APIIC: ఆరు నైపుణ్య కళాశాలలు: ఏపీఐఐసీ
రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య వనరులను అందించే విధంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక నైపుణ్య కళాశాల వంతున 25 కాలేజీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో 23 కళాశాలలను ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) నిర్మిస్తుండగా రెండు కాలేజీలను కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఏర్పాటు చేయనుంది. ఈ 23 కాలేజీల నిర్మాణ పనుల బాధ్యతను ఏపీఎస్‌ఎస్‌డీసీ మూడు ప్రభుత్వరంగ సంస్థలకు అప్పగించింది. ఇందులో ఏపీఐఐసీకి 6 కాలేజీలు, ఆర్‌అండ్‌బీకి 10, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ కు 7 కాలేజీల నిర్మాణ బాధ్యతలను అప్పగించింది. వీటిలో 6 కాలేజీల నిర్మాణానికి ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. మిగిలిన కాలేజీల నిర్మాణానికి కూడా త్వరలో టెండర్లు పిలవనున్నారు.
3 జిల్లాల్లో 6 నైపుణ్య కళాశాలలు
కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో స్కిల్ కాలేజీల నిర్మాణ బాధ్యతలను ఏపీఐఐసీ దక్కించుకుంది. ఒక్కో కాలేజీని రూ.17 కోట్లతో నిర్మించడానికి టెండర్లు పిలిచింది. విజయవాడలోని పాలిటెక్నికల్ కాలేజీ వద్ద, మచిలీపట్నం–చల్లపల్లి బైపాస్ రోడ్డులో స్కిల్ కాలేజీల నిర్మాణానికి ఒక ప్యాకేజీ కింద రూ.34 కోట్లతో టెండర్లు పిలిచింది. గుంటూరు జిల్లా నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ వద్ద, బాపట్లలోని ఎక్స్‌టెన్షన్ ట్రైనింగ్ సెంటర్‌లోను, నరసరావుపేటలో, ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రభుత్వ ఐటీఐ కాలేజీ వద్ద నిర్మించే స్కిల్ కాలేజీలను ఒక ప్యాకేజీ కింద రూ.68 కోట్లకు టెండర్లు పిలిచింది. టెండర్ల దరఖాస్తులను అక్టోబర్ 16 ఉదయం 11 గంటల నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 30వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు టెండర్లు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రివర్స్ టెండరింగ్ విధానంలో కాంట్రాక్టర్‌ను ఎంపిక చేస్తారు.