భాషాపండితులు, పీఈటీ పదోన్నతులకు లైన్ క్లియర్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: భాషా పండితులు, పీఈటీల పదోన్నతులకు మార్గం సుగమమైంది.
గత కొన్నేళ్లుగా ఈ పదోన్నతుల విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరదించుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై భాషా పండితులకు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ (తెలుగు/హిందీ/ఇంగ్లిష్) పదోన్నతులు కల్పిస్తారు. అదేవిధంగా పీఈటీలుగా నియమితులైన వారికి మాత్రమే ఫిజికల్ డైరెక్టర్‌గా పదోన్నతి ఇస్తారు. ఇంతకు ముందు ఎస్జీటీ కేటగిరీలో ఉన్న వాళ్లకు సైతం అర్హతల ఆధారంగా స్కూల్ అసిస్టెంట్ (తెలుగు/హిందీ/ఇంగ్లిష్), ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల్లో అర్హత కల్పించేవారు. సవరించిన నిబంధనల ప్రకారం ఎస్జీటీలు ఈ పోస్టులకు అర్హులు కారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు వేరువేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న 8,630 భాషాపండిత పోస్టులు, 1,849 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని పాఠశాల విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
Published date : 29 Mar 2021 04:12PM