New Medical College: వైద్య విద్యకు వేళాయె..
రాష్ట్ర వైద్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సెప్టెంబర్ 14న కళాశాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. పాత కలెక్టరేట్, ఆర్‌అండ్‌బీ కార్యాలయాలు కలిపి మొత్తం ఎనిమిది ఎకరాల్లో కళాశాల ఏర్పాటైంది. ఈ ఏడాది 100 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభం కానుండగా.. ఇప్పటికే ప్రవేశాలు పూర్తయ్యాయి.
చదవండి: Telangana Jobs: మెడికల్ ఆఫీసర్ పోస్టులు.. నెలకు రూ.52,000 జీతం..
గత ఏడాది మంజూరు
ప్రతీ జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఖమ్మంకు గత ఏడాది కళాశాలను మంజూరు చేసింది. ఆ వెంటనే పాత కలెక్ట రేట్, ఆర్‌అండ్‌బీ కార్యాలయం, డీఎంహెచ్‌ఓ కార్యాలయాలను కేటాయించారు. మొత్తంగా ముప్ఫై ఎకరాల స్థలం అందుబాటులోకి రాగా.. పాత కలెక్టరేట్, ఆర్‌అండ్‌బీ కార్యాలయం కలిపి ఎనిమిది ఎకరాల్లో వైద్యకళాశాల ఏర్పాటు చేశారు.
ఆయా ప్రాంగణాల్లో భవనాల ఆధునికీకరణకు ప్రభుత్వం రూ.8.5కోట్లు కేటాయించడంతో చక చకా చేపట్టారు. అనంతరం పలుమార్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. కళాశాలకు అవసరమైన స్థలం నగర నడిబొడ్డున ఉండడం, ఇతరత్రా సౌకర్యాలు అను కూలంగా ఉండడంతో అనుమతి జారీ చేశారు.
చదవండి: MBBS Students Ragging: మెడికల్ విద్యార్థులకు ఇది తగునా... ఏడాది సస్పెండ్, హాస్టల్ కి కూడా నో
అంతా సిద్ధం
కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యాన ఈ విద్యాసంవత్సరం ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 100 సీట్లతో నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి అనుమతులు లభించాయి. గతనెల 22వ తేదీన ఇద్దరు విద్యార్థులు ప్రవేశం పొందగా, దశల వారీగా మిగతా సీట్లు సైతం భర్తీ అయ్యాయి. పాత కలెక్టరేట్ ఆవరణలో పరిపాలన భవనం, లైబ్రరీ, టీచింగ్ హాళ్లు ఏర్పాటు చేయగా.. పాత పౌర సరఫరాల కార్యాలయం, ఈవీఎం గోదాంలో ల్యాబ్‌లు, లెక్చర్ హాళ్లు సిద్ధం చేశారు.
ఇక పాత గిరిజనాభివృద్ధి అధికారి కార్యాలయాన్ని బయో కెమిస్ట్రీ, అనాటమీ శాఖల ఉద్యోగులకు, పాత ఆర్‌అండ్‌బీ కార్యాలయాన్ని బాలికల హాస్టల్‌గా, డీఎంహెచ్‌ఓ కార్యాలయాన్ని బాలుర హాస్టల్‌గా తీర్చిదిద్దారు. ఆతర్వాత అంతర్గత రహదారుల నిర్మాణం కూడా పూర్తిచేశారు. ఇక ప్రభుత్వం విడుదల చేసిన రూ.166 కోట్లతో త్వరలోనే పూర్తిస్థాయిలో మెడికల్ కళాశాల భవనాలు నిర్మించనున్నారు.
మమత కళాశాల ముస్తాబు
రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్ సెప్టెంబర్ 14న ఉదయం 10 గంటలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆతర్వాత మమత మెడికల్ కళాశాల ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించే సిల్వర్‌జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు. అక్కడ నూతనంగా నిర్మించిన సిల్వర్‌జూబ్లీ బ్లాక్‌ను ప్రారంభిస్తారు. అనంతరం కళాశాల ఆవరణలోని సభావేదికపై మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావు 85వ జన్మదిన వేడుకలు నిర్వహిస్తారు.
కాగా, మమత మెడికల్ కాలేజీని 1998లో 100 సీట్లతో ప్రారంభించగా దశల వారీగా ఇప్పుడు 200 సీట్లకు చేరింది. ఇక 2003లో 55 సీట్లతో పీజీ కాలేజీగా అవకాశం లభించగా, సీట్ల సంఖ్య 104కు పెరిగింది. ఇక్కడ వైద్య విద్యతోపాటు 23ప్రత్యేక విభాగాల్లో వైద్యసేవలు అందిస్తున్నారు.