Skip to main content

ఉజ్వల కెరీర్.. బ్యాంకింగ్

‘బ్యాంకింగ్ రంగం.. బ్యాంకుల్లో కొలువులు అంటే కేవలం మనకు కనిపించే క్లరికల్, ఆఫీసర్ పోస్ట్‌లు మాత్రమే కాదు.
బ్యాంకింగ్ రంగంలో మరెన్నో విభాగాల్లో సరికొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో బ్యాంకింగ్‌రంగంలోనూ టెక్నాలజీ ఆధారిత సేవలు పెరుగుతున్నాయి. దీనికి అనుగుణంగా బ్యాంకుల్లో ఐటీ విభాగంలో ఎన్నెన్నో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి’ అంటున్నారు.. టెక్నాలజీ ఆధారిత బ్యాంకింగ్ సేవల ఆవశ్యకతను గుర్తించి ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన ఇన్‌స్టిట్యూట్ ఫర్డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడీఆర్‌బీటీ) డెరైక్టర్ డాక్టర్ ఎ.ఎస్.రామశాస్త్రి. బ్యాంకింగ్ రంగంలోనూ రీసెర్చ్ అవకాశాలకూ కొదవ లేదని ఆయన పేర్కొంటున్నారు. ఐఐటీ చెన్నైలో పీహెచ్‌డీ చేసి ఆర్‌బీఐలో పలు విభాగాల్లో మూడు దశాబ్దాలకుపైగా అనుభవం గడించి.. ప్రసుతం ఐడీఆర్‌బీటీ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్న రామశాస్త్రితో ప్రత్యేక ఇంటర్వ్యూ.

అకడమిక్ + ప్రొఫెషనల్ అప్రోచ్ లక్ష్యంగా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1995లో ఏర్పాటు చేసిన సంస్థ ఐడీఆర్‌బీటీ. దీనికి ప్రధాన కారణం ఆ రోజుల్లో బ్యాంకుల్లో టెక్నాలజీ వినియోగం, అవగాహన తక్కువగా ఉండేది. ఈ నేపథ్యంలో బ్యాంకులు టెక్నాలజీని అనుసరించేందుకు, అవసరమైన విధానాలు, మార్గదర్శకాలు రూపొందించేందుకు ఐడీఆర్‌బీటీని ప్రారంభించింది. ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటైన నాటి నుంచి బ్యాంకింగ్ టెక్నాలజీలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ దిశగా చర్యలు చేపడుతోంది. మరోవైపు ఎంటెక్ వంటి అకడమిక్ కోర్సులు, బ్యాంక్ ఆఫీసర్లకు శిక్షణ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

బ్యాంకింగ్‌లోనూ రీసెర్చ్ అవకాశాలు
రీసెర్చ్ అంటే కేవలం సైన్స్, ఇంజనీరింగ్‌కే పరిమితం కాదు. బ్యాంకింగ్‌లోనూ ఈ అవకాశం ఉంది. ఉదాహరణకు మ్యాథమెటిక్స్‌లోని క్రిప్టోగ్రఫీ ఫండమెంటల్ రీసెర్చ్ బ్యాంకింగ్‌లో ఆవిష్కరణలకూ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ రంగంలో మొబైల్ పేమెంట్స్, అనలిటిక్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, నెట్‌వర్క్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బయో మెట్రిక్స్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ మొదలైనవి ముఖ్యమైన రీసెర్చ్ అంశాలుగా ఉన్నాయి.

బ్యాంకు కొలువులకు సరితూగే అకడమిక్స్
నేటి యువతలో బ్యాంకు కొలువులంటే ఎనలేని క్రేజ్ అనేది నిస్సందేహం. అకడమిక్స్ పరంగా ఎకనామిక్స్, బ్యాంకింగ్, కామర్స్, అకౌంటెన్సీ, ఫైనాన్స్ మేనేజ్‌మెంట్, ఆడిటింగ్ నేపథ్యం ఉంటే సంప్రదాయ బ్యాంకు కొలువులకు సరితూగుతారు. కానీ బ్యాంకులు అన్ని నేపథ్యాల అభ్యర్థులను నియమించుకుని తమకు అవసరమైన రీతిలో శిక్షణనిస్తున్నాయి. మరోవైపు గత కొన్నేళ్లుగా బ్యాంకులు నిర్వహిస్తున్న కార్యకలాపాలు, సేవల్లో సాంకేతికతను (ఉదా: ఏటీఎం, ఇంటర్నెట్ సేవలు, మొబైల్ బ్యాంకింగ్) అమలు చేస్తున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా.. కొత్త టెక్నాలజీలను వినియోగించి మరిన్ని కొత్త సేవలు, ఉత్పత్తులు రూపొందించడంలో కృషి చేస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఈ రంగంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు అవకాశాలు పెరుగుతున్నాయి. జనరల్ పోస్ట్‌లతోపాటు ప్రత్యేకంగా ఐటీ విభాగాల్లో టెక్నాలజీ స్పెషలిస్ట్‌ల నియామకాలు చేపడుతున్నాయి.

ఐడీఆర్‌బీటీలో అకడమిక్ ఎంట్రీ
ప్రస్తుతం ఐడీఆర్‌బీటీ.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సులను నిర్వహిస్తోంది. హెచ్‌సీయూ నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా సీట్ల భర్తీ జరుగుతుంది. ఎంటెక్‌లో బ్యాంకింగ్ టెక్నాలజీ, పేమెంట్ సిస్టమ్స్ టెక్నాలజీ, క్వాంటిటేటివ్ మెథడ్స్ ఫర్ ఫైనాన్స్ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తి చేసిన విద్యార్థులకు బ్యాంకులతోపాటు సాఫ్ట్‌వేర్ సంస్థలు, బ్యాంకింగ్ ప్రాజెక్ట్‌లు చేపడుతున్న ఐటీ సంస్థల్లోనూ ఉద్యోగాలు లభిస్తాయి. పీహెచ్‌డీ విషయానికొస్తే ఎన్నో అంశాలపై రీసెర్చ్ చేసే అవకాశం ఉంది. బ్యాంకింగ్ అప్లికేషన్స్‌కు సంబంధించి రీసెర్చ్ ఎక్కువగా జరుగుతుంది.

భవిష్యత్తు ఉజ్వలం
బ్యాంకింగ్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతోంది. కారణం.. ఈ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులే. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, జన్‌ధన్ యోజన వంటి పథకాల ప్రారంభం కారణంగా బ్యాంకులు దేశంలో ప్రతి ఒక్కరికీ సేవలందించే ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. వీటి సమర్థ అమలుకు కార్యకలాపాల విస్తరణ ఆవశ్యకత... ఫలితంగా భారీఎత్తున మానవ వనరుల అవసరం ఏర్పడుతుంది. అదే విధంగా కొత్త బ్యాంకులకు లెసైన్స్‌లు మంజూరు వంటివి కూడా ఈ రంగంలో ఉద్యోగాల కల్పనకు మార్గం వేస్తున్నాయి. మరెన్నో చిన్న బ్యాంకులు కూడా ఈ రంగంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా బ్యాంకుల్లో వేల సంఖ్యలో కొలువులకు మార్గం వేసేవే. కొత్తగా వచ్చే బ్యాంకులు కూడా టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు అధిక శాతం అవకాశాలు కల్పించనున్నాయి. కారణం.. అవి ప్రారంభంలో పూర్తి టెక్నాలజీ బ్యాంకులుగా రానుండటం.

అవసరమైన నైపుణ్యాలు
బ్యాంకులు ఇప్పుడు అన్ని నేపథ్యాలు ఉన్న అభ్యర్థులను నియమించుకుంటున్నాయి. ఔత్సాహికులకు కావాల్సిందల్లా నిబద్ధతతో పని చేయాలనే దృక్పథం. ప్రస్తుతం బ్యాంకులు ఆప్టిట్యూడ్ టెస్ట్‌లలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. ఈ టెస్ట్‌లలో ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్‌లను పరీక్షిస్తాయి. కాబట్టి అభ్యర్థులు ఈ నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. అటు టెక్నాలజీ కోణంలోనూ డేటా సెంటర్స్, నెట్‌వర్క్స్, డేటా బేసెస్ తదితర విభాగాల్లో.. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీపైనా బ్యాంకులు ఇప్పుడు ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆడిటర్స్, ఎథికల్ హ్యాకర్స్ వంటి నిపుణుల అవసరం ఏర్పడుతోంది. వీటికితోడు డేటా వేర్ హౌసింగ్, డేటా మైనింగ్, అనలిటిక్స్‌లో నైపుణ్యాలు కూడా బ్యాంకు కొలువులకు మార్గం వేస్తాయి.

అకడమిక్స్, కమ్యూనికేషన్ రెండూ ఉంటేనే
నేటి పోటీ ప్రపంచంలో ఏ రంగమైనా ఔత్సాహికులకు అకడమిక్స్‌తోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రధానంగా మారాయి. దీంతో విద్యార్థులు ముందుగా అకడమిక్స్‌లో పట్టు సాధించాలి. తర్వాత కెరీర్ లక్ష్యంగా ఎంచుకున్న రంగానికి సంబంధించి ఆప్టిట్యూడ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా కష్టపడే తత్వం, నిరంతరం నేర్చుకునే నైపుణ్యాలు ఉంటే ఏ రంగంలోనైనా ఉన్నత స్థానాలు అధిరోహించవచ్చు!

వృత్తిపరమైన సంతృప్తి
దేశంలో బ్యాంకింగ్ రంగం నిరంతరం వృద్ధి చెందుతున్న రంగం. సమీప భవిష్యత్తులో మరింత వృద్ధి సాధిస్తుందని అంచనా. కెరీర్ పరంగా ఎంతో క్రేజ్ ఉన్న రంగం బ్యాంకింగ్. ఒకవైపు సుస్థిర భవిష్యత్తును, మరో వైపు సమాజానికి సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. ఎన్నో గ్రామాల్లో బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లు, సిబ్బంది.. అన్ని వర్గాల ఉన్నతికి ఎంతో కీలక పాత్ర వహిస్తున్నారు. అదే విధంగా ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ వంటి చర్యల కారణంగా పేద ప్రజలకు కూడా సహకారం అందించగలుగుతున్నారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే బ్యాంకుల్లో పనిచేయడం వల్ల వ్యక్తిగత లబ్ధితోపాటు వృత్తిపరమైన సంతృప్తిని కూడా పొందొచ్చు.
Published date : 24 Nov 2014 05:50PM

Photo Stories