Satavahana University: ‘వర్సిటీ’.. ఈ సమస్యలేమిటి?
సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వీటికితోడు తరగతులు సరిగా నిర్వహించకపోవడం, అనుకున్న స్థాయిలో విద్యాబోధన జరగడం లేదని, ఫలితంగా చదువులో వెనకబడుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా నడుస్తున్న ఫుడ్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాలను రెగ్యులర్ కోర్సులుగా మార్చాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయినా ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.
13 ఏళ్లు రెగ్యులర్ కోర్సులుగా ఉన్న తెలుగు, ఆంగ్లం, బోటనీ, మ్యాథమేటిక్స్ విభాగాలను యూజీసీ, 12బీ గుర్తింపు వచ్చిన తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా మార్చారు. దీంతో తాము ఆర్థి కంగా ఇబ్బంది పడుతున్నామని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు వాపోతున్నారు. పోస్టుల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, ఉన్నత విద్య ఎలా సాగుతుందని వారు ప్రశ్నిస్తున్నారు.
కేంద్ర సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిసారీ మొండి చేయి చూపడంతో విద్యార్థులకు పరిశోధన ఫెలోషిప్ దక్కడం లేదు.
చదవండి: Dream Successful: యువకుడి గెలుపుతో ఊరుంతా సంబరం
ఏ విభాగంలోనూ సగం మంది లేరు
శాతవాహన యూనివర్సిటీ ఏర్పాటు చేసినప్పటి నుంచి అధ్యాపకులు, సిబ్బందిని సరిపడా నియమించడం లేదు. వర్సిటీలో 114 మంది బోధనా సిబ్బంది ఉండాలి. కానీ, 63 మందితోనే నెట్టుకొస్తున్నారు. వీటిలో 16 పోస్టులు రెగ్యులర్ కాగా, మిగతావన్నీ కాంట్రాక్ట్, పార్ట్ టైం, రిటైర్డ్/గెస్ట్/అడ్జస్ట్ ఫ్యాకల్టీ.
10 మంది ప్రొఫెసర్ పోస్టులకు గానూ 8 ఖాళీగా ఉన్నాయి. ఇద్దరే రెగ్యులర్ ప్రొఫెసర్లు ఉన్నారు. 18 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు గానూ ఐదుగురు, 40 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు గానూ 9 మంది మాత్రమే పని చేస్తున్నారు. 37 మంది కాంట్రాక్టు, 13 మంది పార్ట్ టైం అధ్యాపకులతో, ఆరుగురు రిటైర్డ్ గెస్ట్ ఫ్యాకల్టీలతో తరగతులు నిర్వహిస్తున్నారు. 51 మంది బోధనేతర సిబ్బంది అవసరం ఉండగా 13 మంది ఉన్నారు. మిగతా ఖాళీల్లో ఔట్ సోర్సింగ్, రోజువారీ సిబ్బందితో పని చేయిస్తున్నారు.
విశ్వవిద్యాలయ స్థాయిలో నిబంధనల ప్రకారం ప్రతీ విభాగానికి ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. కానీ, ఏ ఒక్క విభాగానికీ వీటిలో సగం మంది లేరు. వర్సిటీలో అత్యంత కీలకమైన పరిపాలన విభాగంలో నాన్ టీచింగ్ పోస్టులు 75 శాతం ఖాళీగా ఉన్నాయి.
ఫలితంగా ఉన్న సిబ్బందిపై అధిక భారం పడుతోంది. వారు రెగ్యులర్ సిబ్బంది కాకపోవడంతో జవాబుదారీతనంలో పని చేయడం లేదన్న విమర్శలున్నాయి. దీంతో ఇటు పరిపాలన, అటు విద్యాబోధనపై తీవ్ర ప్రభావం పడుతోందని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. యూనివర్సిటీ సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం పాలక మండలిని ఏర్పాటు చేసినా నామమాత్రంగా మారిందన్న ఆరోపణలున్నాయి. పాలకవర్గ సభ్యులు ఎక్కువగా ప్రైవేట్ కాలేజీలకు చెందినవారు కావడంతో పూర్తిస్థాయిలో దృష్టిసారించడం లేదని పలువురు పేర్కొంటున్నారు.