉండగా ప్రయివేటు రంగంలో 60 ఉన్నాయి. మొత్తం 675 సీట్లున్నాయి. వర్సిటీ కాలేజీలోని 16 సీట్లలో 8 (50 శాతం), ప్రయివేటు కాలేజీల్లోని 659 సీట్లలో కేవలం 20 (3.03 శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి. ఈసారి ఎంసెట్ మూడో విడత కౌన్సెలింగ్‌ను నిర్వహించనుండడంతో ఇంకా ఏ మేరకు సీట్లు భర్తీ అవుతాయో చూడాల్సిందే.
కొన్నేళ్లుగా ఇంతే..
ఫార్మసీ సీట్ల భర్తీ కొన్నేళ్లుగా ఇదే మాదిరిగా కొనసాగుతోంది. 2019లో ఫార్మసీలో మొత్తం సీట్లు 3,925 ఉండగా 192 (4.89 శాతం), ఫార్మాడీలో 587 సీట్లకు 17 (2.89 శాతమే) మాత్రమే భర్తీ అయ్యాయి. 2018 ఎంసెట్‌లో కూడా ఫార్మసీ సీట్లు 3,322 ఉండగా 280 (8.42 శాతం), ఫార్మాడీ కోర్సులో 595 సీట్లకుగాను 52 (8.74 శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి.
మేనేజ్‌మెంటు కోటాలోనూ ఖాళీయే
ఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లోని 70 శాతం సీట్లు కన్వీనర్ కోటాలో, మిగతా సీట్లు మేనేజ్‌మెంటు కోటాలో భర్తీ చేస్తుంటారు. ఎంసెట్‌లో భర్తీ అయ్యేవన్నీ కన్వీనర్ కోటా సీట్లు మాత్రమే. కన్వీనర్ కోటాలోని సీట్లలోనే 90 శాతానికి పైగా మిగిలిపోతున్నాయి. ఈ తరుణంలో మేనేజ్‌మెంటు కోటా సీట్లు భర్తీ కావడం మరింత కనాకష్టంగా మారుతోంది.
మూడేళ్లలో ఫార్మసీ, ఫార్మా డీ సీట్ల భర్తీ ఇలా..
| సీట్లు | భర్తీ |
ఫార్మసీ2018 | 3,322 | 280 |
ఫార్మడీ | 595 | 52 |
ఫార్మసీ 2019 | 3,925 | 192 |
ఫార్మడీ | 587 | 17 |
ఫార్మసీ 2020 | 4,133 | 345 |
ఫార్మడీ | 675 | 28 |