University Movie: వాస్తవాలకు ప్రతిరూపం ‘యూనివర్సిటీ’
నారాయణమూర్తి నటించిన యూనివర్సిటీ సినిమా ప్రారంభోత్సవ షోను తణుకు వెంకటేశ్వర థియేటర్‌లో అక్టోబర్ 15న మంత్రి కారుమూరి స్వయంగా వీక్షించారు. ఈ సందర్భంగా సినిమా చూసిన అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యావ్యవస్థలో ఉన్న లోపాలను యూనివర్సిటీ సినిమాలో కళ్లకు కట్టినట్లుగా చూపించారని అన్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి పేరుతో గత ప్రభుత్వం మోసం చేసిన వైనం, తెలుగుతోపాటు ఇంగ్లీషు విద్యకు ఉన్న ప్రాధాన్యతను కూడా ఈ సినిమాలో స్పష్టంగా చూపించారని అన్నారు. ఈ సమస్యలను ముందుగానే గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టారని, విద్యార్థులకు ట్యాబ్‌లు అందచేసి డిజిటల్ విద్యావిధానాన్ని అందుబాటులోకి తేవడంతోపాటు బైజూస్‌తో ఒప్పందం చేసుకుని విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా పాఠ్యాంశాల ద్వారా పట్టు సాధించేలా వారిని సిద్ధం చేశారన్నారు.
సచివాలయ వ్యవస్థ ద్వారా రెండున్నర లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించడమే కాకుండా డీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలను సైతం నిర్వహించి అర్హులందరికీ ఉద్యోగాలు వచ్చేలా చేశారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఉదయం షో టికెట్లన్నీ మంత్రి కారుమూరి కొనుగోలు చేసి అందరినీ సినిమాకు ఆహ్వానించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరి శ్రీవెంకట సుబ్బారావు, థియేటర్ అధినేత ఆకుల బాబు, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మెహర్ అన్సారీ, ఏఎంసీ చైర్మన్ నత్తా కృష్ణవేణి, తణుకు మండల అధ్యక్షుడు బోడపాటి వీర్రాజు, ఎస్సీ సెల్ తణుకు మండల అధ్యక్షుడు జంగం ఆనంద్‌కుమార్, ములగాల శ్రీనివాస్, కుడుపూడి చంద్రరావు, తాటిపర్తి వాసు, తానేటి వీరయ్య, ఝాన్సీ లారెన్స్, సామంతుల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.