Skip to main content

గణిత ప్రావీణ్యం కాదు...పాలన అభిరుచిని గుర్తించాలి

దేశంలో లక్షలాది మంది యువత కలల కెరీర్ సివిల్స్. అలాంటి ఉన్నత కెరీర్‌లోకి సివిల్ సర్వెంట్లను ఎంపిక చేయాల్సిన పరీక్షపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 2011లో ప్రవేశపెట్టిన సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీశాట్).. ఇప్పుడు దేశవ్యాప్తంగా పెనుదుమారం సృష్టిస్తోంది. ఈ పరీక్ష సివిల్ సర్వీసెస్ ఔత్సాహికుల ఆశలపై నీళ్లుచల్లేలా ఉందనే తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. దేశానికి ఉత్తమమైన పాలనాదక్షులను ఎంపిక చేయాల్సిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో.. గణితం, ఇంగ్లిష్‌పై పట్టు ఉన్నవారిని ఎంపిక చేస్తున్నారంటున్నారు ఆర్.సి.రెడ్డి స్టడీసర్కిల్ డెరైక్టర్ ఆర్.సి.రెడ్డి. సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక పరీక్ష.. పాలన అభిరుచిని గుర్తించేలా ఉండాలని, అన్ని మాధ్యమాల్లో పరీక్ష నిర్వహించాలని అంటున్న ఆర్.సి.రెడ్డితో ప్రత్యేక ఇంటర్వ్యూ...

బాధ్యతలకు తగ్గ ఎంపిక విధానం ఉండాలి
సివిల్స్ ఎంపిక ప్రక్రియ మూస ధోరణిలో అందరినీ ఒకే గాటన కట్టేలా ఉండకూడదు. చేపట్టాల్సిన బాధ్యతలకు తగ్గట్టు ఎంపిక విధానం ఉండాలి. చేయబోయే పనికి అవసరమైన ప్రతిభా సామర్థ్యాలను పరీక్ష ద్వారా గుర్తించాలి. అయితే, యూపీఎస్సీ ఎంపిక ప్రక్రియ ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. అభ్యర్థి అభిరుచి తెలుసుకునేందుకు ఆప్టిట్యూడ్ టెస్ట్ అవసరమే. అందుకోసం పరీక్షలో పరిపాలనా సంబంధమైన ప్రశ్నలను ఇచ్చి పరిష్కరించమనాలి. అధికారులుగా తమకు ఎదురయ్యే సవాళ్లు, సమస్యలను ఏవిధంగా పరిష్కరిస్తారో గుర్తించేందుకు అది చక్కటి మార్గం. ఆప్టిట్యూడ్ పేపర్‌లో 6 ప్రశ్నలు మాత్రమే పాలనా ప్రతిభను పరీక్షించేవిగా ఉంటున్నాయి. మిగతా ప్రశ్నలన్నీ మ్యాథ్స్‌కు సంబంధించినవే! దాంతో గణితేతరులు తాము నష్టపోతున్నామని వాపోతున్నారు. మూడేళ్ల నుంచి సీశాట్ నిర్వహిస్తున్నా.. ఇటీవల సమాచార హక్కుచట్టం ద్వారా ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెల్లడి కావడంతో వాస్తవాలు బయటకు వచ్చాయి. గణితేతర అభ్యర్థులకు మార్కులు తగ్గాయనేందుకు యూపీఎస్సీ ఇచ్చిన సమాచారమే నిదర్శనం.

ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ క్లిష్టంగా ఉంది
1979 నుంచి 2011 వరకూ ఉన్న సిలబస్‌తో అన్ని విభాగాల అభ్యర్థులూ పోటీపడేందుకు అవకాశం ఉండేది. 2011లో ఆప్షనల్ స్థానంలో ఆప్టిట్యూడ్ టెస్ట్ చేర్చారు. 6 ప్రశ్నలు తప్ప మిగతావన్నీ ఏ మాత్రం పాలనా అభిరుచికి సంబంధం లేనివి. సీశాట్‌ను పరిశీలిస్తే ఇంగ్లిష్ కాంప్రహెన్షన్.. సగటు విద్యార్థి స్టాండర్డ్‌కు మించి ఉంది. క్లిష్టమైన ప్యాసేజ్‌లు ఇస్తున్నారు. దాంతో తెలుగు, ఇతర ప్రాంతీయ భాషల విద్యార్థులకు ప్రిలిమినరీ పరీక్ష కష్టంగా మారింది. కీలకమైన బాధ్యతలు చేపట్టే అధికారికి అన్ని అంశాలపై పరిజ్ఞానం ఉండటం అవసరమే. అయితే మరీ ఇంత క్లిష్టత ఉండ కూడదు. ఇంగ్లిష్‌పై అవగాహనతోపాటు గణాంకాలపై పట్టు ఉండాలనే ఉద్దేశంతో గతంలో ‘స్టాటిస్టికల్ ఎనాలసిస్’ నుంచి కూడా ప్రశ్నలిచ్చేవారు.

హిందీ అభ్యర్థులకు కొంత అనుకూలమే!
ఇతర ప్రాంతీయ భాషల వారితో పోల్చితే హిందీ మాధ్యమం వారికి సీశాట్ కొంత అనుకూలమనే చెప్పాలి. ఎందుకం.టే.. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఇంగ్లిష్, హిందీ భాషల్లో నిర్వహిస్తారు. హిందీలో ప్రశ్నపత్రం ఉండటం వల్ల ప్రశ్నలను అర్థం చేసుకోవడం ఆ భాషలో చదువుకున్న అభ్యర్థులకు తేలికవుతుంది. ఇతర ప్రాంతీయ భాషల అభ్యర్థులకు ఈ వెసులుబాటు లేదు.

పాలనలో రాణించేవారిని గుర్తించేలా పరీక్ష ఉండాలి..
మూడేళ్లుగా సివిల్స్ సర్వీసెస్‌కు ఎంపికవుతున్న అభ్యర్థులను గమనిస్తే.. ఐఐటీలు, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, మెడిసిన్ నేపథ్యాల నుంచి వచ్చినవారే జాబితాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. సోషల్ సెన్సైస్ అభ్యర్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అంతమాత్రాన ఐఐటీల్లో చదివిన వారు అనర్హులని చెప్పట్లేదు. ఆయా రంగాల్లో నిపుణులైన వారు పరిపాలనలో రాణిస్తారని నిర్ధారించడం సరికాదంటున్నాను. శాస్త్ర, సాంకేతిక రంగాల నిపుణులు కూడా దేశానికి అవసరమే. పాలనాపరమైన ఉద్యోగానికి కాకుండా.. ఐఈఎస్, బ్యాంకింగ్, ఫైనాన్స్ జాబ్స్‌కు ఎంపిక కోసం మ్యాథ్స్, రీజనింగ్ వంటివి కావాలి. అభ్యర్థులకు కనీస పరిజ్ఙానం అవసరమని భావిస్తే మెయిన్స్‌లో ఇవ్వొచ్చు. కానీ ప్రస్తుత విధానంతో ప్రిలిమినరీ దశలోనే గణితేతర ప్రతిభావంతుల్ని బయటకు పంపించడం సరికాదు. అభ్యర్థుల్లో పాండిత్యాన్ని కాకుండా.. పాలనలో ఎంతవరకూ రాణించగలరనే అంశాన్ని గుర్తించేలా ప్రశ్నల రూపకల్పన చేయాలి.

భావోద్వేగ నైపుణ్యంపై ప్రశ్నలు
బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో పాలనలో కీలకమైన బాధ్యతలు అప్పగించే ముందు ఆయా వ్యక్తులను అంచనా వేసేందుకు కొన్ని ప్రామాణికాలను అనుసరిస్తున్నారు. అన్ని స్థాయిల వ్యక్తులతో మెలిగేతీరు.. మాటతీరు.. కిందిస్థాయి సిబ్బందితో పనిచేయించే శైలి.. ఎదుటి వ్యక్తి భావోద్వేగాలను అర్థం చేసుకోవడం వంటివి పరిశీలిస్తున్నారు. మన దేశంలోనూ ఆర్మీలో ఎంపికకు సర్వీస్ సెలక్షన్ బోర్‌‌డ(ఎస్‌ఎస్‌బీ) అభ్యర్థుల నాయక త్వ లక్షణాలను పరిశీలిస్తుంది. సివిల్ సర్వెంట్‌గా అభ్యర్థిలో భావోద్వేగ నైపుణ్యం(ఎమోషనల్ ఇంటెలిజెంట్)ను కనిపెట్టేలా ప్రశ్నలుం డాలి. దైనందిన వ్యవహారాల్లో ఎదుర య్యే సవాళ్లను, సమస్యలను పరిష్కరించేందుకు వారు చూపే చొరవను పసిగట్టగలగాలి. వారి మానవ నైజం తెలియాలి.

అన్ని మాధ్యమాల్లో పరీక్ష నిర్వహించాలి
పాలనాపరమైన ఇబ్బందులు, దేశం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రశ్నపత్రంలో పొందుపర్చవచ్చు. పేరుకే ఇంటర్ పర్సనల్ స్కిల్స్.. ఒక్క ప్రశ్న కూడా దానిపై ఇవ్వడం లేదు. తెలివితేటలు అనేక రకాలు.. ఫలానా అంశాలు తెలిస్తేనే తెలివిగలవారంటూ నిర్ధారించడం సరికాదు. పాలన, గణిత ప్రతిభాపాటవం, శాస్త్ర, సాంకేతిక, భాష, నటన, చిత్రలేఖన అంశాల్లో తెలివితేటలు పలు రకాలుగా ఉంటాయి. సివిల్‌సర్వీసెస్ పరీక్ష నిష్ణాతులను కాకుండా.. పరిజ్ఞానం ఉన్న వారిని ఎంపిక చేసేలా ఉండాలి. సులభమైన ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ ఇవ్వాలి. అన్ని మాధ్యమాల్లో పరీక్ష నిర్వహించాలి. ఈ పరీక్షలో పాలనా పరమైన అభిరుచిని, నాయకత్వ లక్షణాలను పరిశీలించాలి.

ఆప్టిట్యూడ్ టెస్ట్.. సోషల్ సెన్సైస్ అభ్యర్థులకు పెద్ద అడ్డంకి
ప్రస్తుతం సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో గట్టెక్కాలంటే 240/400 పైగా మార్కులు తెచ్చుకోవాల్సిందే. 2013 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన జనరల్ అభ్యర్థుల కటాఫ్ మార్కులు 241. 2013లో 3,23,949 మంది ప్రిలిమ్స్ రాస్తే.. మెయిన్స్‌కు అర్హత సాధించింది 14,959 మంది మాత్రమే. వీరిలో గణితం నేపథ్యం ఉన్నవారే అధికం. పేపర్-2లో ఆర్ట్స్, హుమానిటీస్ అభ్యర్థులు మ్యాథ్స్‌వారితో పోటీపడలేకపోతున్నారు. ఫలితంగా ప్రతిభ ఉన్నప్పటికీ మెయిన్స్‌కు అర్హత సాధించలేకపోతున్నారు. గణితం నేపథ్యం కలిగిన అభ్యర్థులు పేపర్-1లో తక్కువ మార్కులు సాధించినా.. పేపర్-2లో స్కోరు చేసి విజేతలుగా నిలుస్తున్నారు. అంటే.. గణితేతర అభ్యర్థులు ప్రిలిమ్స్‌లో క్వాలిఫై కాకపోవడానికి ఆప్టిట్యూడ్ టెస్ట్ అడ్డంకి అనేది స్పష్టమవుతోంది. ఇవన్నీ మూడేళ్ల తర్వాత బయటకు వచ్చాయి కాబట్టే సోషల్ సెన్సైస్ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో మ్యాథ్స్ సంబంధమైన ఒక్కో ప్రశ్నకు ఇచ్చిన సమయం 90 సెకన్లు. గణితేతర అభ్యర్థికి ప్రశ్నను అర్థం చేసుకునేందుకూ ఆ సమయం చాలదు.
Published date : 09 Aug 2014 12:02PM

Photo Stories