Rachakonda Police: స్కూళ్లలో ‘షీ’క్రెట్ స్టూడెంట్లు!
సెలవుల్లో ఇంటికి వెళ్లిన పిల్లల ప్రవర్తన చూసి తల్లిదండ్రులు ఆరా తీస్తే తప్ప ఏం జరిగిందో బయటపడటం లేదు. పోలీసులంటే పిల్లల్లో నెలకొన్న భయం, ఇతరత్రా కారణాలతో సంఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించడంలో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాచకొండ షీ టీమ్స్ సరికొత్త కార్యాచరణను రూపొందించింది. విద్యా సంస్థలు, వసతి గృహాలు, కంపెనీల్లో షీ టీమ్స్ గూఢచారులను నియమిస్తున్నారు.
చదవండి: Cybercrime: ‘బాల భటులు’ సిద్ధం
ఐటీలో మార్గదర్శక్‌లు..
రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ (ఆర్‌కేఎస్‌సీ) ఆధ్వర్యంలో రాచకొండ పరిధిలోని ప్రభుత్వ సంస్థలు, ఐటీ కంపెనీలలో మార్గదర్శక్ పేరుతో ఉద్యోగులనే గూఢచారులను నియమిస్తున్నారు. ఆయా సంస్థల్లోని ఉద్యోగిణులకు సైబర్ నేరాలతో పాటు గృహ హింస, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వేధింపులపై అవగాహన కల్పిస్తారు.
షెల్టర్ హోమ్స్, మెడికల్, లీగల్, కౌన్సెలింగ్ సేవల సమాచారాన్ని అందిస్తారు. ఈ గ్రూప్‌లో పోలీసులు, మనస్తత్వ నిపుణులు, న్యాయ సలహాదారులు, వైద్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు సభ్యులుగా ఉంటారు.
చదవండి: ఆరేళ్లు పూర్తి చేసుకున్న ‘షీ టీమ్’
వీళ్ల పనేమిటంటే?
ఈ వలంటీర్లకు గుడ్, బ్యాడ్ టచ్‌లతో పాటు పోక్సో చట్టం, కేసులు, శిక్షలు తదితర అంశాలపై పోలీసులు అవగాహన కల్పిస్తారు. ఆకతాయిలపై ఎలా నిఘా వేయాలి, పోలీసులను సంప్రదించే తీరు, ఏ సమస్యపై ఎలా స్పందించాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి? వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు.
ఈ వలంటీర్లు నిరంతరం పోలీసులతో టచ్‌లో ఉంటారు. దీంతో ఆయా విద్యా సంస్థలు, కంపెనీలలో విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని బృందం సభ్యులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందిస్తారు. షీ టీమ్స్ పోలీసులు క్షేత్రస్థాయికి వెళ్లి, అనుమానితులను విచారించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. అదే తప్పు పునరావృతం అయితే కేసులు నమోదు చేసి, జైల్లో పెడతారు.
ఐటీ కంపెనీలలో మార్గదర్శక్‌ల నియామకం
- సైబర్ నేరాలు, వేధింపులపై వలంటీర్ల అవగాహన
- అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి
- రాచకొండ షీ టీమ్ డీసీపీ ఉషారాణి వెల్లడి
హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేశాం
పరిస్థితి చేయి దాటిపోయాక భరోసా కేంద్రాల్లో ఉపశమనం కలిగించే బదులు సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరిస్తే మేలు. మహిళలకు ఎదురయ్యే సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకుని తగిన పరిష్కారం అందించేందుకు 8712662662 హెల్ప్‌లైన్ నంబరు ఏర్పాటు చేశాం.
– టీ ఉషారాణి , డీసీపీ, రాచకొండ మహిళా భద్రతా విభాగం