Skip to main content

Jagananna Vidya Deevena: తల్లి ఖాతా కాదు.. కాలేజీ ఖాతాలో జమచేయాలి: హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జగనన్న విద్యాదీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని నేరుగా విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలోనే జమచేసేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం గత ఏడాది జూన్ లో జారీచేసిన జీవో 28ని హైకోర్టు రద్దుచేసింది.
Jagananna Vidya Deevena
తల్లి ఖాతా కాదు.. కాలేజీ ఖాతాలో జమచేయాలి: హైకోర్టు

అదేవిధంగా జగనన్న విద్యాదీవెన కింద ప్రభుత్వం చెల్లించిన ఫీజును విద్యార్థి తల్లి కాలేజీకి చెల్లించకపోతే ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత ఉండదంటూ 2020 నవంబర్‌ 6న జారీచేసిన జీవో 64లో పేర్కొన్న క్లాజులన్నింటినీ కొట్టేసింది. ఇకపై జగనన్న విద్యాదీవెన పథకం కింద స్కాలర్‌షిప్పులను, ఫీజులను ఆయా కాలేజీల ఖాతాలకే జమచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే తల్లుల ఖాతాల్లో జమచేసిన డబ్బు విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదని, ఈ మొత్తాలను ఆయా విద్యార్థుల నుంచి కాలేజీలే వసూలు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. జీవోలు 28, 64లను సవాలు చేస్తూ అనంతపురం జిల్లాకు చెందిన శ్రీకృష్ణదేవరాయ ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు ఎస్‌.హెచ్‌.ఆర్‌.ప్రసాద్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ విజయలక్ష్మి విచారణ జరిపారు.

 

స్వీయ అవసరాలకు వాడుకునే పరిస్థితులున్నాయి 
పిటిషనర్‌ న్యాయవాది మోతుకుమిల్లి విజయకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ఫీజులను, స్కాలర్‌షిప్పులను విద్యార్థి తల్లి ఖాతాలో జమచేయడం వల్ల కాలేజీలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. గ్రామీణ విద్యార్థుల తల్లులు నిరక్షరాస్యులుగా ఉంటున్నారని, వారి ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో విద్యార్థి చదువుకోసం ప్రభుత్వం జమచేస్తున్న ఫీజుల డబ్బును స్వీయ అవసరాల నిమిత్తం మళ్లించాల్సిన పరిస్థితులు ఉంటున్నాయని చెప్పారు. దీంతో ప్రభుత్వం చెల్లించిన ఫీజు మొత్తం కాలేజీలకు చేరడంలేదని, తల్లి ఫీజు చెల్లించకపోతే తమకు సంబంధం లేదని ప్రభుత్వం జీవో కూడా జారీచేసిందని పేర్కొన్నారు. దీంతో జగనన్న విద్యాదీవెన పథకం తీసుకొచ్చిన సదుద్దేశం నెరవేరకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది తల్లులు ప్రభుత్వం చెల్లించిన ఫీజులను తిరిగి కాలేజీలకు చెల్లించడం లేదో పేర్కొంటూ జిల్లాల వారీగా వివరాలను ఆయన కోర్టు ముందుంచారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందుతోందా? లేదా? కాలేజీలో అన్ని సౌకర్యాలు ఉన్నాయా? తదితరాలను పరిశీలించే నిమిత్తమే తల్లి ఖాతాలో డబ్బు జమచేయడం వెనుకున్న ప్రధాన ఉద్దేశమని చెప్పారు. మహిళా సాధికారతలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

కాలేజీ ఖాతాలో డబ్బు వేస్తే చదువు ఆపేసే అవకాశాలు స్వల్పం 
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ విజయలక్ష్మి.. దాదాపు 40 శాతంమంది విద్యార్థులు ప్రవేశాల సమయంలో ఫీజులు చెల్లించలేదని, ప్రభుత్వ జీవో ప్రకారం ఫీజుల కోసం వారిని కాలేజీలు ఒత్తిడి చేయడానికి వీల్లేదని, తల్లులు ఫీజు చెల్లించకపోతే ప్రభుత్వానిది బాధ్యత కాదని గుర్తుచేశారు. ఈ పరిస్థితుల వల్ల విద్యార్థి బలవంతంగా చదువు ఆపేయాల్సి వస్తోందని, అంతిమంగా ఓ సీటు వృథా అవుతోందని తెలిపారు. కాలేజీల ఖాతాల్లో డబ్బు జమచేస్తే విద్యార్థి చదువు ఆపేసే పరిస్థితులు చాలా స్వల్పమని చెప్పారు. ఒకవేళ ఆ కాలేజీలో సౌకర్యాలు సరిగా లేకపోతే విద్యార్థి తల్లిదండ్రులు దానిపై ఫిర్యాదుచేసే అవకాశం ఉంటుందన్నారు. తల్లి ఖాతాలో ఫీజు జమచేయడం వల్ల చదువు కొనసాగింపునకు హామీ లభించడంలేదని చెప్పారు. ఇది జగనన్న విద్యాదీవెన పథకం లక్ష్యానికి విరుద్ధమన్నారు. అందువల్ల ప్రభుత్వ ఉత్తర్వులను రద్దుచేస్తున్నట్లు జస్టిస్‌ విజయలక్ష్మి తన తీర్పులో పేర్కొన్నారు.

Published date : 04 Sep 2021 01:24PM

Photo Stories