KEA: పరీక్షలపై మరింత నిఘా
Sakshi Education
బనశంకరి: రాష్ట్రంలో ఏ పరీక్ష జరిగినా లీకేజీ, అక్రమాలు జరగడంతో ప్రభుత్వానికి తీవ్ర తలనొప్పిగా మారింది.
మీరే బాధ్యులు, అసమర్థులు అని ఆరోపణలను ఎదుర్కోవడం ఏ ప్రభుత్వమున్నా పరిపాటిగా మారడంతో ప్రభుత్వం పరీక్షల విధానంలో కఠిన చర్యలు చేపట్టింది.
కర్ణాటక పరీక్ష ప్రాధికార (కేఇఏ) నవంబర్ 18, 19 తేదీల్లో నిర్వహించే పరీక్షలకు కఠిన నిబంధనలను జారీచేసింది. నేరుగా వందలాది ఉద్యోగాల నియామకానికి పరీక్ష జరుగుతుండగా అభ్యర్దులు డ్రెస్‌కోడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. సమస్యాత్మక కేంద్రాల్లో ఇన్విజిలేటర్లే కాదు పోలీసులు సైతం తనిఖీలు చేస్తారు. పరీక్షాకేంద్రాల వద్ద మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేస్తారు. కాగా ఈ పరీక్షల హాల్‌టికెట్ డౌన్‌లోడ్ లింక్ విడుదల చేశారు.
- డ్రెస్‌కోడ్ ప్రకారం పరీక్షకు అభ్యర్థులు జేబు లేని, లేదా చిన్న జేబు కలిగిన ప్యాంట్ ధరించి రావాలి. ఈ నిబంధనలు యువతీ యువకులకు వర్తిస్తాయి.
- కుర్తా, పైజామా, జీన్స్ ప్యాంట్ ధరించి పరీక్ష హాల్‌కు రాకూడదు
- దుస్తులు ఎంబ్రాయిడరీ, జిప్ ప్యాకెట్లు, పెద్ద గుండీలను కలిగి ఉండరాదు
- అభ్యర్థులు షూ ధరించి హాజరు కారాదు
- మహిళా అభ్యర్థులు మంగళసూత్రం, కాలి మెట్టెలు తప్ప ఎలాంటి ఇతర బంగారు నగలను, అలంకారాలను ధరించరాదు
- తలపై టోపీ లేదా వస్త్రం ధరించరాదు, మాస్కు వేసుకోరాదు.
పోలీసులు, మెటల్ డిటెక్టర్లు
- అభ్యర్థుల తనిఖీ చకచకా జరిగేలా ప్రతి పరీక్షా కేంద్రంలో 25 విద్యార్థులకు ఒక పోలీస్‌ను నియమించాలని సర్కారు ఆదేశించింది. మెటల్ డిటెక్టర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అనుమతించాలి
- పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల ఎలాంటి కార్లు, బస్‌లు, వాహనాలను నిలపరాదు. పరిసరాల్లో హోటల్స్, ప్రైవేటు హాస్టళ్లు, ఇతర ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తులు ఉంటే విచారించాలి
- పరీక్షా కేంద్రాల్లో అక్రమాలు జరిగితే ఆ పరిధిలోని ఎస్పీ లేదా పోలీస్ కమిషనర్‌ను బాధ్యుల్ని చేస్తారు.
ఇవి నిషేధం
- ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్‌పోన్, పెన్‌డ్రైవ్, ఇయర్ ఫోన్, మైక్రో ఫోన్, చేతి గడియారం తదితరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
- పెన్సిల్, పేపరు, రబ్బర్, జామెట్రి బాక్సు, లాగ్ టేబుల్‌ను అంగీకరించరు.
- రెండు పాస్‌పోర్టు సైజు ఫోటోలను తీసుకెళ్లాలి. ప్రభుత్వం అందించిన ఫోటో గుర్తింపు కార్డును కూడా తీసుకెళ్లాలి.
- పరీక్ష చివరి బెల్ కొట్టే వరకు అభ్యర్థులను బయటికి వెళ్లనీయరు.
Published date : 15 Nov 2023 03:55PM