Skip to main content

ఇక ప్రతి పరీక్షకు ఏపీపీఎస్సీ ‘కీ’ - ఏపీపీఎస్సీ సెక్రటరీ పూనం మాలకొండయ్య

నిరుద్యోగులకు 1.16 లక్షల ఉద్యోగాలిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీలో ఏపీపీఎస్సీ వాటా ఉద్యోగాలు 18వేలు. వీటిలో 14 వేలకుపైగా పోస్టులకు నోటిఫికేషన్లు విడుదలచేయగా.. మిగతా 4వేల జూనియర్ లెక్చరర్స్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తాం. గ్రూప్ 2లోని మూడు పేపర్లలో ఒక పేపర్‌ను డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహించాలన్న ఆలోచన విరమించుకున్నాం. ఇకపై కమిషన్ నిర్వహించే ప్రతి పరీక్షకు ‘‘కీ’’ విడుదల చేయాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. యూపీఎస్సీ తరహా వార్షిక క్యాలెండర్ అమల్లోకి వస్తే ప్రస్తుతమున్న ఖాళీలు, కొత్తగా రాబోయే పోస్టుల వివరాలు కూడా ముందే ప్రకటిస్తాం.గ్రూప్1 మెయిన్స్ పరీక్షల్లో పారదర్శకత కోసం ఒక్కో జవాబుపత్రాన్ని డబుల్ లేదా త్రిబుల్ పార్టీతో వాల్యుయేషన్ చేయాలని నిర్ణయించామంటున్నారు ఏపీపీఎస్సీ సెక్రటరీ పూనం మాలకొండయ్య. కమిషన్ భవిష్యత్తు లక్ష్యాలు, కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి ఆమెతో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ...

* ఏపీపీఎస్సీ ‘కీ’లక నిర్ణయం
* కొత్త నోటిఫికేషన్లకు 2013 జనవరి తర్వాతే పరీక్షలు
* యూపీఎస్సీ తరహాలో వార్షిక క్యాలెండర్ దిశగా చర్యలు వేగవంతం
* అనుమతి లభిస్తే డిసెంబర్‌లోగా మరో గ్రూప్-2 నోటిఫికేషన్
* గ్రూప్ 1 మెయిన్స్‌లో డబుల్ వాల్యుయేషన్
* 4,000 జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి అనుమతి రావాల్సి ఉంది.

Q. గ్రూప్1, 2 నోటిఫికేషన్లు కొత్తగా విడుదల చేస్తున్నారంటున్నారు? నిజమేనా?
A. గ్రూప్1, గ్రూప్2 నోటిఫికేషన్ల గురించి ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతం ప్రభుత్వశాఖల్లో ఖాళీల గుర్తింపు జరగాలి. దానికి ఆర్థికశాఖ నుంచి క్లియరెన్స్ వస్తే కొత్త పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి కొత్త పోస్టుల నియామకానికి అనుమతి కోసం ఎదురుచూస్తున్నాం. ప్రక్రియ అంతా పూర్తయ్యాక ఖాళీల ఆధారంగా నోటిఫికేషన్ విడుదల చేస్తాం.

గ్రూప్1, 2 కొత్త నోటిఫికేషన్లు డిసెంబరులోగా ప్రకటించాల్సి ఉంది. ఆలస్యమైతే విద్యార్థులు ఒక విద్యాసంవత్సరం నష్టపోతారు. అందుకే మేం కూడా ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాం.

Q. గ్రూప్ 2లో 600 పోస్టులకు, 16 ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 31లోగా నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు గతంలో చెప్పారు కదా?
A. ఆయా ప్రభుత్వశాఖల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ లభించగానే నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. డిసెంబర్‌లోగా గ్రూప్2 నోటిఫికేషన్ ఇచ్చేది లేనిది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఈలోగా అనుమతి లభిస్తే కచ్చితంగా నోటిఫికేషన్ విడుదలచేస్తాం.

Q. కొత్తగా ప్రకటించనున్న నోటిఫికేషన్లు ఏమైనా ఉన్నాయా?
A. ప్రస్తుతానికి కొత్త నోటిఫికేషన్లు ఏమీ లేవు. ఇప్పటికే భారీగా ప్రకటించిన వివిధ పోస్టులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. తాజాగా నోటిఫికేషన్ ఇచ్చిన పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టులకు 2013, జనవరిలో పరీక్ష నిర్వహిస్తున్నాం. అప్పటివరకు వివిధ పరీక్షల నిర్వహణ షెడ్యూళ్లతో కమిషన్ తీరికలేకుండా ఉంది. అందుకే ఇకపై ఎలాంటి నోటిఫికేషన్లు ప్రకటించినా.. వాటన్నింటికి 2013, జనవరి తర్వాతే రాత పరీక్ష ఉంటుంది.

Q. 1.16 లక్షల ఉద్యోగాలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందులో ఏపీపీఎస్సీ భర్తీచేసే పోస్టులెన్ని?

A. 1.16 లక్షల ఉద్యోగాలిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీలో ఏపీపీఎస్సీ భర్తీచేసే పోస్టులు 18,000. ఇందులో ఇప్పటికే 14,200 పోస్టులకు పలు నోటిఫికేషన్లు విడుదల చేశాం. మిగతా 4,000 జూనియర్ లెక్చరర్ల పోస్టులకు ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. అనుమతిరాగానే నోటిఫికేషన్ ప్రకటిస్తాం.

Q. ఏపీపీఎస్సీ సంస్కరణల అమలు ప్రక్రియ ఎంతవరకు వచ్చింది?
A. ఏపీపీఎస్సీలో సంస్కరణల కోసం నియమించిన ప్రత్యేక కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. యూపీఎస్సీ తరహాలో ఏపీపీఎస్సీ కూడా వార్షిక క్యాలెండర్ ప్రకటించాలనేది నివేదికలో మొదటి కీలక ప్రతిపాదన. అదేవిధంగా గ్రూప్ 2 పరిధిలోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్1లో చేర్చాలని కమిటీ నివేదించింది. గ్రూప్ 2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్ 1లో కలిపేస్తే అభ్యర్థులు రెండు పరీక్షలు రాయనక్కర్లేకుండా ఒకే పరీక్ష రాసే సౌలభ్యం ఏర్పడుతుంది.

Q. కమిషన్ నిర్వహించిన పలు పరీక్షల్లో ఒకే ప్రశ్నలు చాలాసార్లు వస్తున్నాయి? ఇది విమర్శలకు దారితీస్తోంది కదా?
A. ఇందులో విమర్శలేమున్నాయి. ఏపీపీఎస్సీ ప్రతివారం ఏదో ఒక నోటిఫికేషన్‌కు సంబంధించిన పరీక్ష నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఆ మరుసటి వారంలో జరిగే పరీక్షలో ఒకటిరెండు ప్రశ్నలు తిరిగి రావచ్చు. ఇందులో తప్పేమీలేదు. పైగా అధిక శాతం ఒక్క జనరల్ నాలెడ్జ్ విభాగంలోనే రిపీటెడ్‌గా వస్తున్నాయంటున్నారు. ఇది పెద్ద సమస్యకానేకాదు.

Q. కమిషన్ నిర్వహించే పరీక్షలకు లక్షల్లో అభ్యర్థులు హాజరవుతున్నారు? వీరికోసం ‘కీ’ ప్రకటించే ఆలోచన ఉందా?
A. ఇకపై ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి పరీక్షకు ‘కీ’ విడుదల చేయాలని తాజాగా నిర్ణయించాం. ఇంటర్వ్యూలు లేని పరీక్షలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ‘కీ’ కూడా పరీక్ష పూర్తయిన ఒకటిరెండురోజుల్లో కాకుండా.. పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్ షీట్లన్నీ స్కానింగ్ పూర్తయి ఫలితాలు నిర్ధారణకు వచ్చాక అప్పుడు విడుదల చేస్తాం. అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు స్కానింగ్ పూర్తవకుండా కీ ప్రకటిస్తే చాలా సమస్యలొస్తాయి.

Q. గ్రూప్ 2 వైట్నర్ వివాదం ముగిసినట్టేనా? అభ్యర్థులు పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు కదా?
A. ఇది న్యాయ సంబంధమైన వ్యవహారంతో ముడిపడి ఉంది. సాధ్యమైనంత త్వరగా ఈ వివాదం ముగియాలని కోరుకుంటున్నాం. ఇంకా రెండు నెలలకుపైగా సమయం పట్టే అవకాశముంది.

Q. యూనివర్సిటీలు, కాలేజీల్లో బోధించే సిలబస్‌కు అనుగుణంగా ఏపీపీఎస్సీ ప్రశ్నపత్రాలు తయారుచేసేలా సమన్వయం తీసుకురావాలనే కమిషన్ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి?
A. ఈ విషయంపై కమిషన్ చాలా గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే సిలబస్‌కు అనుగుణంగా ప్రశ్నపత్రాల తయారీకి సంబంధించి ప్రత్యేక కమిటీ వేశాం. సబ్జెక్టువైజ్‌గా కమిటీ సమావేశాలు నిర్వహిస్తోంది. రిక్రూట్‌మెంట్‌వైజ్‌గా సిలబస్‌ను అధ్యయనం చేస్తున్నాం.

మేం నోటిఫికేషన్ ఇచ్చే పోస్టులు ఏ శాఖకు సంబంధించినవో ఆ శాఖ ఇచ్చే గైడ్‌లైన్స్, సబ్జెక్టు నిపుణులు, యూనివర్సిటీలు కలిసి ఆధునిక సిలబస్‌ను ప్రామాణికంగా తీసుకుని ప్రశ్నపత్రాలు తయారుచేసే వాళ్లకు అందిస్తాం. ఇకపై ఏ నోటిఫికేషన్‌కు సంబంధించిన పరీక్ష అయినా వర్సిటీలో బోధిస్తున్న కొత్త సిలబస్‌కు అనుగుణంగానే కొశ్చన్ పేపర్స్ ఉంటాయి.

Q. మున్సిపల్ ఆఫీసర్స్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందా?
A. ఈ పోస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇప్పటివరకు కేవలం మూడు పోస్టులకే క్లియరెన్స్ లభించింది. వీటిని రానున్న గ్రూప్ 2 ఖాళీల్లో కలిపి నోటిఫికేషన్ విడుదల చేస్తాం.

Q. 2, 6, 20... ఇలా తక్కువ సంఖ్యలో పోస్టులున్నా.. ప్రత్యేక నోటిఫికేషన్ ఇస్తున్నారు. దీనివల్ల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం సమస్య కదా?

A. అభ్యర్థులకు ఎలాంటి సమస్య రాబోదు, రానీయం కూడా. ఎందుకంటే.. ప్రతి నోటిఫికేషన్‌కు సంబంధించి పరీక్ష ఎప్పుడు జరుగుతుంది? దరఖాస్తులు ఎప్పుడు చేసుకోవాలి? దాఖలుకు ఆఖరుతేది? వంటి వివరాలన్నీ కమిషన్ వెబ్‌సైట్‌లో ముందుగానే ఉంచాం. యూపీఎస్సీ తరహాలో ఏపీపీఎస్సీకి వార్షిక క్యాలెండర్ ప్రకటించడానికి అనుమతి వస్తే ఈ ఇబ్బందులుండవు. వార్షిక క్యాలెండర్‌కు అనుమతిచ్చే విషయమై ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇది అమల్లోకిరాగానే ప్రస్తుతమున్న ఖాళీలు, మున్ముందు ఖాళీ అయ్యే పోస్టుల వివరాలు కూడా ప్రకటిస్తాం.
Q. పలు పరీక్షలకు పరీక్ష కేంద్రాలు ఎక్కడో ఉంటున్నాయి? అక్కడ కనీస సౌకర్యాలు కూడా ఉండడం లేదని అభ్యర్థులంటున్నారు?

A. ఇందులో వాస్తవం లేదు. కమిషన్ ఎప్పుడూ అభ్యర్థుల సౌకర్యానికే ప్రాధాన్యం ఇస్తుంది. ఇటీవల జరిగిన గ్రూప్ 2 పరీక్షకు లక్షల్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ హైదరాబాద్, ఇతర నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఇవ్వడం అసాధ్యం. అలాంటప్పుడు కొంచెం దూరంగా ఉన్న ప్రాంతాల్లో పరీక్ష రాయవలసి రావచ్చు. ఇటువంటి సందర్భాల్లో మినహా పరీక్ష కేంద్రాలన్నీ అభ్యర్థులకు సౌలభ్యంగా ఉన్న ప్రాంతాల్లోనే ఉంటాయి.

Q. గ్రూప్ 1 మెయిన్స్‌లో కొత్తగా ఏమైనా మార్పులు చేస్తున్నారా?
A. ఈసారి గ్రూప్1 మెయిన్స్ జవాబుపత్రాల వాల్యుయేషన్‌లో సరికొత్త విధానాన్ని అమలుచేస్తున్నాం. వివాదాలకు, అనుమానాలకు తావులేకుండా... అభ్యర్థులకు మేలు జరిగేలా ఈసారి మెయిన్స్ వాల్యుయేషన్ ఉంటుంది. దానిప్రకారం- ఒక్కో జవాబుపత్రాన్ని డబుల్ వాల్యుయేషన్ చేస్తాం. దీనివలన పారదర్శకత పెరుగుతుంది. ఒకవేళ డబుల్ వాల్యుయేషన్‌లో ఇద్దరు ప్రొఫెసర్లు కేటాయించిన మార్కుల మధ్య వ్యత్యాసం 15 శాతానికి మించితే థర్డ్‌పార్టీ వాల్యుయేషన్‌కు ఆదేశిస్తాం.

Q. గ్రూప్ 2లో ఒక పేపర్‌ను డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహించే ప్రతిపాదన వచ్చింది కదా!?
A. ఆ ఆలోచన విరమించుకున్నాం. ఎందుకంటే.. గ్రూప్ 2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సమర్థవంతమైన అభ్యర్థుల ఎంపిక కోసం ఈ విధానం అమలు చేయాలని మొదట్లో అనుకున్నాం. ఇప్పుడు కమిషన్ సంస్కరణల్లో భాగంగా గ్రూప్ 2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్1లో చేర్చాలని ప్రతిపాదించినందున డిస్క్రిప్టివ్ ఆలోచన లేనట్లే!

Q. ఏపీపీఎస్సీని భవిష్యత్తులో ఎలా చూడొచ్చు? అభ్యర్థులకు మీ సలహా?
A. పూర్తి పారదర్శకతతో, ఆరోపణలు, అనుమానాలకు తావులేనివిధంగా కమిషన్‌ను తీర్చిదిద్దాలనేదే మా ప్రయత్నం. ఇందుకోసం అనేక చర్యలు తీసుకుంటున్నాం. కమిషన్ నిర్వహించే ఏ పరీక్షలోనైనా అర్హులే ఎంపికయ్యేలా పనిచేయాలనేదే మా లక్ష్యం. కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించి ఫలితాలు నెలలోగానే ప్రకటించాలనుకున్నా.. ఇతర పెండింగ్ నోటిఫికేషన్లు క్లియర్ చేయాల్సిరావడం, పనిభారం వంటివాటివల్ల జాప్యం జరుగుతోంది.

భవిష్యత్తులో ఇలాంటివి లేకుండా జాగ్రత్తపడతాం. ప్రభుత్వ శాఖల్లో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నా.. ప్రభుత్వ అనుమతితో నోటిఫికేషన్ ఇవ్వడానికి ఏపీపీఎస్సీ సిద్ధంగా ఉంది. అభ్యర్థులు కేవలం కష్టాన్నే నమ్ముకోవాలి. సబ్జెక్టుపై పట్టుపెంచుకుని నిజాయితీగా ప్రిపేరైతే ఆశించిన ఫలితాలొస్తాయి. కేవలం పాతప్రశ్నపత్రాలు, గైడ్లపై ఆధారపడటం సరికాదు!!

Published date : 06 Sep 2012 01:57PM

Photo Stories