Free Training for JEE, NEET & EAPCET: ఉచిత శిక్షణ.. భవితకు రక్షణ
సాధించడమే లక్ష్యం
నీట్, జేఈఈ, ఈఏపీసెట్ తదితర పోటీ పరీక్షల్లోగిరిజన విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించేందుకు గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. నర్సాపూర్‌లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల ప్రతిభ జూనియర్ కాలేజీలో చదువుతున్న ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఈ ఉచిత శిక్షణ ఇస్తారు. గత నెల 18నుంచి ప్రారంభించి ఆయా పోటీ పరీక్షలు నిర్వహించే రోజు వరకు ఈ శిబిరం కొనసాగనుంది. విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌తోపాటు వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.
చదవండి: నీట్ - సక్సెస్ స్టోరీస్ | న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్
నీట్, జేఈఈ, ఈఏపీసెట్ పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకోవాలంటే ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో భారీగా ఫీజులు చెల్లించాలి. కానీ అధికంగా ఫీజులు చెల్లించి శిక్షణ తీసుకోకపోవడంతో మెరుగైన ర్యాంకులు సాధించలేక మంచి కాలేజీల్లో సీటు సాధించలేకపోతున్నారు. ఈ క్రమంలో గిరిజన విద్యార్థులను ప్రవేశ పరీక్షలకు సమర్థులుగా మార్చేందుకు నర్సాపూర్‌లో ప్రత్యేక ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.
స్టడీ మెటీరియల్ అందజేత..
గిరిజన జూనియర్ కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్థులు 59 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 66 మందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి నిర్ణయించారు. వీరిలో పది మంది చురుకై న విద్యార్థులను ఎంపిక చేసి గిరిజన గురుకుల విద్యాలయానికి చెందిన రాజేంద్రనగర్‌లోని ఐఐటీ స్టడీ సెంటర్‌కు ప్రత్యేక శిక్షణ నిమిత్తం పంపారు. కాలేజీకి చెందిన పది మంది లెక్చరర్లతో విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తున్నారు. గురుకుల విద్యాలయం నిర్ణయించిన మేరకు కంప్యూటర్ ద్వారా ఎంబైబ్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంపై శిక్షణ ఇస్తున్నారు. శిక్షణలో భాగంగా విద్యార్థులకు స్టడీ మెటీరియల్ కూడా అందజేస్తున్నారు.
చదవండి: జేఈఈ (మెయిన్స్ & అడ్వాన్స్‌డ్) - గైడెన్స్ | వీడియోస్
వీకెండ్ టెస్ట్‌లు నిర్వహణ
శిక్షణ ప్రణాళికబద్ధంగా చేపడుతూ ప్రతీ ఆదివారం విద్యార్థులకు వీకెండ్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా వారి సామర్థ్యం గుర్తించి వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. శిక్షణను కాలేజీ ప్రిన్సిపాల్ భిక్షమయ్య పర్యవేక్షిస్తూ విద్యార్థులకు శిక్షణ సరైన విధంగా అందేలా కృషి చేస్తున్నారు. అవసరమైన మెటీరియల్, ఇతర సదుపాయాలు గురుకుల విద్యాలయం నుంచి అందించేందుకు గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ఏరియా కోఆర్డినేటర్ సంపత్‌కుమార్ తన వంతు కృషి చేస్తున్నారు.
పోటీ పరీక్షల్లో రాణించేలా..
గిరిజన విద్యార్థులు పోటీ పరీక్షలు రాసేందుకు డబ్బులు పెట్టి ప్రైవేటులో శిక్షణ పొందలేరని గిరిజన గురుకులాల విద్యాలయ సంస్థ గుర్తించి తమ కాలేజీల్లోనే ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. శిక్షణతోపాటు స్టడీ మెటీరియల్ సైతం అందజేశాం. విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ప్రవేశ పరీక్షలో మెరుగైన ర్యాంకులు సాధించి మంచి కాలేజీల్లో సీట్లు పొందాలని కోరుకుంటున్నాను.
– సంపత్‌కుమార్, గిరిజన గురుకుల
శిక్షణ బాగుంది
కాలేజీలో ప్రత్యేక శిక్షణ శిబిరంలో మాకు ఇస్తున్న శిక్షణ బాగుంది. తాను ఐఐఐటీలో సీట్ పొందడానికి శిబిరంలో శిక్షణ తీసుకుంటున్నాను. లెక్చరర్లు బోధనకు అనుగుణంగా కష్టపడి చదువుతున్నాను. సీట్ పొందుతానన్న నమ్మకం ఉంది.
– ఎల్. లోకేష్, ఎంపీసీ విద్యార్థి
నీట్‌లో సీటు కొడతా
కాలేజీలో తమకిస్తున్న శిక్షణ చాలా బాగుంది. ఇక్కడ శిక్షణ తీసుకోవడం ద్వారా నీట్‌లో సీటు పొందగలనన్న నమ్మకం పెరిగింది. శిక్షణలో పోటీ పరీక్షకు సంబంధించిన అంశాలను చెప్పడంతోపాటు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేస్తున్నారు.
– డీ.అనీల్, బైపీసీ విద్యార్థి
విద్యార్థులకు ఉపయోగకరంగా..
తమ కాలేజీలో చదివిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. నీట్, జేఈఈ, ఈఏపీసెట్ పోటీ పరీక్షలకు శిక్షణ కొనసాగుతుంది. ఈ శిబిరంతో విద్యార్థులకు చాలా మేలు జరుగుతుంది. విద్యార్థుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
– భిక్షమయ్య, కాలేజీ ప్రిన్సిపాల్