Govt Medical College: త్వరలోనే ఏలూరు వైద్య కళాశాల సిద్ధం
ఏలూరు టౌన్: ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణాలు, హాస్టల్ నిర్మాణం, మౌలిక వసతులను ఏలూరు కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఏలూరు జీజీహెచ్ ఆవరణలోని వైద్య విద్యార్థులకు హాస్టళ్ల ఏర్పాటుపై ఆరా తీశారు. పాత బస్టాండ్ డీఎంహెచ్‌ఓ కా ర్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. యుద్ధప్రాతిపదికన మెడికల్ కాలేజీ, హాస్టల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తనిఖీల్లో తరగతి గదులు, ల్యాబ్స్, ఆధునిక వసతులతో కూడిన ప్రొఫెసర్ల గదులు, కిచెన్, హాస్టల్ గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా, విద్యుదీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవన నిర్మాణాలు 90 శాతం పూర్తయ్యాయని, చిన్నపాటి పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. మెడికల్ కళాశాలలో తొలి ఏడాది 150 మంది విద్యార్థులు వైద్య విద్య అభ్యసించేలా భవన నిర్మాణాలు చేపట్టామని చెప్పారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికా రి కార్యాలయ ఆవరణలో ఆయన మొక్కలు నాటా రు. ఏపీఎంఎస్‌ఐడీసీ ఎస్‌ఈ డి.బలరామిరెడ్డి, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేవీవీ విజయకుమార్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఆశ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శశిధర్, కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, డీఐఓ డాక్టర్ నాగేశ్వరరావు, తహసీల్దార్ సోమశేఖర్ ఉన్నారు.
చదవండి: JNTUA Semester Exams: జంబ్లింగ్ విధానం.. లోపభూయిష్టం