8.78 లక్షల ర్యాంకుకూ ఎంబీబీఎస్ సీటు
8,78,280 నీట్ ర్యాంకు వచ్చిన విద్యార్థికి సైతం స్వరాష్ట్రంలోనే ఎంబీబీఎస్ సీటు దక్కేలా చేసి, రాష్ట్ర వైద్య విద్య చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొనేలా చేసింది. 2021–22 వైద్య విద్యా సంవత్సరంలో మైనార్టీ మెడికల్ కాలేజీలు కలుపుకొని బీ కేటగిరీలో 1,214 సీట్లు ఉండేవి. రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఇందులో 495 సీట్లు మాత్రమే లోకల్ విద్యార్థులకు దక్కాయి. గరిష్టంగా 2,71,272 ర్యాంకు వచ్చిన తెలంగాణ లోకల్ విద్యార్థికి అడ్మిషన్ దొరికింది. మిగతా 719 సీట్లలో నాన్ లోకల్ కింద ఇతర రాష్ట్రాల విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఇలా రాష్ట్ర విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఈసారి బీ కేటగిరీ సీట్లలో 85 శాతం లోకల్ రిజర్వేషన్‌ను తీసుకువచ్చింది. దీంతో స్థానిక విద్యార్థులకు వైద్య విద్యనభ్యసించే అవకాశాలు మరింత పెరిగాయి. ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి సైతం ఎంబీబీఎస్ సీటు వచ్చింది. 2022–23 విద్యా సంవత్సరంలో బీ కేటగిరీలో మొత్తం 1,267 సీట్లు ఉన్నాయి. ఇందులో నూతన స్థానిక రిజర్వేషన్ విధానం వల్ల రాష్ట్ర విద్యార్థులకు 1,071 సీట్లు రిజర్వ్ అయ్యాయి. దీంతో ఈసారి 8,78,280 ర్యాంకు వచ్చిన తెలంగాణ లోకల్ విద్యార్థికి కూడా సీటు వచ్చినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది.
చదవండి: NMC: విద్యార్థులకు డీఆర్‌పీ తప్పనిసరి
కన్వీనర్ కోటాలోనూ పెరిగిన అవకాశాలు
రాష్ట్రంలో 2022లో 8 కొత్త మెడికల్ కాలేజీలు రావడంతో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆలిండియా కోటా మినహాయించుకొని కేటగిరీ ఏ (కన్వీనర్) కోటాలో 2021–22లో 3,038 సీట్లు ఉండగా, 2022లో ఆ సంఖ్య 4,094కు పెరిగింది. దీంతో ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏ, బీసీ బీ, బీసీ డీ, బీసీ ఈ కేటగిరీల్లో కటాఫ్ తగ్గి ఎక్కువ మందికి సీట్లు దక్కాయి. ఎస్టీ రిజర్వేషన్ కోటాను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడంతో ఆ కేటగిరీలో మరింత మంది వైద్య విద్యను అభ్యసించే అవకాశం కలిగింది. గరిష్టంగా 10,55,181 ర్యాంకు వచ్చిన అభ్యర్థికి సైతం సీటు వచ్చింది.
చదవండి: 89 Jobs: వైద్య పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ
విద్యార్థినులదే పైచేయి..
ఎంబీబీఎస్‌లో ఎక్కువగా విద్యార్థినులే సీట్లు పొందుతున్నారు. 2021–22లో మొత్తం 5,095 సీట్లలో 60.79 శాతం సీట్లు విద్యార్థినులే పొందారు. కన్వీనర్ కోటాలో 63.36 శాతం, మేనేజ్‌మెంట్ కోటాలో 55.76 శాతం సీట్లు విద్యార్థినులకు దక్కా యి. ఈ ఏడాది కూడా కన్వీనర్ కోటాలో 62.68 శాతం, మేనేజ్‌మెంట్ కోటాలో 63.73 శాతం సీట్లు విద్యార్థినులు సాధించారు. మొత్తం 6,186 సీట్లలో 62.98 శాతం సీట్లు విద్యార్థులు పొందారు.
చదవండి: 1,147 Jobs: పోస్టులకు నోటిఫికేషన్
42 కాలేజీలు..6,690 సీట్లు
రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య 42కు పెరిగింది. ఎంబీబీఎస్ సీట్లు 6,690కు పెరిగాయి. 8 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో కొత్తగా 1,150 ఎంబీబీఎస్ సీట్లు రాగా, బి– కేటగిరీలో 85 శాతం లోకల్ రిజర్వేషన్, 6 శాతం నుంచి 10 శాతానికి పెరిగిన ఎస్టీ రిజర్వేషన్ వల్ల మార్కుల కటాఫ్ భారీగా తగ్గింది. రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, దేశంలోని మిగతా ఏ రాష్ట్రంలో ఇన్ని సీట్లు లేకపోవడం గమనార్హమని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇక పీజీ సీట్ల విషయంలో దేశంలోనే తెలంగాణ టాప్ 2వ స్థానంలో ఉండటం గమనార్హమని, రాష్ట్రంలో మొత్తం 2,544 పీజీ సీట్లు ఉన్నాయని వివరించారు.