Education: పెదరికంతో ఏ ఒక్కరి చదువు ఆగిపోకూడదు
సీఎం జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ..
- ఫీజులకు తోడుగా వసతి దీవెన..
ప్రతీ పార్లమెంట్‌ను జిల్లాగా చేస్తానని, పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తానని ఇదే నంద్యాల వేదికగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుని మీ ముందుకు వచ్చా. చదువు అనే ఆస్తిని పిల్లలకు ఇవ్వలేకపోతే పేదరికం నుంచి ఆ కుటుంబాలు బయటకు రాలేవు. అందుకే విద్యారంగాన్ని సమూలంగా మార్చే దిశగా అడుగులు వేశాం. గత సర్కారు హయాంలో అరకొరగా ఫీజుల విదిలింపులతో ఎంతో మంది చదువులకు గండం ఏర్పడింది. ఇప్పుడు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తూ ఆదుకుంటున్నాం. భోజన, వసతి ఖర్చులు కూడా రూ.వేలల్లోనే ఉంటున్నాయి. వీటికి కూడా తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని భావించాం. దివంగత వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన తనయుడిగా మరోరెండు అడుగులు ముందుకేసి ఫీజుల పథకానికి మార్పులు చేయడంతో పాటు జగనన్న వసతి దీవెన అనే మరో గొప్ప పథకాన్ని తీసుకొచ్చాం. - మీ అన్న తోడుంటాడని మాటిస్తున్నా..
నంద్యాల గడ్డ వేదికగా రాష్ట్రవ్యాప్తంగా 10,68,150 మంది పిల్లల చదువుల కోసం 9,61,140 మంది తల్లుల ఖాతాల్లోకి 2021–22 జగనన్న వసతి దీవెన పథకం రెండో విడతగా రూ.1,024 కోట్లు జమ చేస్తున్నాం. పథకం ద్వారా ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌కు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు రూ.20 వేలను భోజనం, వసతి కోసం రెండు విడతల్లో ఇస్తామని చెప్పాం. ఆ ప్రకారం రెండోదఫా డబ్బులు జమ చేస్తున్నాం. కుటుంబంలో ఒకరికే పరిమితం చేసే రోజులు పోయాయి. మీ కుటుంబంలో అందరినీ చదివించండి. మీ అన్న జగన్ మీకు తోడుగా ఉంటాడని ప్రతీ తల్లికి మాట ఇస్తున్నా. - జవాబుదారీతనం పెంచేందుకు
జగనన్న విద్యా దీవెన ద్వారా ఫీజురీయింబర్స్‌మెంట్ డబ్బులను తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. వీటిని తల్లులు కాలేజీలకు చెల్లిస్తున్నారు. దీంతో వారు సదుపాయాలపై కాలేజీలను ప్రశ్నించవచ్చు. యాజమాన్యాలలో కూడా జవాబుదారీతనం పెరుగుతుంది. ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తెస్తే కాలేజీలపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నా. - మూడేళ్లలో సమూల మార్పులు
విద్యారంగంలో మూడేళ్లలో సమూల మార్పులు చేశాం. పేద కుటుంబంలో ప్రతీ బిడ్డ మంచి చదువులు చదవాలనే తాపత్రయంతో నాడు–నేడు ద్వారా విద్యావ్యవస్థ రూపురేఖలు మార్చాం. మంచి చదువు మాత్రమే సరిపోదు.. మంచి ఆహారం కూడా అందాలి. పిల్లలు ఏం తీసుకుంటే బాగుంటారు? ఎలాంటి నాణ్యమైన భోజనం అందించాలి? అని బహుశా గతంలో ఏ ముఖ్యమంత్రీ ఆలోచించి ఉండరు. గతంలో పాఠశాలల్లో ఫర్నిచర్, బ్లాక్ బోర్డులకూ కొరతే. వంట గదుల్లో అంతా అపరిశుభ్రత. ఆహ్లాదంగా కనిపించేలా గోడలకు రంగులు లేవు. ఎప్పుడు కూలిపోతాయో తెలియని గదుల్లో బోధించాల్సిన దుస్థితి. నాడు–నేడు ద్వారా ఈ దురవస్థను తొలగిస్తున్నాం. - సర్కారు స్కూళ్లకు మంచి రోజులు..
పిల్లలకు ఇంగ్లీషు మీడియంతో ఇబ్బంది లేకుండా మిర్రర్ ఇమేజ్‌తో ద్విభాషా పాఠ్య పుస్తకాలను తెచ్చాం. పక్కపక్కనే ఇంగ్లీషు, తెలుగు భాషల్లో పాఠాలను ముద్రించాం. నెమ్మదిగా ఇంగ్లీషు మీడియం వైపు నడిపించేలా ఇవి ఉపయోగపడతాయి. రానున్న 10 నుంచి 20 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని విద్యా విధానాన్ని మార్చుతున్నాం. పాఠశాలల నుంచి మొదలైన ఈ మార్పు ద్వారా కాలేజీల వైపు కూడా అడుగులు వేస్తున్నాం. - మెడికల్ కాలేజీలు.. స్కిల్ వర్సిటీలు
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ఈరోజు 16 కొత్త వైద్య కళాశాలలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. అందులో ఒకటి ఇదే నంద్యాలలో మీ కళ్లెదుటే ఏర్పాటు కానుంది. ఇక యువత నైపుణ్యాలను పెంపొందించేందుకు స్కిల్ డెవలప్‌మెంట్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. కొత్తగా నైపుణ్య విశ్వ విద్యాలయాలు వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కోర్సులను కాలేజీలకు, స్కిల్‌డెవలప్‌మెంట్‌కు అనుసంధానించాం. జాబ్ ఓరియెంటెడ్ కోర్సులను తెచ్చికాలేజీల్లో ఇంటర్న్‌షిప్ కచ్చితంగా అమలు చేస్తున్నాం. మరిన్ని ప్రత్యేక కోర్సులు కూడా తీసుకొస్తున్నాం. 67 ఒకేషనల్, 25 మార్కెట్ ఓరియెంటెడ్ కోర్సులు తీసుకొచ్చాం. డిగ్రీలో నాలుగేళ్ల ఆనర్స్ కోర్సు కూడా ప్రవేశపెట్టాం. - ఎక్కడా లేనివిధంగా అమ్మఒడి
బిడ్డలకు మంచి చదువు చెప్పించాలని ప్రతీ తల్లి ఆరాట పడుతుంది. పిల్లలను బడులకు పంపిస్తే చాలు 12 తరగతి వరకూ జగనన్న అమ్మ ఒడి ద్వారా అటెండెన్స్ ను జతపరిచి దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏటా రూ.15 వేలు చొప్పున అందిస్తున్నాం. 84 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి 44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేస్తున్నాం. అమ్మ ఒడి ద్వారా పేద బిడ్డలకు మేలు చేసే అవకాశాన్ని దేవుడిచ్చాడు. ఇంతకంటే సంతోషం ఇంకేముంటుంది? అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలిచేందుకు అమ్మఒడితోపాటు చాలా అడుగులు వేశాం. వైఎస్సార్ ఆసరా, చేయూతతో పాటు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. సున్నా వడ్డీ రుణాలిస్తున్నాం. ఆర్థిక సాధికారత కోసం రిలయ¯Œ్స, హిందుస్తాన్ లీవర్, అమూల్‌తోపాటు మల్టీ నేషనల్ కంపెనీలు, దిగ్గజాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. బ్యాంకులు రుణాలిచ్చేలా తోడ్పాటు అందిస్తున్నాం. అక్కచెల్లెమ్మలు బాగుంటే పిల్లలంతా బాగుంటారనే విశ్వాసంతో మూడేళ్లుగా మహిళా సాధికార ప్రభుత్వం అని చెప్పుకునేలా అడుగులు వేశాం. - సంపూర్ణ పోషణ.. గోరుముద్ద
పిల్లల చదువులపై ఎంత శ్రద్ధ తీసుకుంటున్నామో శారీరక, మానసిక ఎదుగుదల కోసం కూడా అంతే జాగ్రత్తలు తీసుకున్నాం. తల్లితో పాటు గర్భస్థ శిశువులకు మంచి ఆహారం అందాలనే లక్ష్యంతో వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని తెచ్చాం. గత సర్కారు ఇందుకోసం కనీసం రూ.600 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఇప్పుడు ఏటా రూ.1800 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఆ తర్వాత స్కూళ్లకు వచ్చే పిల్లల కోసం ‘వైఎస్సార్ గోరుముద్ద’ ప్రవేశపెట్టాం. దీనికి గత సర్కారు ఏటా రూ.500 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఇప్పుడు రూ.1,900 కోట్లు వ్యయం చేస్తున్నాం. ఎక్కడ 500 కోట్లు?.. ఎక్కడ 1900 కోట్లు? ఒక్కసారి గమనించాలని కోరుతున్నా. - విద్యా దీవెన, వసతి దీవెనకు రూ.పది వేల కోట్లు
2017–18, 2018–19కి సంబంధించి గత సర్కారు రూ.1,778 కోట్ల ఫీజు బకాయిలను ఎగ్గొడితే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెల్లించింది. జగనన్న విద్యాదీవెన కింద త్రైమాసికం ముగిసిన వెంటనే ఫీజులు ఇస్తున్నాం. టీడీపీ సర్కారు బకాయి పడ్డ రూ.1,778 కోట్లతో కలిపి రూ.6,969 కోట్లను జగనన్న విద్యాదీవెన ద్వారా చెల్లించాం. వసతి దీవెన కింద రూ.3,329 కోట్లు ఖర్చు చేశాం. కేవలం ఈ రెండు పథకాలకే 34 నెలల్లో మన ప్రభుత్వం రూ.10,298 కోట్లు ఖర్చు చేసింది. అక్కచెల్లెమ్మలు, వారి పిల్లల కోసం మేనమామగా చేస్తున్న ఖర్చు ఇది అని సంతోషంగా తెలియజేస్తున్నా.
చదవండి:
‘జగనన్న వసతి దీవెన’ పూర్తి వివరాలు ఇలా..
పరీక్ష వాయిదా.. కోత్త తేదీలు ఇవే..
జాతీయ సగటుకు మించి జీఈఆర్ పెరుగుదల
వివిధ పథకాల ద్వారా చదువుకునేలా ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో విద్యార్థుల డ్రాపౌట్లు గణనీయంగా తగ్గాయి. ఇంటర్ తర్వాత కాలేజీల్లో 18 – 23 ఏళ్ల వయసు విద్యార్థుల చేరికలకు సంబంధించి జీఈఆర్ (గ్రాస్ ఎన్ రోల్‌మెంట్ రేషియో) గత సర్కారు హయాంలో 2018–19 నాటికి 32.4 ఉంటే 2019–20లో ఒక్క ఏడాదిలోనే మనం తెచ్చిన మార్పులతో 35.2కి పెరిగింది. ఏడాదిలోనే జీఈఆర్ ఏకంగా 8.64 శాతం పెరిగింది. దేశవ్యాప్తంగా చూస్తే జాతీయ స్థాయిలో పెరుగుదల 3.04 శాతం కాగా మన రాష్ట్రంలో 8.64 శాతం పెరిగింది. మహారాష్ట్ర, పశ్చిమ బంగ, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోనూ ఐదు శాతం కంటే తక్కువే పెరుగుదల నమోదైంది. –1.6 శాతంతో తెలంగాణలో నెగెటివ్ వృద్ధి నమోదైంది. మన రాష్ట్రంలో విద్యార్థినులకు సంబంధించి జీఈఆర్ 11.03 శాతానికి పెరిగింది. అదే జాతీయ స్థాయిలో కేవలం 2.02 శాతం మాత్రమే పెరుగుదల ఉంది. విద్యారంగంలో మార్పులు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. గత సర్కారు హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు 37 లక్షల మంది కాగా ఇప్పుడు 44.30 లక్షలకు పెరిగారు. అంటే 7.18 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూళ్లను వీడి ప్రభుత్వ బడుల్లో చేరిన పరిస్థితి వచ్చింది. ఇంతకంటే మంచి మార్పు ఏముంటుంది?