Removal of Colleges: చేరికలు..తగ్గితే..వేటే!
ఇబ్బడిముబ్బడిగా కళాశాలలు, డిమాండ్‌కు మూడురెట్ల మేర సీట్లు, మౌలిక సదుపాయాలు, బోధన ప్రమాణాల్లో నాణ్యత లేమి.. ఫలితంగా అరకొరగా విద్యార్థుల చేరికలు. ఇలాంటి దుస్థితి నుంచి ఉన్నత ప్రమాణాల దిశగా ఉన్నత విద్యాసంస్థలను తీర్చిదిద్దేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతులు నిలిపివేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా సరైన చేరికలు లేని కళాశాలలను మూసివేయడానికి చర్యలు చేపట్టాలని ఇటీవల అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. ఈ నిర్ణయానికి ముందు బీవీఆర్ మోహన్‌రెడ్డి (ఐఐటీ హైదరాబాద్) నేతృత్వంలోని కమిటీ ఏఐసీటీఈకి తన సిఫార్సులు అందించింది. డిమాండ్‌కు మించి సీట్లు ఉండడం, అరకొరగా సీట్ల భర్తీతో కళాశాలలను నిర్వహించడం యాజమాన్యాలకు ఆర్థిక భారమవుతోందని తన సిఫారసుల్లో పేర్కొంది. దీంతో యాజమాన్యాలు సరైన సదుపాయాలు కల్పించలేకపోతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో కొత్త కళాశాలలకు అనుమతులు ఇవ్వరాదని సూచించింది. దీంతో కమిటీ సిఫారసుల మేరకు 2024 వరకు కొత్త కళాశాలలను అనుమతించరాదని ఏఐసీటీఈ నిర్ణయించింది.
Also read : Mega IT Job Fair: 30కి పైగా కంపెనీలు.. నమోదుకి చివరి తేదీ ఇదే..
ఇప్పటికే ఏఐసీటీఈకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ
వాస్తవానికి.. రాష్ట్రంలో డిమాండ్‌కు మించి కళాశాలలు, సీట్లు ఉన్నందున కొత్తగా కళాశాలలకు అనుమతులు ఇవ్వవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఏఐసీటీఈకి ఇంతకు ముందే లేఖ రాసింది. కానీ కొత్త వాటికి ఆ సంస్థ అనుమతులు ఇస్తూ పోయింది. దీంతో రాష్ట్రంలో డిమాండ్ కన్నా సీట్లు మరింత పెరిగాయి. ప్రమాణాలు దిగజారిపోతుండడంతో ఏఐసీటీఈ సూచనలకు ముందే రాష్ట్రంలోని ఇలాంటి కళాశాలలపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చేరికలు లేని కళాశాలలకు చెక్ పెట్టింది. వాటికి ముందుగా నోటీసులు ఇచ్చి లోపాలను సరిదిద్దుకోవడానికి సమయం ఇచ్చింది. ఉన్నత విద్యా పర్యవేక్షణ నియంత్రణ కమిషన్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించింది. లోపాలపై వారికి నోటీసులు జారీ చేసింది. వీటిని అనుసరించి లోపాలను సరిచేసుకోని కళాశాలలపై చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో కొన్ని కళాశాలలు తమంతట తామే మూత వేసుకున్నాయి. మరికొన్నిటికి ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ప్రవేశాలకు అనుమతించలేదు. ప్రవేశాల ప్రక్రియకు సంబంధించిన కౌన్సెలింగ్ నుంచి వాటిని తొలగించింది.
Also read: Harshanth Sairam: ‘పీజీ సూపర్‌స్పెషాలిటీ’లో ఖమ్మంవాసికి ఫస్ట్ ర్యాంక్
91 ఇంజనీరింగ్, 21 ఫార్మా కళాశాలల తొలగింపు
337 ఇంజనీరింగ్, ఫార్మా కళాశాలల్లో అనుమతులు, ప్రమాణాలు లేకుండా, నిర్ణీత రుసుములు చెల్లించకుండా నడుస్తున్న 91 ఇంజనీరింగ్, 21 ఫార్మా కళాశాలలకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చి కౌన్సెలింగ్ నుంచి తొలగించింది. అలాగే గత కొన్నేళ్లుగా చేరికలు అరకొరగా ఉన్న అనంతపురం జేఎన్టీయూ పరిధిలో 28, కాకినాడ జేఎన్టీయూ పరిధిలో 22 కళాశాలలకు కూడా అడ్మిషన్లను నిరాకరించింది. వీటి మూసివేతకు ఆయా యాజమాన్యాలు ఉన్నత విద్యామండలికి అంగీకారం తెలిపాయి. వచ్చే ఏడాది నుంచి నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని మండలి నిర్ణయించింది. ప్రభుత్వం కళాశాలలకు ఇప్పటికే తగినంత సమయం ఇచ్చింది. అంతేకాకుండా ప్రతి మూడు నెలలకోసారి బకాయిలు లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రమాణాలకు తగ్గట్టుగా బోధన, నిర్ణీత నిష్పత్తిలో చేరికలు ఉండాలని అన్ని కళాశాలలకు ఉన్నత విద్యామండలి ఆదేశాలు ఇచ్చింది. అలా లేని వాటిని ఇకపై కౌన్సెలింగ్‌కు అనుమతించబోమని స్పష్టం చేసింది.
Also read: Intermediate: విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం
డిగ్రీ కళాశాలల్లోనూ ప్రక్షాళన
కాగా, చేరికలు, ప్రమాణాలు లేని డిగ్రీ కళాశాలలపైనా ఉన్నత విద్యామండలి దృష్టి సారించింది. ఇప్పటికే ఈ విద్యాసంవత్సరంలో సరైన అనుమతులు లేకుండా కొనసాగుతున్న 41 డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలను నిలిపేసింది. 257 కళాశాలల్లో 25 శాతం కన్నా తక్కువ చేరికలు ఉన్న 454 కోర్సులకు అనుమతులు రద్దు చేసింది. గతేడాది కూడా యూనివర్సిటీల అఫ్లియేషన్ లేకుండా కొనసాగుతున్న 46 కళాశాలల అనుమతులను మండలి రద్దు చేయడం గమనార్హం. అలాగే చేరికలు లేని 51 కళాశాలల్లోని 147 కోర్సులను కూడా తొలగించింది.
Click here for more Education News