Increase In Fees: దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న ఫీజులు.. ఐఐటీల్లో 15 ఏళ్లలో ఏడు రెట్లు ఫీజులు పెంపు
విద్యార్థులు, తల్లిదండ్రుల డ్రీమ్ కోర్సు అయిన ఇంజనీరింగ్‌కు సంబంధించి దేశంలోనే ప్రఖ్యాత విద్యా సంస్థ ఐఐటీ బాంబేలో నాలుగేళ్ల బీటెక్‌కు 2008లో మొత్తం ట్యూషన్ ఫీజు రూ.1,08,000 ఉండగా ఇది 2024–25 నాటికి ఏకంగా రూ.8,00,000కు చేరింది. అలాగే మరో ప్రముఖ విద్యా సంస్థ ఎన్‌ఐటీ తిరుచిరాపల్లిలో 2011–12లో బీటెక్‌కు రూ.1,42,000 ఫీజు ఉండగా 2023–24 నాటికి ఇది 5,02,800కు పెరిగింది.
మొత్తం మీద ఐఐటీల్లో 15 ఏళ్లలో ఏడు రెట్లు, ఎన్‌ఐటీల్లో 12 ఏళ్లలో మూడున్నర రెట్లు ఫీజులు పెంచారు. అలాగే ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల్లలో 15 ఏళ్లలో 8 రెట్లు ఫీజులు పెరిగాయి. భారతదేశంలో పెరిగిపోతున్న విద్యా వ్యయంపై కెరీర్స్360 ఫౌండర్ చైర్మన్ మహేశ్వర్ పెరి అందిస్తున్న ప్రత్యేక వ్యాసం
⇒ మన దేశంలో చదువు రోజురోజుకీ భారంగా మారుతోంది. ప్రాథమిక విద్య నుంచి మేనేజ్ మెంట్ చదువుల వరకు ప్రతి దశలోనూ విద్య సామాన్యుడికే కాదు, మధ్య తరగతికీ తలకు మించిన భారంగా పరిణమించింది. విద్యలో ప్రభుత్వ పాత్ర క్రమేణా తగ్గడం.. ప్రైవేటు విద్యా సంస్థలు పుట్టుకొచ్చి ఫీజులు పెంచుకుంటూ పోవడమే అందుకు ప్రధాన కారణం.
⇒ గత 13 ఏళ్లలో ప్రభుత్వ బడుల సంఖ్యలో పెరుగుదల కేవలం 9 శాతం. అదే సమయంలో ప్రైవేటు స్కూళ్లు ఏకంగా 35% పెరిగిపోయాయి. ప్రస్తుతం దేశంలోని మొత్తం కాలేజీల్లో 79 % ప్రైవేటువే. 14 ఏళ్ల కిందట దేశంలోని ప్రతి రెండు ప్రభుత్వ యూనివర్సిటీలకు ఒక ప్రైవేటు యూనివర్సిటీ ఉంటే నేడు ప్రైవేటు వర్సిటీల సంఖ్య ప్రభుత్వ వర్సిటీల సంఖ్యను అధిగమించేసింది. వీటన్నింటి ఫలితంగా చదువులపై పెట్టాల్సిన ఖర్చు గణనీయంగా పెరిగిపోయింది. ఇవన్నీ ఆందోళనకరమైన పరిణామాలు.
⇒ మన చిన్న చిన్న విషయాలపై దృష్టి పెట్టి, పెద్ద పెద్ద విషయాలను పక్కనపెట్టేశామేమో అనిపిస్తోంది. ఈ సందర్భంగా మనమంతా కొన్ని అంశాలు ఆలోచించాలి. మన ప్రజల సుసంపన్నమైన అభివృద్ధికి ఇప్పటికీ కట్టుబడే ఉన్నామా? నిపుణులైన మానవ వనరులను తయారుచేసుకోవడంలో మనం వెనకబడుతున్నామా? గత 15–20 ఏళ్లలో దేశంలో విద్యా రంగంలో చోటుచేసుకున్న పరిణామాలను గమనిస్తే అవుననే అనిపిస్తుంది.
ఐఐటీలను మించి స్కూల్ ఫీజులు..
ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఫీజులు స్కూల్‌ను బట్టి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉన్నాయి. హైదరాబాద్ లోని పటాన్‌చెరులో ఉన్న ఒక ఇంటర్నేషనల్ స్కూల్ 2024–25 విద్యా సంవత్సరానికి రూ.12 లక్షల ఫీజు వసూలు చేస్తోంది. ఇది కాకుండా అడ్మిషన్ ఫీజు కింద మరో రూ.1.7 లక్షలు చెల్లించాల్సిందే. అలాగే శంషాబాద్‌లో ఉన్న మరో అకాడమీ ఏడాదికి రూ.9.5 లక్షల ఫీజు వసూలు చేస్తోంది. అలాగే మోకిలాలో ఉన్న ఇంకో ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఏడాదికి రూ.8.2 లక్షల ఫీజు ఉంది. వీటికి అదనంగా అడ్మిషన్ ఫీజు కింద మరింత ముట్టజెప్పాల్సిందే.
భారీ ఫీజులతో తల్లిదండ్రుల్లో ఆందోళన
ఆ కోర్సు, ఈ కోర్సు అనే తేడా లేకుండా ప్రతి కోర్సుకు ఫీజుల మోత మోగిపోతోంది. మనదేశంలో విద్యా వ్యయం ఏయేడాదికాయేడాది అంతకంతకూ పెరిగిపోతోంది. తల్లిదండ్రులు తమ పిల్లలను అత్యున్నత విద్యా సంస్థల్లో చదివించాలని కలలు కంటారు. తమ కంటే తమ పిల్లల భవిష్యత్ బాగుండాలని ఆశిస్తారు.
మంచి విద్యా సంస్థలో తమ పిల్లలు సీటు సాధించాలని.. ఆ తర్వాత కోర్సు పూర్తయ్యాక మంచి పే ప్యాకేజీతో ఉద్యోగం సాధించాలని ఆకాంక్షిస్తారు. అత్యుత్తమ విద్య, ఆ తర్వాత మంచి ఉద్యోగం సాధించాలంటే మేటి విద్యా సంస్థల్లో చదవకతప్పదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ పోటీ ప్రపంచంలో అందరికంటే ముందుండాలన్నా, మంచి అవకాశాలు దక్కించుకోవాలన్నా నాణ్యమైన చదువులతోనే సాధ్యమని నమ్ముతున్నారు. అయితే పెరుగుతున్న ఫీజులు తల్లిదండ్రుల్లో ఆందోళన రేపుతున్నాయి.
క్యాష్ చేసుకుంటున్న విద్యా సంస్థలు..
విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆకాంక్షలను విద్యా సంస్థలు ‘క్యాష్’ చేసుకుంటున్నాయి. ఫీజులను అమాంతం పెంచేస్తున్నాయి. నర్సరీ నుంచి మొదలుపెడితే పీజీలు, పీహెచ్‌డీల వరకు ఈ విద్యా వ్యయం ఏటా అంతకంతకూ గణనీయంగా పెరుగుతోంది. ధనవంతులకు ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా మధ్యతరగతి వర్గాలు, పేదలు అంతకంతకూ పెరిగిపోతున్న విద్యా వ్యయంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏటా భారీగా పెరిగిపోతున్న ఫీజులను కట్టలేక నాణ్యమైన చదువులకు విద్యార్థులు దూరమవుతున్నారు. ఇలా అర్థంతరంగా చదువులు మానేసేవారి శాతం అంతకంతకూ పెరిగిపోతోంది. కొంతవరకు బ్యాంకులు విద్యా రుణాలు అందిస్తున్నా అవి అందరికీ దక్కడంలేదు. దీంతో డ్రాపవుట్లు పెరుగుతున్నాయి.
ప్రభుత్వరంగంలో తగ్గిపోయిన విద్యాసంస్థలు
ప్రపంచంలోనే అత్యధిక యువజనాభా భారతదేశంలోనే ఉంది. అయితే దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ రంగంలో విద్యా సంస్థలు ఏర్పాటు కావడం లేదు. ప్రైవేటు రంగంలోనే ఎక్కువ విద్యా సంస్థలు ఏర్పాటవుతున్నాయి. దీంతో ప్రైవేటు విద్యా సంస్థలు భారీగా ఫీజులు వసూలు చేస్తూ నడ్డి విరుస్తున్నాయి.
ప్రభుత్వ రంగంలో ఎక్కువ విద్యా సంస్థలు ఏర్పాటయితే ప్రైవేటు సంస్థలతో పోలిస్తే ఫీజుల భారం తక్కువగా ఉంటుంది. అయితే అలా జరగకపోవడంతో పేదలు, మధ్యతరగతి వర్గాలు భారీ ఫీజులను చెల్లించలేక చదువులకు స్వస్తి చెబుతున్నాయి. దేశంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో గత 15 ఏళ్లలో వివిధ కోర్సుల ఫీజులు 300 శాతం పెరిగాయి. దేశంలో గత 20 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే దిమ్మతిరిగే విషయాలు వెల్లడయ్యాయి.
భారీగా ఫీజుల భారం..
దేశంలో ప్రైవేటు స్కూళ్లు, కళాశాలలు, యూనివర్సిటీలు పెరిగిపోవడం.. ప్రభుత్వ రంగంలో విద్యా సంస్థలు తగ్గిపోవడంతో విద్యార్థులపై భారీ ఎత్తున ఫీజుల భారం పడుతోంది. దీంతో విద్యకు సంబంధించిన ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరిగిపోతోంది. తాజా నేషనల్ శాంపుల్ సర్వే ప్రకారం.. 2014–2018 మధ్య ప్రాథమిక విద్యకు తల్లిదండ్రులు 30.7 శాతం వ్యయం చేశారు. అలాగే ప్రాథమికోన్నత తరగతులకు 27.5 శాతం ఖర్చు పెట్టారు.
లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం.. కోవిడ్ తర్వాత తమ పిల్లల స్కూల్ ఫీజులు 30 శాతం నుంచి 50 శాతం వరకు పెరిగాయని 42 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు. తన కుమారుడి ఫీజు కింద నెలకు రూ.30,000 చెల్లిస్తున్నానంటూ హరియాణాలోని గురుగ్రామ్‌లో ఒక తండ్రి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లో ఒక స్కూల్ ఒకేసారి 50 శాతం ఫీజు పెంచింది.
44 శాతం మంది చదువులకు దూరం
నేషనల్ శాంపుల్ సర్వే ప్రకారం.. 23 శాతం మంది ఆర్థిక ఇబ్బందులతోనే చదువులు మానేశారు. 21 శాతం మంది తమ కుటుంబ పోషణ కోసం పనులకు వెళ్లడం వల్ల చదువులు మానేశామని చెప్పారు. అంటే దేశ యువతలో 44 శాతం మంది పెరిగిన ఫీజులు, కుటుంబ ఆరి్థక పరిస్థితులతో ఉన్నత చదువులు చదవలేకపోయారు. ఈ నేపథ్యంలో విద్య నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు భారం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.
ఎంబీబీఎస్.. ఫీజుల మోత మోగాల్సిందే..
⇒ ప్రైవేటు స్టేట్ యూనివర్సిటీల్లో రూ.80 లక్షల నుంచి రూ.1.25 కోట్ల వరకు
⇒ డీమ్డ్ యూనివర్సిటీల్లో రూ.1.25 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకు
⇒ ఎన్నారైలకు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు
Tags
- Education Fees
- School Fees
- increase in fees
- govt and private institutions
- Education News
- Sakshi Education News
- latest sakshi education news
- Sakshi Education Newss
- Education Institutions
- students education
- schools and college fees
- instistutions fees
- private schools and coollege fees increased
- fees is burden
- Rising Education Costs
- Private vs Public Education
- Education Policy Issues
- Government Role in Education
- Private schools fees
- SakshiEducationUpdates