Skip to main content

ప్రశ్నపత్రాల రూపకల్పనలో ప్రక్షాళన

‘సాక్షి’తో ఏపీపీఎస్సీ చైర్మన్ చిత్తరంజన్ బిస్వాల్
‘కీ’లక తప్పులు సవరిస్తాం.. వివిధ పరీక్షల్లో దొర్లిన పొరపాట్లపై నిపుణుల కమిటీలు
గ్రూపు-2 ఎగ్జిక్యూటివ్ పోస్టుల విలీనం వాయిదా వేయాలని సర్కార్‌కు లేఖ రాస్తాం
ఏప్రిల్‌లో కొత్త నోటిఫికేషన్లు


ప్రతిభావంతులైన అభ్యర్థులకు అన్యాయం జరగకుండా చూడటమే లక్ష్యంగా ఉద్యోగ నియామక పరీక్షల ప్రశ్నపత్రాల రూపక్పలనలో సమూల మార్పులు తెస్తామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) చైర్మన్ చిత్తరంజన్ బిస్వాల్ వెల్లడించారు. వివిధ పోటీ పరీక్షల ‘కీ’లలో దొర్లిన పొరపాట్లను సరిదిద్ది అర్హులైన వారికి న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన బిస్వాల్ ‘సాక్షి’తో మాట్లాడారు. భవిష్యత్తులో అభ్యర్థులు ఎవరికీ అన్యాయం జరక్కుండా తీసుకోనున్న చర్యలను వివరించారు. పలు పోటీ పరీక్షల ‘కీ’లలో పొరపాట్లను సాక్షి వెలుగులోకి తెచ్చిన నేపథ్యంలో నిపుణుల కమిటీతో పరిశీలన జరిపి చర్యలు చేపడతామని తెలిపారు. గ్రూపు-1 ప్రిలిమ్స్ తుది ‘కీ’లో దొర్లిన నాలుగు తప్పుల విషయంపై కోర్టు ఉత్తర్వుల కాపీ అందాక నిపుణుల కమిటీని నియమిస్తామని చెప్పారు. ఈనెల 6వ తేదీన నిర్వహించిన పాలిటెక్నిక్ లెక్చరర్ల రాత పరీక్షలో ఓ ప్రైవేటు బిట్‌బ్యాంక్ పుస్తకంలోని 120 ప్రశ్నలను, జవాబుల ఆప్షన్లను యథాతథంగా ఇవ్వడం సరైంది కాదని బిస్వాల్ అభిప్రాయపడ్డారు. దీన్ని నిపుణుల కమిటీకి నివేదిస్తామని చెప్పారు. ఇంకా బిస్వాల్ వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే..

రకరకాలుగా అన్వయించే ప్రశ్నలు నివారిస్తాం

భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు దొర్లకుండా ప్రశ్నపత్రాల రూపకల్పనలో పకడ్బందీ చర్యలు చేపడతాం. ప్రశ్నలు అడిగే తీరులో మార్పులు తెస్తాం. ఒక ప్రశ్నను వివిధ కోణాల్లో ఆడగవచ్చు. పుస్తకాల్లోని ప్రశ్నలనే యథాతథంగా ఇవ్వకుండా, మార్పులు చేసి అభ్యర్థిని పరీక్షించేలా చర్యలు చేపడతాం. రెండు రకాలుగా అన్వయించేందుకు వీలుండే(డ్యూయల్ ఆప్షన్లు) ప్రశ్నలను ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ అంశాలపై ప్రశ్నపత్రాలు రూపొందించే ప్రొఫెసర్లతో చర్చించి అభ్యర్థులకు మేలు చేకూరేలా చూస్తాం. అంతేకాదు 150 ప్రశ్నలతో ప్రశ్నపత్రాన్ని రూపొందించాల్సి వచ్చినపుడు మరో 50 ప్రశ్నలను అదనంగా రూపొందించేలా చర్యలు చేపడతాం. దీనివల్ల ప్రొఫెసర్లు మరోసారి సరిచూసుకుని డ్యూయల్ ఆప్షన్లు ఉండే ప్రశ్నలను తొలగించి తుది ప్రశ్నపత్రాన్ని రూపొందించడం సులభం అవుతుంది. మున్సిపల్ విభాగంలో జూనియర్ అకౌంటెంట్ పరీక్ష కీలో పొరపాట్లు దొర్లినట్లు వచ్చిన ఫిర్యాదులను నిపుణుల కమిటీతో పరిశీలన జరిపి తగిన చర్యలు చేపడతాం.

ఇద్దరు ప్రొఫెసర్లతో పరిశీలన..

గ్రూపు-1 మెయిన్స్ లాంటి డిస్క్రిప్టివ్ జవాబు పత్రాల మూల్యాంకనంపై వస్తున్న ఫిర్యాదులపై చర్యలు చేపడతాం. ఉదాహరణకు గ్రూపు-1 మెయిన్స్ నాలుగో పేపరును భౌతిక, రసాయన, వృక్ష, జంతు, పర్యావరణ శాస్త్రాలకు సంబంధించిన సిలబస్‌తో రూపొందిస్తారు. ఈ పేపరు మూల్యాంకనం ఒక ప్రొఫెసర్‌తోనే చేయిస్తున్నారని, అయితే ఆ ప్రొఫెసర్ ఒకే సబ్జెక్టులో నిపుణులై ఉంటారని, దీనివల్ల తమకు అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు పేర్కొంటున్నారు. దీన్ని నివారించేందుకు డబుల్ వాల్యుయేషన్ చేయిస్తున్నాం. అయినా అభ్యర్థులకు అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఇద్దరు లేదా ముగ్గురితో మూల్యాంకనం చేయించాలని భావిస్తున్నాం. దీనిపై కమిషన్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.

గ్రూపు-2 విలీనం ఈసారి ఉండకపోవచ్చు

గ్రూపు-1లో గ్రూపు-2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను విలీనం చేస్తూ ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. పలువురు అభ్యర్థులు దీన్ని మా దృష్టికి తెచ్చారు. గ్రూపు-2 ఎగ్జిక్యూటివ్ పోస్టుల విలీనాన్ని కొంతకాలం వాయిదా వేయాలని ప్రభుత్వానికి లేఖ రాశాం. కొత్త విధానం తెచ్చినపుడు కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే లేఖ రాశాం. ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. వాయిదా వేసేందుకే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో జారీ అయ్యే గ్రూపు-1, గ్రూపు-2 నోటిఫికేషన్లలో ఈ విలీనం ఉండకపోవచ్చు.

వచ్చే నెలాఖరులోగా అన్ని ఫలితాల వెల్లడి

ఇప్పటివరకు రాత పరీక్షలు పూర్తయిన వివిధ పోస్టుల ఫలితాలను దశలవారీగా వెల్లడించేందుకు చర్యలు చేపడుతున్నాం. అభ్యర్థుల నుంచి వ్యక్తమైన అభ్యంతరాలపై క్షుణ్నంగా పరిశీలన జరిపిస్తున్నాం. అభ్యర్థులకు అన్యాయం జరక్కుండా పరిశీలన నిర్వహిస్తున్నందున ఫలితాల వెల్లడిలో కొంత ఆలస్యం అవుతోంది. అభ్యంతరాలపై నిపుణుల కమిటీ నుంచి వివరణలు అందిన ఫలితాలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తాం. ఎక్కువమంది అభ్యర్థులు హాజరైన గ్రూపు-2, గ్రూపు-4, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ లాంటి పోస్టుల ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. ఫిబ్రవరి నెలాఖరు వరకు అన్ని నోటిఫికేషన్ల ఫలితాలు వెల్లడించేలా చర్యలు చేపడతాం.

ఖాళీల వివరాలతో వార్షిక కేలండర్ తయారీ..

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వార్షిక కేలండర్‌ను అమలు చేస్తాం. వివిధ శాఖల నుంచి అందిన ఖాళీల సమాచారాన్ని అనుసరించి ఆర్థికశాఖ అనుమతులు లభించిన పోస్టుల భర్తీకి ఏర్పాట్లు చేస్తాం. ఫిబ్రవరి, మార్చి నెలాఖరు వరకు వివిధ శాఖల నుంచి అందే ఖాళీ పోస్టులకు ఏప్రిల్‌లో నోటిఫికేషన్లు జారీ చేసేలా చర్యలు చేపడతాం.

ప్రభుత్వం అనుమతిస్తే రిజర్వేషన్ల వారీగా ఎంపిక

గ్రూపు-1 మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపికను రిజర్వేషన్లవారీగా చేపట్టాలని 2011 అక్టోబర్‌లో కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ విధానం అమోదం కోసం ప్రభుత్వానికి ఫైలు పంపింది. మెయిన్స్ రాత పరీక్షకు మెరిట్ ప్రాతిపదికన 1:50 చొప్పున కాకుండా ప్రతి రిజర్వేషన్ కేటగిరీలో 1:15 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేయాలని అందులో పేర్కొంది. ప్రభుత్వం ఆమోదిస్తే భవిష్యత్తులో జారీ చేసే గ్రూపు-1 నోటిఫికేషన్‌లో అమలు చేస్తాం. అయితే ప్రభుత్వం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది.
Published date : 22 Jan 2013 01:14PM

Photo Stories