Skip to main content

ఐఎఫ్‌ఎస్ శిక్షణ కూడా.. విభిన్నం

సివిల్ సర్వీసెస్.. ప్రతి యువత కలలు కనే సర్వీస్..ఐపీఎస్, ఐఎఎస్, ఐఆర్‌ఎస్, ఐఎఫ్‌ఎస్ ఇలా పలు అత్యున్నత హోదాలతో కూడిన..ఈ ఉద్యోగాల్లో ప్రవేశించాంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశలను అధిగమించాల్సి ఉంటుంది..వీటిల్లో విజయం సాధించిన తర్వాత అప్పటి ఖాళీలు, ప్రాధాన్యత ఆధారంగా..ఆయా సర్వీసులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది..ఎంపికైన తర్వాత ఆయా సర్వీసులకు సంబంధించి శిక్షణ ఏ విధంగా ఉంటుంది..పోస్టింగ్, కెరీర్ గ్రోత్, తదితర అంశాలపై ఔత్సాహికులకు అవగాహన కల్పించడంలో భాగంగా..ఇండియన్ ఫారెన్ సర్వీస్‌కు సంబంధించి రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్, కె. శ్రీకర్ రెడ్డి (ఐఎఫ్‌ఎస్)తో ప్రత్యేక ఇంటర్వ్యూ..

సన్‌రైజ్ సర్వీస్... ఐఎఫ్‌ఎస్
అంతర్జాతీయంగా భారత సార్వభౌమత్వాన్ని, ఇతర దేశాలతో సత్సంబంధాలు; ప్రపంచ దేశాలతో ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక ఒప్పందాలు వంటి కార్యకలాపాలు నిర్వహించాల్సిన శాఖ.. కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ. అందుకే ఈ శాఖ పరిధిలోని ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్)కు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కూడా.. ఇతర సర్వీసులతో పోల్చితే విభిన్నంగా ఉంటుంది.

ఫౌండేషన్ తర్వాత ఫారెన్ సర్వీస్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ:
ఐపీఎస్, ఐఎఎస్, ఐఆర్‌ఎస్ ఇతర సర్వీసులతో కలిసి ఉమ్మడిగా ముస్సోరిలో ఫౌండేషన్ కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత ఐఎఫ్‌ఎస్ అభ్యర్థులకు న్యూఢిల్లీలోని ఫారెన్ సర్వీస్ ఇన్‌స్టిట్యూట్‌లో ఏడాది కాలంపాటు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో వీరిని ప్రొబేషనర్లుగా పిలుస్తారు. ఈ శిక్షణ సమయంలో అంతర్జాతీయ సంబంధాలు-విదేశీ విధానం, రక్షణ-భద్రత, ఆర్థిక దౌత్యం, అంతర్జాతీయ చట్టాలు, పార్లమెంటరీ కార్యకలాపాలు, సాంస్కృతిక అంశాలు, దౌత్య పరమైన అంశాలు, ప్రొటోకాల్, కాన్సులర్ అంశాలపై క్లాస్ రూం శిక్షణ ఉంటుంది. వీటితోపాటు క్షేత్రస్థాయి నైపుణ్యాలు అవసరమైన అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, రిప్రజెంటేషన్ స్కిల్స్, మీడియా రిలేషన్స్‌పైనా బోధన సాగుతుంది.

మిషన్ అటాచ్‌మెంట్:
ఫారెన్ సర్వీస్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ సమయంలోనే.. విదేశాల్లో భారత రాయబార కార్యాలయాల పనితీరుపై అవగాహన కల్పించేలా విదేశీ పర్యటన, అక్కడ భారతీయ రాయబార కార్యాలయాలతో అటాచ్‌మెంట్ ఉంటుంది. దీన్నే మిషన్ అటాచ్‌మెంట్ అంటారు.

డిస్ట్రిక్ట్ అటాచ్‌మెంట్:
విదేశీ వ్యవహారాలపై అవగాహనతోపాటు స్వదేశంలో గ్రాస్ రూట్ లెవల్‌లో పరిస్థితిపై అవగాహన ఏర్పరిచే దిశగా డిస్ట్రిక్ట్ అటాచ్‌మెంట్ కూడా ఉంటుంది. దీని ప్రకారం అభ్యర్థులను బృందాలుగా విభజించి ఒక్కో బృందాన్ని ఒక్కో రాష్ట్రానికి పంపుతారు. అలా.. ఆయా రాష్ట్రాలకు వెళ్లిన బృందాలు అక్కడి సామాజిక, ఆర్థిక, సాంస్కృతికపరమైన అన్ని అంశాలను పరిశీలించాలి. ప్రతి క్షేత్ర స్థాయి పర్యటన తర్వాత థీసిస్ సబ్మిట్ చేయాల్సిందే. ఇలా ఏడాదిపాటు క్లాస్‌రూం టీచింగ్ పూర్తయ్యాక ఫైనల్ పరీక్షలు ఉంటాయి. వాటిలో ఉత్తీర్ణత సాధిస్తేనే పోస్టింగ్‌కు అర్హత లభిస్తుంది.

తప్పనిసరిగా ఒక విదేశీ భాష:
ఐఎఫ్‌ఎస్ ప్రొబేషనర్లు ఫారెన్ సర్వీస్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్నాక తప్పనిసరిగా ఒక విదేశీ భాషను ఎంచుకుని అందులో శిక్షణ పొందాలి. దీన్ని కంపల్సరీ ఫారెన్ లాంగ్వేజ్ ప్రోగ్రాం (సీఎఫ్‌ఎల్)అంటారు. ఈ శిక్షణ వ్యవధి ఎంచుకున్న భాషపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఫ్రెంచ్ భాషను ఎంచుకుంటే ఏడాది శిక్షణ; చైనీస్, జపనీస్ భాషలను నేర్చుకుంటే రెండేళ్ల శిక్షణ ఉంటుంది.

విదేశీ మంత్రిత్వ శాఖతో అటాచ్‌మెంట్:
ఈ రెండు దశలు పూర్తి చేసుకున్నాక ఆరు నెలల పాటు విదేశీ మంత్రిత్వ శాఖలో విధులు నిర్వర్తించాలి. ఈ సమయంలో మంత్రిత్వ శాఖ నిర్వహించే విధులు, ఇతర దేశాల తో సాగించే సంప్రదింపులు, వాణిజ్య ఒప్పందాలు, శాంతి ఒప్పందాలు తదితర అంశాలపై ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది.

మొదటి పోస్టింగ్ విదేశాల్లోనే:
ఐఎఫ్‌ఎస్ అభ్యర్థులకు తొలి పోస్టింగ్ విదేశాల్లోనే ఉంటుంది. సీఎఫ్‌ఎల్ ప్రోగ్రాంలో భాగంగా శిక్షణ తీసుకున్న విదేశీ భాషను పరిగణనలోకి తీసుకుని ఆ భాష మాతృ
భాషగా ఉన్న దేశంలో పోస్టింగ్ లభిస్తుంది.

తొలి డిజిగ్నేషన్ థర్డ్ సెక్రటరీ:
పోస్టింగ్ పొందిన అభ్యర్థులకు.. విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లో లభించే తొలి హోదా థర్డ్ సెక్రటరీ. తర్వాత సీనియారిటీ ఆధారంగా సెకండ్ సెక్రటరీ, ఫస్ట్ సెక్రటరీ, కౌన్సెలర్, అంబాసిడర్ లేదా హై కమిషనర్, పర్మినెంట్ రిప్రజెంటేటివ్ హోదాలు లభిస్తాయి.

డాలర్లలో జీతం:
ఇతర సర్వీసులతో పోల్చితే జీతం విషయంలోనూ ఐఎఫ్‌ఎస్‌లకు లభించే వేతనాలు విభిన్నంగా ఉంటాయి. తప్పనిసరిగా విదేశాల్లో పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి నెలకు నాలుగు వేల అమెరికన్ డాలర్ల జీతం లభిస్తుంది. దీనికి ఎలాంటి పన్ను లేకపోవడం మరో విశేషం. వీటితోపాటు అభ్యర్థుల కుటుంబానికి ఆరోగ్యపరమైన సదుపాయాలు, వారి పిల్లలకు ఆయా దేశాల్లోని అంతర్జాతీయ స్థాయి స్కూల్స్‌లో ఫ్రీ ఎడ్యుకేషన్ వంటి ఆకర్షణీయ సదుపాయాలు లభిస్తాయి. అంతేకాకుండా భారత్ వచ్చి, వెళ్లేందుకు ఉచిత విమానయాన భత్యం కూడా లభిస్తుంది.

ఆరేళ్లు విదేశాలు.. రెండేళ్లు స్వదేశం:
ఐఎఫ్‌ఎస్ అధికారులు తమ సర్వీసులో అధిక భాగం విధులు విదేశాల్లోనే నిర్వహిస్తారు. కారణం.. ప్రస్తుతం మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విధానం ప్రకారం ప్రతి ఐఎఫ్‌ఎస్ ఆరేళ్లు విదేశాల్లో, రెండేళ్లు స్వదేశంలో పని చేయాలి. కారణం.. భారత్‌కు 182 దేశాల్లో రెసిడెంట్ మిషన్లు ఉండటమే.

అంబాసిడర్‌కు కేబినెట్ ప్రోటోకాల్:
విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లో అంబాసిడర్ హోదాలో ఉన్న వ్యక్తికి ఆ దేశ కేబినెట్ మంత్రి హోదాలో ప్రోటోకాల్ సదుపాయాలు లభించడం ఐఎఫ్‌ఎస్‌లోని మరో విశిష్టత. ఉదాహరణకు అమెరికాలోని భారత అంబాసిడర్‌కు అమెరికా కేబినెట్ మినిస్టర్‌కు సమానమైన ప్రొటోకాల్ సదుపాయాలు లభిస్తాయి. ఇలా.. సర్వీస్ ఆసాంతం విభిన్నంగా ఉండే ఇండియన్ ఫారెన్ సర్వీస్‌ను సన్‌రైజ్ సర్వీస్‌గా పేర్కొనొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే అంతర్జాతీయంగా దేశ గుర్తింపునకు, ప్రగతి సోపానానికి దోహదపడే సర్వీస్ ఇది.

ఛాలెంజింగ్ ఆప్టిట్యూడ్
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ తదితర అన్ని సర్వీసులకు ఉమ్మడి పరీక్షలో ఉత్తీర్ణతే ప్రామాణికమైనప్పటికీ.. ఐఎఫ్‌ఎస్‌ను ఆప్షన్‌గా ఎంచుకునే అభ్యర్థులకు ఛాలెంజింగ్ ఆప్టిట్యూడ్ ఉంటే మరింతగా రాణించగలరు.

ఫౌండేషన్’తో ప్రారంభం:
సివిల్స్ విజేతల శిక్షణ ‘ఫౌండేషన్’ ప్రోగ్రాంతో మొదలవుతుంది. రెండున్నర నెలలపాటు ఉండే ఫౌండేషన్ ప్రోగ్రాం సాధారణంగా ప్రతిఏటా ఆగస్టు చివరి వారంలో మొదలవుతుంది.
Published date : 03 May 2013 03:45PM

Photo Stories