Education fees: ఫీజుల ఖరారులో హేతుబద్ధత లేదు
క్షేత్రస్థాయిలో పరిస్థితులను ప్రభుత్వం పట్టించుకోకుండా, ఏకపక్షంగా ఫీజులు ఖరారు చేసిందని ఆయా విద్యాసంస్థల తరఫున సీనియర్ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, బి.ఆదినారాయణరావు, పి.వీరారెడ్డి కోర్టుకు వివరించారు. ఫీజుల ఖరారు సందర్భంగా తమ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అయ్యే ఖర్చు, తమ ఆదాయ, వ్యయాలను పరిగణనలో తీసుకోలేదని, ఫీజులు ఖరారు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని వారు కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న హైకోర్టు పాఠశాల విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ (ఏపీఎస్‌ఈఎంఆర్‌సీ)తో పాటు ప్రభుత్వ వాదనల నిమిత్తం తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 53, 54లను సవాలు చేస్తూ తూర్పు గోదావరి ప్రైవేట్ పాఠశాలల సంఘం, ఏపీ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాల సంఘం, తదితరులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.