Jagananna Videshi Vidya Deevena: విద్యార్థులకు ‘విదేశీ’ వరం!
పథకానికి పరిమితులు లేకుండా శాచ్యురేషన్ విధానంలో అర్హులందరికీ ప్రయోజనం చేకూరుస్తున్నట్లు చెప్పారు. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద అర్హులైన 357 మందికి రూ.45.53 కోట్లను ముఖ్యమంత్రి జగన్ జూలై 27న తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్ ఏమన్నారంటే..
చదవండి: Jagananna Vidya Kanuka: నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి..
వీసా నుంచి విమాన చార్జీల దాకా..
మంచి కాలేజీలో సీటు వచ్చినా అంత డబ్బులు కట్టే స్ధోమత లేని రాష్ట్ర విద్యార్ధులకు విదేశాల్లో చదువులకు ఒక వరంలా జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం అన్ని రకాలుగా తోడ్పాటునిస్తుంది. ఒక భరోసా కల్పిస్తుంది. ఈ పథకాన్ని అత్యంత పారదర్శకంగా ఎక్కడా వివక్ష, లంచాలు లేకుండా అమలు చేస్తున్నాం. క్యూఎస్ లేదా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిల్చిన టాప్ 50 విద్యాసంస్ధల్లో సీటు సాధించిన వారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు.
శాచ్యురేషన్ పద్ధతిలో ఎంతమంది దరఖాస్తు పెట్టుకున్నా అర్హత ఉంటే సపోర్టు అందిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు, ఇతరులకైతే రూ.కోటి వరకు చెల్లిస్తున్నాం. విదేశీ విశ్వ విద్యాలయాలకు వెళ్లే పిల్లలను విమాన చార్జీలు, వీసా చార్జీల దగ్గర నుంచి ప్రతి అడుగులోనూ చేయి పట్టుకుని నడిపిస్తున్నాం.
చదవండి: Jaganna Videshi Vidya Deevena : ఏపీ విద్యార్థుల కోసం మరో సంచలన పథకం.. ఉండాల్సిన అర్హతలు ఇవే..
పది ఉత్తమ విద్యాసంస్థల్లో ఫీజులిలా..
ఈ టాప్ 50 కాలేజీల్లో చదవాలంటే ఫీజులు ఎలా ఉన్నాయి? సీటు వచ్చినా సామాన్యుడు, పేదవాడు చదువుకునే పరిస్థితి ఉందా? అన్నది ఒక్కసారి గమనిస్తే.. చికాగో యూనివర్సిటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ రూ.1.32 కోట్లు, యూనివర్సిటీ ఆఫ్ మాంఛెస్టర్‌లో ఎంఎస్ రూ.1.02 కోట్లు, కార్నిగీ మిలన్ యూనివర్సిటీలో టెపర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ రూ.1.16 కోట్లు, లండన్ బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ రూ.1.13 కోట్లు, కొలంబియా యూనివర్సిటీలో ఎంఎస్ రూ.1.11 కోట్లు, న్యూయార్క్ యూనివర్సిటీలో ఎంఎస్ రూ.1.09 కోట్లు, ఇన్సీడ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఫ్రాన్స్‌లో ఎంబీఏ రూ.88 లక్షలు, హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో ఏంబీఏ రూ.68.86 లక్షలు, ఎంఐటీలో స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో రూ.67 లక్షలు, యూసీ బర్క్‌లీలో ఎంఎస్ రూ.61 లక్షల నుంచి రూ.2.06 కోట్ల వరకూ ఫీజులున్నాయి. ఉదాహరణగా పది మంచి విద్యాసంస్ధలు గురించి చెప్పాను.
ప్రపంచాన్ని శాసించే లీడర్లు కావాలని..
ఇలాంటి ప్రపంచ ప్రఖ్యాత కాలేజీలలో మన పిల్లలకు ఎవరికైనా సీట్లు వచ్చినా సామాన్యులు, పేదరికం కారణంగా అంత ఫీజులు కట్టి చదవడం సాధ్యమేనా? అన్నది మొట్టమొదట ఈ పథకం గురించి ఆలోచించినప్పుడు నాకు తట్టిన ఆలోచన. ఇలాంటి కాలేజీలలో మన పిల్లలు చదివి బయటకు వస్తేనే రేపొద్దున ప్రపంచాన్ని శాసించే విధంగా టాప్ మోస్ట్ కంపెనీలలో సీఈవోలుగా రాణించే స్థాయికి చేరుకుంటారు. పెద్ద స్ధాయిలోకి వెళ్లే అవకాశం వస్తుంది. అందుకే అలాంటి కాలేజీలలో సీట్లు సాధించిన మన పిల్లలను సపోర్టు చేయాలని నిర్ణయించుకున్నాం. అలా చేయకపోతే ఏ రకంగా మన పిల్లలను, మన రాష్ట్రాన్ని లీడర్లుగా చూడగలుగుతాం అన్నది ఈ ఆలోచనలకు ప్రేరణ.
నాడు.. ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా
గత ప్రభుత్వంలో పరిస్థితి చూస్తే కేవలం రూ.10 లక్షలు.. ఎస్సీ ఎస్టీలకు అయితే రూ.15 లక్షలు మాత్రమే ఇచ్చేవారు. ఈ అమౌంట్ ఎక్కడ? మనమిస్తున్న రూ.1.02 కోట్లు, రూ.1.16 కోట్లు, రూ.1.09 కోట్లు, రూ.87 లక్షలు, రూ.70 లక్షలు, రూ.1.32 కోట్లు ఫీజు ఎక్కడ? గతంలో ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఇచ్చారు. అక్కడ కూడా ప్రతిదానిలో కోత పెట్టేవారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ దొరికేది కాదు. శాచ్యురేషన్ విధానం లేదు. సిఫార్సులతో ఇచ్చేవారు. అది కూడా సక్రమంగా ఇవ్వకుండా 2016–17 నుంచి దాదాపు రూ.318 కోట్లు బకాయిలు పెట్టి ఈ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు.
నేడు అర్హులందరికీ..
ఈరోజు పథకంలో పూర్తి మార్పులు తీసుకొచ్చి శాచ్యురేషన్ విధానంలో అమలు చేస్తున్నాం. అర్హత కలిగి ఉండి టాప్ 50 కాలేజీలు, 21 ఫ్యాకల్టీలలో దాదాపు 320 కాలేజీల్లో సీట్లు ఎవరికి వచ్చినా వర్తింప చేస్తున్నాం. గతంలో ఆదాయ పరిమితి రూ.6 లక్షలు ఉంటే ఇప్పుడు రూ.8 లక్షల వరకూ పెంచాం. అర్హత ఉంటే చాలు.. రూపాయి లంచం లేకుండా, వివక్షకు తావు ఇవ్వకుండా, పార్టీలతో సంబంధం లేకుండా అత్యంత పారదర్శకంగా మన పిల్లలకు తోడుగా ఉండేలా అడుగులు వేస్తున్నాం.
ఏకైక రాష్ట్రం ఏపీ
ఇదో విప్లవాత్మకమైన అడుగు. రాబోయే రోజుల్లో భావితరాలు ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని గుర్తుంచుకునేలా ఇంత సపోర్టు చేస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. టాప్ 50 కాలేజీలు, 21 ఫ్యాకల్టీలలో దాదాపు 320 కాలేజీలలో ఎవరికి సీటు వచ్చినా పారదర్శకంగా సపోర్టు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఇదొక విప్లవాత్మకమైన అడుగుగా చరిత్రలో మిగిలిపోతుంది. ఈ పిల్లలు గొప్పగా ఎదిగి పెద్ద కంపెనీల్లో సీఈవోలుగా, ఉన్నత స్థాయిలో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
నాలుగు విడతలుగా స్కాలర్‌షిప్..
ఈ స్కాలర్‌షిప్ పథకాన్ని నాలుగు విడతలుగా అమలు చేస్తున్నాం. ఇమ్మిగ్రేషన్ కార్డు పొందిన విద్యార్ధులకు వెంటనే తొలివిడత ఇస్తాం. ఫస్ట్ సెమిస్టర్ ఫలితాల అనంతరం రెండో విడత, రెండో సెమిస్టర్ టెర్మ్ ఫలితాలు విడుదలైనప్పుడు మూడో విడత, విజయవంతంగా నాలుగో సెమిస్టర్ పూర్తి చేసి మార్క్స్ షీటు అప్‌లోడ్ చేయగానే చివరి విడతను విద్యార్థులకు అందించేలా పథకాన్ని డిజైన్ చేశాం. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ పిల్లలందరికీ ఈ టాప్–50 కాలేజీలలో, 21 ఫ్యాకల్టీలలో ఎక్కడ సీటు వచ్చినా దరఖాస్తు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తుంది. తోడుగా ఉంటామని భరోసా ఇస్తున్నా.
మన రాష్ట్ర ఖ్యాతిని పెంచాలి
మన పిల్లలకు అంతా మంచి జరగాలి. తల్లిదండ్రుల మీద ఎటువంటి భారం పడకూడదు. అప్పుల పాలవుతామనే భయం లేకుండా పిల్లలను గొప్ప చదువులకు పంపించాలి. పిల్లలకు కూడా తమ తల్లిదండ్రులు అప్పులు చేసి పంపారనే బాధ ఎక్కడా ఉండకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించాం. పిల్లలు అక్కడకు (విదేశాలకు) వెళ్లి గొప్పగా చదివి మన రాష్ట్ర ఖ్యాతిని ఇంకా పెంచాలన్న మంచి సంకల్పంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నా.
హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు..
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పీడిక రాజన్నదొర, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, బీసీ సంక్షేమశాఖ స్పెషల్ సీఎస్ జి.అనంతరాము, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బి.జయలక్ష్మి, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావు, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఇంతియాజ్, సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ కె.విజయ, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ జె.వెంకటమురళి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.