Skip to main content

ఎక్సైజ్ శాఖ పునర్ వ్యవస్థీకరణతో పదోన్నతులు వస్తాయా?

సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ శాఖ పునర్ వ్యవస్థీకరణకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలపడంతో గత పదేళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఆ శాఖ సిబ్బందిలో ఉత్సాహం కనిపిస్తోంది.
చాలా కాలంగా నిరుపయోగంగా ఉన్న పోస్టుల స్థానంలో క్రియాశీలంగా ఉన్న పోస్టుల సంఖ్యను, స్టేషన్ల సంఖ్యను పెంచడంతో పదోన్నతులు వస్తాయనే ఆశాభావం వారిలో వ్యక్తమవుతోంది. అయితే పదోన్నతుల ప్రక్రియలో శాఖా పరమైన జాప్యంతో పాటు కోర్టు కేసులు, అవినీతి ఆరోపణలు తమ పదోన్నతులకు ఎక్కడ చెక్ పెడతాయోనన్న ఉత్కం ఠ కూడా ఆ శాఖ సిబ్బందిలో కనిపిస్తోంది. ఏది ఏమైనా కేబినెట్ ఆమోదం మేరకు 131 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాతే ప్రక్రియ ముందుకు కదులుతుందని అధికారులు చెబుతున్నారు.

పదేళ్లలో కానిది.. ఇప్పుడెలా!
వాస్తవానికి, కేబినెట్ నిర్ణయం ప్రకారం ఎక్సైజ్ శాఖలో 131 పోస్టులు క్రియాశీలం కానున్నాయి. ఆ శాఖకు కేటాయించిన మొత్తం పోస్టుల సంఖ్యలో మార్పు ఉండదు. కానీ గతంలో ఉన్న పోస్టులు రద్దయి వేరే కేటగిరీలోకి మారతాయి. ఈ మేరకు అడిషనల్ కమిషనర్ (1), జాయింట్ కమిషనర్ (1), డిప్యూటీ కమిషనర్ (3), అసిస్టెంట్ కమిషనర్ (4), ఈఎస్ (12), ఏఈఎస్ (9), ఇన్‌స్పెక్టర్ (18), ఎస్‌ఐ (2), హెడ్ కానిస్టేబుళ్లు (14), కానిస్టేబుళ్లు (19), మినిస్టీరియల్ సిబ్బంది (48) పోస్టులు పెరుగుతాయి. అయితే పెరిగిన పోస్టుల మేరకు నిబంధనల ప్రకారం పదోన్నతులు పొందేందుకు తగినంత సిబ్బంది ఆ శాఖలో లేరనే చర్చ జరుగుతోంది. దీన్ని అధిగమించాలంటే ఒక్కొక్కరికి డబుల్, త్రిబుల్ పదోన్నతులు ఇవ్వాల్సి ఉంటుందని, ఇది సాధ్యమయ్యే పనేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏటా ఇవ్వాల్సిన పదోన్నతులు గత పదేళ్లుగా ఇవ్వడం లేదని, ఇంతకాలం పదోన్నతులకు అర్హులే లేరా? ఏ కారణంతో ప్రమోషన్స్ నిలిపివేశారు? ఇప్పుడు ప్రమోషన్స్ ఇచ్చేందుకు ఆ కారణాలన్నీ సమసిపోయాయా? అనే ప్రశ్నలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఎక్సైజ్ శాఖ సర్వీస్ వ్యవహారాలపై కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, మద్యం సిండికేట్ ఆరోపణలు ఇంకా తొలగిపోలేదని, గతంలో సీనియారిటీ జాబితాను తిమ్మిని బమ్మిని చేశారని, ఇవన్నీ ఎలా అధిగమిస్తారో అర్థం కావడం లేదని సీనియర్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖలో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారనుంది.
Published date : 10 Aug 2020 02:30PM

Photo Stories