Skip to main content

Good News: ఇక క‌రోనా మూడో దశ పూర్తిగా మ‌టాష్‌.. విద్యాసంస్థలను కూడా పూర్తిగా..

సాక్షి, హైదరాబాద్: కరోనా మూడో దశ పూర్తిగా ముగిసిపోయిందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
coronavirus 3rd wave in india
coronavirus 3rd wave

తెలంగాణలో కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయని, తెలంగాణకు ఇది శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితిపై డీహెచ్‌ మాట్లాడుతూ..  మూడో దశ డిసెంబర్ నుంచి ప్రారంభమైందని, జనవరిలో మూడో దశ ఉద్ధృతి పెరిగిందన్నారు. రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివిటీ రేటు అత్యధికంగా 5 శాతానికి వెళ్లిందని, ప్రస్తుతం 2 శాతం కంటే తక్కువ ఉందన్నారు. మరోవైపు దేశంలో కూడా కరోనా కేసులు లక్షలోపే నమోదవుతున్నాయని, పాజిటివిటీ రేటు భారీగా తగ్గిందన్నారు. 

రెండు నెల్లోనే అదుపులోకి..
రెండేళ్ళుగా కరోనా ప్రపంచాన్ని పట్టిపీడించిందని డీహెచ్‌ అన్నారు. ‘కోవిడ్‌ మొదటి దశ వల్ల 10 నెలలు ఇబ్బంది పడ్డాం. సెకండ్‌ వేవ్‌ ఆరునెలలు పాటు ఇబ్బందులకు గురి చేసింది. ఎంతో మంది ప్రాణాలు బలిగొంది. మూడో దశలో 28 రోజుల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. జనవరి 25న అత్యధికంగా 4,800 కేసులు నమోదయ్యాయి. థర్డ్‌ వేవ్‌ కేవలం రెండు నెల్లోనే అదుపులోకి వచ్చింది. ఈ దశలో మొత్తం కేవలం 3 వేల  మంది మాత్రమే ఆసుపత్రుల్లో చేరారు’ అని వెల్లడించారు.

ఇక ముందు కూడా...
‘ఫీవర్‌ సర్వే వల్ల సత్ఫలితాలు వచ్చాయి. ఫీవర్ సర్వే చేపట్టడం ద్వారా కోటి ఇళ్లలో సర్వే చేశాం.  4 లక్షల మందికి కిట్‌లు అందజేశాం. కోవిడ్‌ నియంత్రణలో వ్యాక్సిన్‌ కీలక ఆయుధంగా పనిచేసింది. ఒమిక్రాన్ వేరియంట్ చాలా సీరియస్ వైరస్.  కానీ వ్యాక్సిన్‌తో దీన్ని అరిగట్టగలిగాం.సూచనలు, జాగ్రత్తలు చేపట్టడం వల్లనే ఒమిక్రాన్ పరిస్థితి విషమించలేదు. ఇంకా ఇప్పటివరకు ఎవరు వ్యాక్సిన్ తీసుకోలేదో వారు తీసుకోవాలి.  ఇక ముందు కూడా కరోనా జాగ్రత్తలు పాటించాలి’ అని సూచించారు.

Omicron: మనిషి చర్మంపై ఒమిక్రాన్‌ ఎన్ని గంటలు బతికుంటుందో ఉంటుందో తెలుసా..?

ఇక‌ ఎలాంటి కోవిడ్‌ ఆంక్షలు లేవ్‌..
రాష్ట్రంలో ఎలాంటి కోవిడ్‌ ఆంక్షలు లేవు. జనవరి 31వ తేదీ వరకే ఆంక్షలు ఉన్నాయి.. వాటిని కూడా పూర్తిగా ఎత్తివేసింది. అన్ని సంస్థలు 100 శాతం పనిచేయొచ్చు. ఉద్యోగులు అందరూ కార్యాలయాకు వెళ్లొచ్చు. ఐటీ కంపెనీలు కూడా వర్క్‌ ఫ్రం హోం తీసేయొచ్చు. విద్యాసంస్థలను కూడా పూర్తిగా ప్రారంభించాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో అయిదు కోట్ల మందికి టీకాలు వేశాలు. 82 శాతం మందికి రెండు డోస్‌లు ఇచ్చాం. వచ్చే కొద్ది నెలలపాటు కొత్త వేరియంట్‌ పుట్టే అవకాశం లేదు. కోవిడ్‌ త్వరలో ఎండమిక్‌ అవుతుంది. భవిష్యత్తులో సాధారణ ఫ్లూలా మారుతుంది.’ అని పేర్కొన్నారు.

Covid Effect: ఊహకందని విషయం ఇది.. 7 నెలల కన్నా ఎక్కువ కాలం మనిషి శరీరంలో...?

మార్చికల్లా కరోనా మ‌టాష్‌..
కరోనా థర్డ్‌ వేవ్‌ దేశాన్ని అల్లాడిస్తున్న వేళ ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) వేసిన అంచనాలు కొత్త ఊపిరిపోస్తున్నాయి.కరోనా పీడ ఎప్పుడు విరగడైపోతుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న ప్రజలు కోవిడ్‌–19 నిబంధనల్ని నిర్లక్ష్యం చేయకుండా తు.చ. తప్పకుండా పాటిస్తే మరో రెండు నెలల్లోనే ఆ మంచిరోజులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో కరోనా మహమ్మారి మార్చి నాటికి ఎండమిక్‌ దశకు చేరుకుంటుందని ఐసీఎంఆర్‌లో వ్యాధుల నివారణ విభాగం చీఫ్‌ సమీరన్‌ పాండా చెప్పారు.

ఒకేసారి..
ఎండమిక్‌ దశ అంటే దేశవ్యాప్తంగా ఒకేసారి కరోనా ఉధృతి కనపడకుండా అక్కడక్కడా విసిరేసినట్లు కొద్ది ప్రదేశాలకు కరోనా వ్యాప్తి పరిమితం కావడం, కరోనా సాధారణ వైరస్‌గా మారిపోయి ప్రజలు దానితో సహజీవనం చేసే పరిస్థితికి చేరుకోవడం. ప్రజలందరూ కోవిడ్‌ రక్షణ కవచాలైన మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, తరచూ చేతులు కడుక్కోవడం వంటివి తప్పనిసరిగా చేస్తూ ఉంటే,  కొత్త వేరియంట్లు ఏవీ పుట్టుకొని రాకపోతే కరోనా ఇక తుది దశకు చేరుకున్నట్టేనని అన్నారు.

ఒమిక్రాన్‌ ఆక్రమిస్తే...
కరోనా ఎండమిక్‌ దశ  మార్చి 11 నుంచి మొదలయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. ‘‘డెల్టా వేరియంట్‌ స్థానాన్ని ఒమిక్రాన్‌ ఆక్రమిస్తే  కరోనాకి అదే ముగింపు అవుతుంది. కొత్తగా ఏ వేరియంట్లు రాకపోతే ఇక కరోనా ముగిసిపోయినట్టే. డిసెంబర్‌ 11 నుంచి మొదలైన కరోనా థర్డ్‌ వేవ్‌ మూడు నెలల్లో ముగిసిపోతుంది’’ అని ఐసీఎంఆర్‌ నిపుణుల బృందం గణిత శాస్త్ర విధానం ఆధారంగా రూపొందించిన అంచనాల్లో వెల్లడైందని పాండా తెలిపారు.   ‘‘మార్చి 11 నుంచి కరోనా ఉధృతి తగ్గిపోతుంది.

 తప్పనిసరిగా..
వివిధ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి  వివిధ దశల్లో ఉందని పాండా చెప్పారు. కరోనా మహమ్మారి రూపాంతరం చెందుతూ ఉంటే దానికి అనుగుణంగా కోవిడ్‌–19 పరీక్షలకు సంబంధించి వ్యూ హాలు మార్చుకుంటామన్నారు. కరోనా పరీక్షలు తగ్గించాలని తాము ఎప్పుడూ రాష్ట్రాలకు చెప్పలేదన్నారు. కరోనా స్వభావం మారినప్పుడల్లా ఐసీఎంఆర్‌ కోవిడ్‌–19 పరీక్షలు, నిర్వహణ వ్యూహాలను మార్చుకుంటూ ఉంటుందని వివరించారు.  

అత్యవసర పరిస్థితులు ఇక ఉండవ్‌..
కోవిడ్‌–19తో విధించే అత్యవసర పరిస్థితులు ఈ ఏడాదితో ముగిసిపోయే అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంచనా వేస్తోంది. వ్యాక్సిన్‌ పంపిణీలో అసమానతలను నిర్మూలించి అందరికీ లభ్యమయ్యేలా చర్యలు చేపడితే కోవిడ్‌–19 మర ణాలు, ఆస్పత్రిలో చేరికలు, లాక్‌డౌన్‌లు వంటివి అరికట్టవచ్చునని డబ్ల్యూహెచ్‌ఒ ప్రతినిధి డాక్టర్‌ మైఖేల్‌ ర్యాన్‌ చెప్పారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ అసమానతలపై వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మైఖేల్‌ ఇలాంటి వైరస్‌లో మన పర్యావరణ వ్యవస్థలో అంతర్భాగంగానే ఎప్పటికీ ఉంటాయన్నారు. అన్ని దేశాలకు సమానంగా టీకా పంపిణీ జరిగితే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ఇక రాకపోవచ్చునని అన్నారు.    

ఫిబ్రవరి 28 వరకు..
న్యూఢిల్లీ: ఒమిక్రాన్‌ కేసుల ఉధృతి కొనసాగుతూ ఉండడంతో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధాన్ని ఫిబ్రవరి 28 వరకు పొడిగించినట్టుగా డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) వెల్లడించింది. అయితే పరస్పర ఒప్పందం ఉన్న దేశాలకు ప్రత్యేక విమానాలు నడుస్తాయని, అందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. కరోనా మొదటి వేవ్‌ సమయంలో 2020 మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమానాలపై డీసీజీఏ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి విడతల వారీగా నిషేధాన్ని కొనసాగిస్తూ వస్తోంది. 40 దేశాలకు ప్రత్యేక విమానాలు మాత్రం యథాతథంగా తడుస్తాయని డీసీజీఏ పేర్కొంది.

 

 

Published date : 08 Feb 2022 05:53PM

Photo Stories