Medical College: వైద్యకళాశాల సాకారం
36 ఎకరాల్లో.. రూ.39 కోట్లతో..
జిల్లా కేంద్రం శివారులోని పెద్దూరు బైపాస్‌రోడ్డులో 36 ఎకరాల్లో రూ.39కోట్లతో మెడికల్ కాలేజీ భవనం నాలుగు అంతస్తుల్లో నిర్మితమైంది. ప్రతి ఫోర్‌లోని నాలుగు బ్లాక్‌లు ఉన్నాయి. సర్ధాపూర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలో హాస్టల్ వసతి కల్పించారు. మెడికల్ కాలేజీలో ఇప్పటికే 90 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. వంద మంది వైద్యులు, ఇందులో 50 మంది ఫ్యాకల్టీలు, 38 మంది సీనియర్ రెసిడెంట్ వైద్యులు, మరో 12 మంది ఐసీయూ వైద్యులు విధుల్లో చేరారు. నాన్‌టీచింగ్ స్టాఫ్ మరో 250 మంది ఉన్నారు.
మంత్రి కేటీఆర్ చొరవతో.. సీఎం కేసీఆర్ ప్రకటన
జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయించడంలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు సఫలీకృతులయ్యారు. 2021 జూలై 4న సీఎం కేసీఆర్ సిరిసిల్లకు మెడికల్ కాలేజీని మంజూరు చే స్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు మెడికల్ కాలేజీని మంజూరుచేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) న్యూఢిల్లీ లెటర్ ఆఫ్ ఇన్‌టెంట్(ఎల్‌వోటీ)ను జారీ చేసింది.
కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జిల్లా మెడికల్ కాలేజీకి వంద ఎంబీబీఎస్ సీట్లను కేటాయించారు. దీనికి అనుగుణంగా నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశాలు జారీచేసింది. మంత్రి కేటీఆర్ చొరవతో మెడికల్ కాలేజీ భవనం పూర్తయింది.
ఈ ఏడాది వంద సీట్లు
మెడికల్ కాలేజీలో మొదటి ఏడాది వంద సీట్లు కేటాయించారు. ఇందులో 15 సీట్లు ఆలిండియా కోటాలో, మరో 85 సీట్లు రాష్ట్ర స్థాయి అభ్యర్థులకు కేటాయించారు. ఇప్పటికే 90 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. మరో పది మంది చేరాల్సి ఉంది. త్వరలో వైద్యవిద్య బోధన తరగతులు ప్రా రంభంకానున్నాయి. సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో మొత్తం 340 బెడ్స్‌ను సిద్ధం చేశారు. పెద్దూరు వద్ద నిర్మించిన సొంత భవనంలోనే తరగతులు ప్రారంభిస్తారు. హాస్టల్‌కు అద్దె భవనాలను సిద్దం చేశారు. ఇటీవల రాష్ట్ర వైద్య విద్యాసంచాలకులు డాక్టర్ రమేశ్‌రెడ్డి సిరిసిల్ల మెడికల్ కాలేజీని సందర్శించారు.
వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు
మెడికల్ కాలేజీ ప్రారంభంతో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు జరగనున్నాయి. సిరిసిల్లలోని జిల్లా ఆస్పత్రిని పూర్తిస్థాయిలో మాత, శిశు సంరక్షణ, నవజాత శిశువుల కేంద్రంగా మారుతుంది. 340 బెడ్స్‌తో ప్రసూతి విభాగం అవుతుంది. ఇప్పటికే ప్రతి నెలా 360 డెలివరీలతో సిరిసిల్ల జిల్లా ఆస్పత్రి అద్భుతమైన ప్రసూతి సేవలను అందిస్తుంది.
జనరల్ ఆస్పత్రి మొత్తంగా మెడికల్ కాలేజీకి మార్చడంతో పెద్దూరు శివారులోని మెడికల్ కాలేజీ బోధనాస్పత్రిగా ఉంటుంది. అన్ని రకాల వైద్యసేవలు, ఆధునిక పరికరాలతో అందుబాటులోకి వస్తుంది. జిల్లా ప్రజలకు ఉచిత వైద్యసేవలు 24 గంటల బోధనాస్పత్రిలో అందుతాయి. ఏ ప్రైవేటు ఆస్పత్రిలో లేని విధంగా అన్ని రకాల వైద్యులు అందుబాటులో ఉంటారు.