Narcotics Control Bureau: ప్రముఖ కాలేజీల్లో గుట్టుగా గంజాయి
పట్టుబడిన వారిలో గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 15 మంది విద్యార్థులతోపాటు కలినరీ అకాడమీ ఆఫ్ ఇండియాకు చెందిన నలుగురు, సీబీఐటీలో ఒకరు, బాసర ట్రిపుల్ ఐటీకి చెందిన కొందరు, జేఎన్‌టీయూ (జోగిపేట్)లో ముగ్గురు, సింబయోసిస్ కాలేజీకి చెందిన 25 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు.
అలాగే ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో ఆరుగురు జూనియర్ డాక్టర్లు గంజాయి తాగుతూ పట్టుబడ్డారని.. వారిపై చర్యలు తీసుకోవాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాశామన్నారు.
చదవండి: Students and Teachers Bond : అధ్యాపకులపై విద్యార్థుల భావోద్వేగం.. వెళ్లొద్దంటూ కన్నీళ్లు!
ఇండస్ స్కూల్ విద్యార్థులకు కోడ్ పేర్లతో ఈ–సిగరెట్లు విక్రయిస్తున్న అహ్మద్, జాఫర్‌లను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వారి వివరాలు వెల్లడించలేకపోతున్నామని పేర్కొన్నారు.
ఆయా విద్యార్థులను అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చినట్లు చెప్పారు. సాంకేతిక సహకారం, నిఘా వర్గాల నుంచి సేకరిస్తున్న సమచారంతో విజయవంతంగా మత్తుపదార్థాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
చదవండి: AP Govt Schools : ఇకపై సర్కారు బడుల్లో తెలుగు మీడియం మాత్రమేనా..!
నిఘా పెంచాం..
రాష్ట్రంలోని పబ్బుల్లో మత్తుపదార్థాల వాడకంపై నిఘా పెంచినట్లు టీజీఏఎన్‌బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. ఇటీవలే హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లోని ఆర్టిస్ట్రి పబ్‌లో డ్రగ్స్ సేవిస్తున్న ముగ్గురు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా కేవ్ పబ్‌లో ఫారెస్ట్ ఆల్‌కెమీ పేరిట నిర్వహించిన పార్టీలో పాల్గొన్న 52 మందికి పరీక్షలు నిర్వహించగా 33 మంది గంజాయి, కొకైన్, ఎండీఎంఏ వాడినట్లు నిర్ధారణ అయిందన్నారు.
హైదరాబాద్‌లో తరచూ ఈవెంట్లు నిర్వహిస్తున్న డీజేల వివరాలను సేకరించినట్లు సందీప్ శాండిల్య తెలిపారు. పబ్బుల్లో 21 ఏళ్లలోపు యువతకు మద్యం సరఫరా చేస్తున్నారా లేదా అనే దానిపైనా నిఘా పెట్టాలని, ఆధార్ కార్డులను తనిఖీ చేసి వయసు నిర్ధారించాలని యూనిట్ అధికారులకు సూచిస్తున్నట్లు చెప్పారు.
డ్రగ్స్ వాడకాన్ని నిరోధించేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రముఖ విద్యాసంస్థలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు సూచిస్తున్నామని తెలిపారు. మత్తుపదార్థాలకు బానిసలైన వారిని అందులోంచి బయటపడేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
80 శాతం గంజాయి ఒడిశా నుంచే..!
ఏపీ, తెలంగాణలోకి రవాణా అవుతున్న గంజాయిలో 80 శాతం వరకు ఒడిశా నుంచే వస్తోంది. ఒడిశాలో సాగుచేసి రవాణా చేస్తున్న గంజాయి ప్రధానంగా ఖమ్మం జిల్లా సరిహద్దు నుంచే తెలంగాణలోకి వస్తున్నట్లు వెల్లడించాయి. డ్రగ్స్, గంజాయి వినియోగం, రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం ఆదేశించడంతో రాష్ట్ర సరిహద్దులో మరింత నిఘా పెంచామని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు.