APSCHE: జేఎన్‌టీయూ వీసీగా శ్రీనివాసరావు
రాష్ట్ర గవర్నర్/ చాన్సలర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపినట్లు ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రెటరీ జె.శ్యామలారావు ఉత్తర్వులు జారీ చేశారు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఆర్‌జీయూకేటీ (ఐఐఐటీ) నూజివీడు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రా యూనివర్సిటీలో సివిల్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ అయిన జీవీఆర్ శ్రీనివాసరావు బోధన, పరిశోధనలో విశేషానుభవం గడించారు. 2016లో బెస్ట్ టీచర్ అవార్డు దక్కించుకున్నారు. 2017లో ఆంధ్రా వర్సిటీ అందించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ బెస్ట్ అకడమిషియన్ అవార్డు అందుకున్నారు. ఐపీహెచ్‌ఈ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఆంధ్రా వర్సిటీల్లో పలు హోదాల్లో కీలక సేవలు అందించారు.
చదవండి: APSCHE: ఎస్కేయూ వీసీగా హుస్సేన్‌రెడ్డి
బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా, వర్సిటీ ఇంజినీర్, ఎస్టేట్ ఆఫీసర్, ఉన్నత భారత్ అభియాన్ కమిటీ సభ్యులుగా విశేషమైన సేవలు అందించారు. నాలుగు రీసెర్చ్ ప్రాజెక్ట్‌లు పూర్తి చేశారు. 17 మంది పీహెచ్‌డీ విద్యార్థులకు ఈయన పర్యవేక్షణలో డాక్టరేట్‌లు అందించారు. 63 ఎంటెక్ ప్రాజెక్ట్‌లు చేశారు. 37 బీటెక్ ప్రాజెక్ట్‌లకు నేతృత్వం వహించారు. 15 ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు నిర్వహించారు.
37 జాతీయ సదస్సులకు అధ్యక్షత వహించారు. పాలనా పరమైన అంశాల్లో విశేషమైన అనుభవం, సమర్థత, పని పట్ల బాధ్యత, ఉన్నతాధికారుల పట్ల విధేయతగా ఉండడంతో వీసీగా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇది వరకు వీసీగా ఉన్న ప్రొఫెసర్ జింకా రంగజనార్దన పదవీ కాలం బుధవారంతో ముగిసింది. ఆయన జేఎన్‌టీయూఏ ప్రొఫెసర్ కావడంతో కలికిరి ఇంజినీరింగ్ కళాశాల మెకానికల్ విభాగం ప్రొఫెసర్‌గా బదిలీ అయ్యారు.
అనుభవానికి ప్రాధాన్యం ప్రణాళికాబద్ధంగా కార్యనిర్వహణ
సాంకేతిక విద్యలో రాయలసీమకే తలమానికంగా ఉన్న జేఎన్‌టీయూ అనంతపురం వీసీగా నియమితులవడం సంతోషదాయకం. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రణాళికాబద్ధంగా యూనివర్సిటీని ప్రగతిపథాన నడిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తా.
– జీవీఆర్ శ్రీనివాసరావు, నూతన వీసీ