TRSMA, NISA: చదవడం కూడా కష్టమే.. రాసే నైపుణ్యాలు పడిపోయాయి
తల్లిభాషలోనూ తల్లడిల్లిపోతున్నారు. ఇలాంటి విస్మయం కలిగించే నిజాలెన్నో నేషనల్ ఇండిపెండెన్స్ స్కూల్స్ అలయెన్స్ (నిసా), తెలంగాణ రిజిస్టర్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ట్రాస్మా) సర్వేలో వెల్లడయ్యాయి. కరోనా తర్వాత క్లాస్‌లకు హాజరవుతున్న 44.6 శాతం విద్యార్థులకు చదవడం కష్టంగా ఉందని, 32.8 శాతం మందిలో ఆత్మవిశ్వాసం లోపించిందని నిసా, ట్రాస్మా సర్వేలో వెలుగుచూశాయి. ఆన్ లైన్ విధానంలో నష్టపోయిన విద్యను నేర్చుకునేందుకు 45.1 శాతం మంది తిరిగి ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని కోరుతున్నట్టు తేలింది. సర్వే నివేదికను ట్రాస్మా డిసెంబర్ ౨౧న వెల్లడించింది. కరోనాకాలంలో నెలకొన్న విద్యారంగం నష్టంపై ఈ రెండుసంస్థలు కలసి దేశవ్యాప్తంగా ఇటీవల సర్వే జరిపాయి. అన్నిప్రాంతాల విద్యార్థులు, సంస్థల ప్రతినిధులను కలిశారు. 3–5 తరగతులు, 8వ తరగతి విద్యార్థుల నుంచి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. సెల్ఫ్ అసెస్‌మెంట్ పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలో పట్టణప్రాంతాల్లో 30 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 24 శాతం మంది మాతృభాషలో ఇబ్బంది పడుతున్నట్టు తేలింది. 3వ తరగతిలో 28 శాతం, 5వ తరగతిలో 25 శాతం, 8వ తరగతిలో 2 శాతం మందిలో ఈ సమస్య ఉన్నట్టు గుర్తించారు. ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో 14 శాతం చదవడం, 17 శాతం రాయడంలో వెనుకబడి ఉన్నట్టు తేలింది.
పట్టుతప్పిన చదువు..
- ఆంగ్లభాషలో విద్యార్థుల ప్రమాణాలు 35 శాతం మేర పడిపోయాయి. 3వ తరగతి విద్యార్థులు ఒకటో తరగతి నైపుణ్యాల స్థాయికి తగ్గిపోయారు. పట్టణాల్లో ఆంగ్ల భాషలో చదివే నైపుణ్యం కొరవడింది. 40% మంది 5వ తరగతి విద్యార్థులు ఇంగ్లిష్‌లో అర్థం చేసుకోలేనిస్థితిలో ఉన్నారు. ఐదో తరగతి పట్టణ విద్యార్థులు ఇంగ్లిష్ చదవడంలో ఇబ్బంది పడుతున్నారు.
- 44 శాతం విద్యార్థులు గణితంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. 42 శాతం 5వ తరగతి విద్యార్థులు గణితంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. గణితంలో ప్రతి ముగ్గురు విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు.
- ఆన్ లైన్ బోధనలో 83.9 శాతం మంది యూట్యూబ్, దూరదర్శన్, టీ–శాట్‌కు ప్రాధాన్యమిచ్చారు. 12 శాతం మందికి ఇంటర్నెట్ లేకపోవడం వల్ల క్లాసులు వినలేకపోయారు. ఆన్ లైన్ బోధనపై గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత కన్పించింది. 44.6 శాతం విద్యార్థులు ప్రస్తుత పరిస్థితుల్లో తరగతిగదుల్లో చదవడం కష్టంగా ఉందని చెబుతున్నారు.
- కరోనా వల్ల 32.8 శాతం మంది ఆత్మవిశ్వాసంతో చదువు కొనసాగించడంలేదు.