D Ravinder: క్లోజ్డ్ క్యాంపస్‌గా యూనివర్సిటీ.. ఇకపై బయటి వ్యక్తులు ఇలా
దీనివల్ల కేవలం విద్యార్థులే ప్రాంగణంలో తిరుగుతారన్నారు. ఓయూలో మహిళా విద్యార్థినుల సంఖ్య పెరుగుతోందని, క్లోజ్డ్ క్యాంపస్ ఏర్పాటు వల్ల వారికి మరింత పటిష్టమైన భద్రత చేకూరుతుందని చెప్పారు. మరోవైపు వర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు వివరించారు. రెండేళ్లుగా మౌలిక వసతులకు రూ.145 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఆగస్టు 18న యూనివర్సిటీ ప్రాంగణంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
హాస్టళ్లు.. సరికొత్త క్లాస్‌రూమ్‌లు
- సైఫాబాద్‌లోని యూనివర్సిటీ కాలేజీలో 300 మందికి సరిపడా బాలుర హాస్టల్ నిర్మాణం. నిజాం కాలేజీలో 284 మంది బాలికల కోసం హాస్టల్ ఏర్పాటు. సెంటినరీ హాస్టల్‌ను 500 మందికి సరిపడేలా నిర్మాణం. ఓయూ ప్రాంగణంలో స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్టుల ఏర్పాటు.
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో సరికొత్త క్లాస్ రూంల ఏర్పాటుకు శ్రీకారం. పరిశోధనలకు వీలు కల్పించేలా పూర్తి స్థాయి సాంకేతిక విద్యా విధానం అందుబాటులోకి తెచ్చేందుకు వ్యూహరచన.
- కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతలో భాగంగా పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఓయూకు నిధులు సమకూరాయి. అమెరికాలోని 12 నగరాలను ప్రొఫెసర్ రవీంద్ర సందర్శించారు. అక్కడ పూర్వ విద్యార్థులతో భేటీ అయ్యారు. ఓయూలో వారి అనుభవాలు వివరించేందుకు అంగీకారం కుదిరింది.
- మారుతున్న విద్యా విధానంలో భాగంగా ఈ ఏడాది నుంచి ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీసెస్ అమలు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు వర్సిటీ విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించేందుకు అనుమతి.
- ఈ ఏడాది నుంచి నిరంతర పరీక్షా విధానం అమలు. ఎప్పటికప్పుడు మధ్యంతర పరీక్షలు నిర్వహిస్తారు.
ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో సమీక్ష
ఉస్మానియా యూనివర్సిటీ: నిరంతర పరీక్షా విధానంపై ప్రొఫెసర్ రవీందర్ వివిధ కాలేజీల ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో ఆగస్టు 18న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఇతర కోర్సులకు ఇంటర్నల్ పరీక్షలు, ప్రాక్టికల్స్‌తో పాటు ప్రతి ఆరు నెలలకు ఒక సెమిస్టర్ పరీక్షను నిర్వహిస్తున్నారు. యూజీసీ ప్రవేశ పెట్టిన కొత్త నిబంధనల ప్రకారం సెమిస్టర్ పరీక్షలతో పాటు 15 రోజులకు ఒకసారి పరీక్షలను నిర్వహించేందుకు వర్సిటీ సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ల అభిప్రాయాలు, అభ్యంతరాలు, సందేహాలను వీసీ తెలుసుకున్నారు.