Skip to main content

UGC: సీటు రద్దు చేసుకుంటే ఫీజు వాపస్‌.. ఇన్ని రోజుల కంటే ముందు అయితే 100% రిఫండ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఉన్నత విద్యా సంస్థల్లో చేరిన విద్యార్థులు సీటు రద్దు చేసుకున్నప్పుడు అప్పటికే చెల్లించిన వార్షిక ట్యూషన్‌ ఫీజును తిరిగి ఇవ్వాలని University Grants Commission (UGC) స్పష్టం చేసింది.
UGC
సీటు రద్దు చేసుకుంటే ఫీజు వాపస్‌.. ఇన్ని రోజుల కంటే ముందు అయితే 100% రిఫండ్‌

ప్రాసెసింగ్‌ ఫీజు రూ.1,000 మాత్రం సంబంధిత సంస్థలు తీసుకోవచ్చని తెలిపింది. సీటు రద్దు చేసుకునే సమయాన్ని బట్టి ట్యూషన్‌ ఫీజు చెల్లింపు ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు మార్గదర్శకాలతో కూడిన ఫీజు రిఫండ్‌ పాలసీని యూజీసీ విడుదల చేసింది. అన్ని కౌన్సెలింగ్‌లు ముగిసి, అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన తేదీని కటాఫ్‌గా నిర్థారించింది. చెల్లింపు ప్రక్రియను ఐదు కేటగిరీలుగా విభజించింది.

ఈ పాలసీని 2023 నుంచే ముందుకు తీసుకెళ్ళాలని అన్ని రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్ళకు సూచించింది. ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ (ఎఫ్‌ఆర్‌సీ) నిర్ణయించిన మేరకు ట్యూషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఒక్కో కాలేజీలో ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని కాలేజీల్లో ఇది లక్షల్లో ఉంది.

చదవండి: New Courses in IITs: మెషిన్‌ లెర్నింగ్‌, క్వాంటం టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌.. ప్రవేశం విధానం, కెరీర్‌ అవకాశాలు ఇవే..

ప్రైవేటు కాలేజీల వేధింపుల నేపథ్యంలోనే...

సీటు వచ్చిన తర్వాత విద్యార్థులు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ సమయంలో రూ.1,000 చెల్లిస్తారు. సీటు ఖరారైనప్పుడు కాలేజీకి మొత్తం ట్యూషన్‌ ఫీజు చెల్లించడంతో పాటు సర్టిఫికెట్లు ఇస్తారు. అయితే కొన్నిసార్లు విద్యార్థులకు ఇతర అవకాశాలు వస్తాయి. అప్పుడు అప్పటికే చేరిన కాలేజీలో సీటు వదిలేస్తారు. ఇలాంటి సందర్భాల్లో కాలేజీలు విద్యార్థుల సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వకుండా, చెల్లించిన ఫీజు రీఫండ్‌ చేయకుండా వేధిస్తున్నట్టు ఫిర్యాదులున్నాయి. వీటిపై యూజీసి గత నెల 27న నిర్వహించిన సమావేశంలో చర్చించింది.

ఈ అంశంపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఇది కేవలం మొదటి సంవత్సరం విద్యార్థులకే పరిమితమవుతుందా? ఏ సంవత్సరంలో సీటు వదులుకున్నా వర్తిస్తుందా? అనే దానిపై యూజీసి స్పష్టత ఇవ్వలేదు. అడ్మిషన్ల ప్రక్రియ చివరి తేదీని కటాఫ్‌గా నిర్ణయించడం వల్ల కేవలం మొదటి సంవత్సరం విద్యార్థులకే ఇది పరిమితమని ప్రైవేటు కాలేజీలు అంటున్నాయి. 

చదవండి: JEE Advanced: టాపర్లంతా ఈ ఐఐటీ వైపే.. ఏ ఐఐటీలో ఎంత మంది?

ఐదు కేటగిరీలుగా..

ఈ సంవత్సరం అన్ని రాష్ట్రాల్లోనూ అడ్మిషన్ల ప్రక్రియను అక్టోబర్‌ 31లోగా పూర్తి చేయాలని యూజీసీ సూచిస్తోంది. ఈ తేదీకి ముందు, ఆ తర్వాత సీటు రద్దు చేసుకునే విద్యార్థులను వివిధ కేటగిరీలుగా విభజించారు.

  • అక్టోబర్‌ 31కి 15 రోజలు కంటే ముందే సీటు రద్దు చేసుకుంటే 100 శాతం ట్యూషన్‌ ఫీజును తిరిగి చెల్లించాలి.
  • ప్రవేశాల నోటిఫికేషన్‌ ఇచ్చిన తేదీకి ముందు 15 రోజుల్లో సీటు రద్దు చేసుకుంటే 90 శాతం ఫీజు తిరిగి ఇవ్వాలి.
  • అడ్మిషన్ల ముగింపు తేదీ తర్వాత 15 రోజుల్లో ఎప్పుడు సీటు రద్దు చేసుకున్నా 80 శాతం ఫీజు తిరిగి ఇవ్వాలి.
  • అడ్మిషన్‌ తేదీ ముగిసిన 15 నుంచి నెల రోజుల్లో సీటు వద్దనుకునే విద్యార్థులకు 50 శాతం ఫీజు వాపసు ఇవ్వాలి. ఆ తర్వాత సీటు వద్దనుకునే వారికి చెల్లించిన ఫీజు ఏమాత్రం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. 

స్పష్టత కొరవడిన యూజీసీ ఆదేశాలు 
ఫీజు వాపసు ఇచ్చేందుకు యూజీసీ ఇచ్చిన ఆదేశాలు మరింత స్పష్టంగా ఉంటే బాగుండేది. మార్గదర్శకాలు మొదటి సంవత్సరం విద్యార్థులకే సంబంధించినవిగా కన్పిస్తున్నాయి. అలా కాకుండా కోర్సు పూర్తయ్యే వరకూ వర్తిస్తుందనే విషయాన్ని స్పష్టం చేసి ఉంటే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. 
– డాక్టర్‌ వి.బాలకృష్ణారెడ్డి (రాష్ట్ర సాంకేతిక, వృత్తి విద్యా సంస్థల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు) 

Published date : 07 Jul 2023 02:40PM

Photo Stories