Skip to main content

Covid Effect: ఊహకందని విషయం ఇది.. 7 నెలల కన్నా ఎక్కువ కాలం మనిషి శరీరంలో...?

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచాన్ని రెండేళ్లుగా అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి గురించి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి.
Covid
corona virus

ఇప్పటివరకు మనం ఊహిస్తున్న, అంచనా వేస్తున్న దానికన్నా మరింత ఎక్కువ కాలం మనుషుల శరీరంలో వైరస్‌ యాక్టివ్‌గా ఉంటుందని తాజాగా ఓ పరిశోధనలో తేలింది. పాజిటివ్‌గా తేలిన 14 రోజుల తర్వాత కూడా చాలా మంది యాక్టివ్‌ వైరస్‌ను వెదజల్లే అవకాశముందని, కొందరిలో 7 నెలలకు పైగానే యాక్టివ్‌గా ఉండొచ్చని వెల్లడైంది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు ప్రాంటియర్స్‌ ఇన్‌ మెడిసిన్స్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఫ్రాన్స్‌కు చెందిన పాస్చర్‌ ఇన్‌స్టిట్యూట్, ది యూనివర్సిటీ ఆఫ్‌ సావ్‌పౌలో (యూఎస్‌పీ), బ్రెజిల్‌లోని ఆస్వాల్డో క్రజ్‌ ఫౌండేషన్, ఇతర అంతర్జాతయ శాస్త్రవేత్తల బృందం కలిసి ఈ పరిశోధన చేశాయి.  

ఒక్కొక్కరిలో..! 
బ్రెజిల్‌లోని కొందరు కరోనా పేషెంట్లకు పరిశోధకులు వరుస పరీక్షలు చేశారు. నెగెటివ్‌ వచ్చే దాకా రెండు, మూడుసార్లు ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు నిర్వహించారు. వీరిలో ఇద్దరు పురుషులు, ఓ మహిళలో 70 రోజులకు మించి వైరస్‌ను గుర్తించినట్టు వెల్లడించారు. దీన్ని బట్టి వైరస్‌ సోకిన వారిలో 8 శాతం మంది 2 నెలల కంటే ఎక్కువ కాలం పాటు ఇతరులకు కరోనాను వ్యాప్తి చేసే అవకాశాలున్నాయని వాళ్లు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్‌ సోకిన తర్వాత చివరి దశలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చని అంటున్నారు.

232 రోజుల పాటు వైరస్‌..
38 ఏళ్ల ఓ వ్యక్తిలో 20 రోజులు స్వల్ప లక్షణాలే కనిపించినా అతని శరీర వ్యవస్థల్లో 232 రోజుల పాటు వైరస్‌ కొనసాగినట్టు, మ్యుటెషన్లు జరిగినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనాకు ఆ వ్యక్తి క్రమం తప్పకుండా చికిత్స తీసుకోకుండా, మాస్క్‌ ధరించకుండా, వ్యక్తుల మధ్య దూరం పాటించకుండా ఉండి ఉంటే ఆ 7 నెలల్లో ఎంతో మందికి వైరస్‌ వ్యాప్తి చెందించి ఉండేవాడని చెప్పారు.  

14 రోజుల తర్వాత..
కరోనా వచ్చాక 14 రోజుల తర్వాత కూడా ప్రజలు ‘యాక్టివ్‌ వైరస్‌’ను కలిగి ఉండి ఇతరులకు వ్యాప్తి చెందించే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఈ పరిశోధనలో ముఖ్యపాత్ర పోషించిన పౌలా మినోప్రియో వెల్లడించారు. అందువల్ల కరోనా సోకిన వారు ఎక్కడెక్కడ ఉన్నారు, వారి ఆరోగ్య పరిస్థితి ఏంటో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా మరిన్ని మ్యుటేషన్లు, కొత్త వేరియెంట్లు వచ్చే అవకాశాలపై కన్నేసి ఉంచొచ్చని అంటున్నారు. పేషెంట్‌కు నెగెటివ్‌ రావడానికి నెల రోజులు పడుతుందని, కొన్ని కేసుల్లో 71 రోజుల నుంచి 232 రోజుల వరకు ఉండొచ్చని అధ్యయనం చెబుతోందన్నారు. ఐతే ఇలా వ్యాప్తి జరిగి అందరిలో యాంటీబాడీస్‌ ఏర్పడే అవకాశముందని కొందరు అంటున్నారు. 

మనిషి చర్మంపై ఒమిక్రాన్‌ ఎన్ని గంటలు బతికుంటుందంటే..?

omicron variant


కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పంజా విసురుతున్న విషయం తెలిసిందే.ఇప్పటి వరకు వెలుగుచూసిన వేరియంట్ల కంటే అత్యంత వేగంగా ఒమిక్రాన్‌ వ్యాపిస్తోంది. అయితే ఒమిక్రాన్‌ ఎందుకు ఇంత ఎక్కువగా వ్యాప్తి చెందుతోందనే కారణం తాజాగా బయటపడింది. మనిషి శరీరంపై 21 గంటలపాటు ఒమిక్రాన్‌ వేరియంట్‌ నిలిచి ఉంటుందని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. అంతేకాదు ప్లాస్టిక్‌పై ఈ వేరియంట్‌ 8 రోజులపాటు సజీవంగా ఉంటుంది తేలింది. జపాన్‌కు చెందిన క్యోటో ప్రిఫెక్చురల్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు.

ఆల్ఫా, బీటా, డెల్టా వేరియంట్లతో పోలిస్తే.. 
వుహాన్‌లో ఉద్భవించిన సార్క్‌ సీఓవీ2 ఒరిజినల్‌ వేరియంట్‌తోపాటు ఇతర వేరియంట్లపై పరిశోధనలు చేసి ఈ నిర్ధారణకు వచ్చారు. ఆల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్‌ వేరియంట్లు ఒరిజినల్‌తో పోలిస్తే మనిషి చర్మంపై, ప్లాస్టిక్‌పై రెండు రెట్లు అధికంగా జీవించి ఉన్నట్లు గుర్తించారు. ఒమిక్రాన్‌ ఇతర అన్నీ వేరియంట్ల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నందున డెలట​ఆ వేరియంట్‌ కంటే కూడా అధికంగా వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు గుర్తించారు. 

అన్నింటికి మించి.. 
ప్లాస్టిక్‌ సర్ఫేస్‌లపై ఒరిజనల్‌ వేరియంట్‌ 56 గంటలు, ఆల్ఫా వేరియంట్‌ 191.3 గంటలు, బీటా వేరియంట్‌ 156.6 గంటలు, గామా వేరియంట్‌ 59.3 గంటలు, డెల్టా వేరియంట్‌ 114 గంటలు సజీవంగా ఉంటుందని తేల్చి చెప్పారు. వీటన్నింటికి మించి ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్లాస్టిక్‌పై 193.5 గంటలపాటు సజీవంగా ఉండనున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు.

అదే విధంగా చర్మం మీద ఒరిజినల్‌ వేరియంట్‌ 8.6 గంటలు, ఆల్ఫా వేరియంట్‌ 19.6 గంటలు, బీటా 19.1 గంటలు, డెల్టా 16.8 గంటలు, ఒమిక్రాన్‌ 21.1 గంటలు ఉంటుందని తెలిపారు. కాగా ఆల్ఫా, బీటా వేరియంట్‌ల మధ్య మనుగడ సామర్థ్యంలో గణనీయమైన తేడా లేదు. ఇవి ఇంతకముందు అధ్యయనాల ఫలితాలకు అనుగుణంగా ఉందని పరిశోధకులు తెలిపారు.

Published date : 30 Jan 2022 11:25AM

Photo Stories