Skip to main content

ఐటీఐలో ప్రవేశాలకు నేటితో గడువు పూర్తి

రాజాం: రాజాంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రవేశాలకు సోమవారంతో గడువు ముగుస్తుందని కళాశాల ప్రిన్సిపాల్‌ భాస్కరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
iti admissions
ఐటీఐలో ప్రవేశాలకు నేటితో గడువు పూర్తి

ఈనెల 31తో రిజిస్ట్రేషన్‌ గడువుతో పాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కూడా పూర్తవుతుందని పేర్కొన్నారు. ఐటీఐ కళాశాలలోనే మొత్తం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేస్తున్నామన్నారు. సివిల్‌–18, ఫిట్టర్‌–5, డీజిల్‌ మెకానిక్‌ –20, కోపా–30 వరకూ సీట్లు ఉన్నాయని వెల్లడించారు. ఆగస్టు–3న కౌన్సెలింగ్‌ ఉంటుందని వివరించారు. మిగిలిన వివరాలకు ఫోన్‌ నంబర్ల 8121450657, 9959502238ను సంప్రదించాలని సూచించారు.

బార్‌ అసోసియేషన్‌కు విరాళాలు

● ఉదారత చాటుకున్న న్యాయవాదులు

విజయనగరం లీగల్‌: పుట్టిన ఊరును మర్చిపోకుండా, తమ పెద్ద మనసును చాటుకున్నారు పలువురు న్యాయవాదులు. కెరీర్‌ మొదట్లో ఇక్కడ న్యాయవాదులుగా కొద్ది రోజులు సేవలు అందించి, తరువాత హైకోర్టుకు వెళ్లి ఉన్నత స్థానాలు పొందినప్పటికీ, పుట్టిన గడ్డను మర్చిపోలేదు. తమవంతు సాయాన్ని అందించారు. ఈ మేరకు ఉమ్మడి పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం మాతుమూరుకు చెందిన న్యాయవాది నైదాన శ్రావణ్‌ కుమార్‌, విజయనగరం బార్‌ అసోసియేషన్‌కు లక్ష రూపాయలు విరాళం అందించారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును హైకోర్టు న్యాయమూర్తుల చేతుల మీదుగా అసోసియేషన్‌కు అందజేశారు. శ్రావణ్‌ కుమార్‌ ప్రస్తుతం స్పెషల్‌ అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా, హైకోర్టులో సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో సేవలందిస్తున్న, పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలానికి చెందిన మరో న్యాయవాది రౌతు సురేష్‌ కుమార్‌ విజయనగరం బార్‌ అసోసియేషన్‌కు లక్ష రూపాయలు విరాళాన్ని, హైకోర్టు న్యాయమూర్తుల చేతుల మీదుగా అందజేశారు. సురేష్‌ కుమార్‌ ప్రస్తుతం హైకోర్టులో డైరెక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెనన్స్‌ ప్రాసిక్యూటర్‌గా, జీఎస్టీ స్టాండింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా సేవలు అందిస్తున్నారు. అలాగే జిల్లాకు చెందిన ప్రముఖ న్యాయవాది అప్పికొండ రామకృష్ణ నాయుడు, ఏపీ బార్‌ కౌన్సిల్‌తో కలిసి, విజయనగరం బార్‌ అసోసియేషన్‌కు ఐదు లక్షల రూపాయల విరాళం అందజేశారు. విరాళాలు అందించిన దాతలను, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆకుల వెంకట శేషశాయి, జస్టిస్‌ యు.దుర్గా ప్రసాదరావు, జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌, జిల్లా పోర్టుఫోలియో జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి, జస్టిస్‌ దుప్పల వెంకట రమణ చేతుల మీదుగా సన్మానింప చేసి విజయనగరం బార్‌ అసోసియేషన్‌ కృతజ్ఞతలు తెలిపింది.

ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

రామభద్రపురం: మండలంలోని మామిడివలస గ్రామానికి చెందిన కొండపల్లి సీతయ్య(35) చెట్టుకు ఉరిపోసుకుని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సీతయ్యకు 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కొద్ది నెలల క్రితం భార్య వేరే వ్యక్తితో వెళ్లిపోయింది. ఉన్న ఇద్దరు పిల్లలను పోషించడానికి కష్టంగా మారడంతో మనస్తాపానికి గురైన సీతయ్య శనివారం సాయంత్రం మామిడివలస, కొండకెంగువకు మద్యలో ఉన్న చెరువు పక్కన కాగుచెట్టుకు ఉరిపోసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాడంగి సీహెచ్‌సీకి తరలించారు.తల్లి పోలమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సై సురేంద్రనాయుడు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లి వేరే వ్యక్తితో వెళ్లిపోవడం, తండ్రి మృతి చెందడంతో పిల్లలు అనాథలైపోయారని గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు.

వంగర–రాజాం రోడ్డుపై ఏనుగులు

వంగర: మండల పరిధి మడ్డువలస వద్ద వంగర – రాజాం రోడ్డుపై ఏనుగులు సంచరిస్తున్నాయి. ఆదివారం సాయంత్రం సమయానికి సంగాం పంట పొలాల్లోని సంచరించిన ఏనుగులు రాత్రి సమయంలో రోడ్డుకు అడ్డంగా రావడంతో ప్రయాణికులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వాహనాలు నిలిపివేసి గంటల తరబడి వేచి ఉన్నారు. ఎలిఫెంట్‌ టేకర్స్‌, అటవీశాఖ సిబ్బంది వాటితో ఉంటూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు.

Published date : 31 Jul 2023 01:58PM

Photo Stories