TSCHE: డిగ్రీ చదివినా తక్షణ ఉపాధి!
పారిశ్రామిక అవసరాలే గీటురాయిగా డిగ్రీలో నైపుణ్యాన్ని మేళవిస్తున్నారు. మూడేళ్ళ స్థానంలో నాలుగేళ్ళ ఆనర్స్ కోర్సులు వస్తున్నాయి. డిగ్రీ చేసినా ఉపాధి ఖాయమనే భరోసా కల్పిస్తున్నాయి. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఆనర్స్ డిగ్రీ కోర్సులను నాలుగేళ్ళతో పరిమితంగా ప్రవేశపెట్టారు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఈ విధంగా ప్రవేశపెడుతున్న అనేక మార్పుల పురోగతిని కేంద్ర విద్యాశాఖ ఇటీవల సమీక్షించింది. మరోవైపు కాంబినేషన్ కోర్సులు, తక్షణ ఉపాధి అవకాశాలున్న స్కిల్ అనుసంధాన కోర్సులకు డిమాండ్ పెరుగుతోందని యూజీసీ తన నివేదికలో పేర్కొంది. ఇక మీదట సాధారణ డిగ్రీ కోర్సుల స్థానంలో సాంకేతికత తోడైన డిగ్రీ కోర్సులు ప్రాచుర్యం పొందుతాయని తెలిపింది.
చదవండి: First Attempt Success: ఎస్ఐ కొలువును సాధించిన యువతి
కంప్యూటర్స్, డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర కోర్సుల మేళవింపుతో కొత్త డిగ్రీ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఆర్ట్స్‌తో కంప్యూటర్ పరిజ్ఞానం, సైన్స్‌తో సామాజిక అవగాహన కోర్సులు కలగలిపి రాబోతున్నాయి. జాతీయ విద్యావిధానం–2020లో భాగంగా ఈ తరహా బోధన ప్రణాళికను యూజీసీ ఇప్పటికే సిద్ధం చేసింది. దీనికి అనుగుణంగానే దేశవ్యాప్తంగా ఒకే పద్ధతిలో క్రెడిట్స్ విధానం అమలులోకి రాబోతోంది. యూజీసీ కొత్త ప్రణాళికలను అన్ని రాష్ట్రాలూ ఆమోదించాయి.
క్రెడిట్ విధానం బెస్ట్
డిగ్రీ పట్టాలు ఇక క్రెడిట్స్ ఆధారంగా ఉండనున్నాయి. ఒక్కో స్థాయికి కొన్ని క్రెడిట్స్ ఉంటాయి. విద్యార్థులు మూడేళ్లలో 120 క్రెడిట్లు పూర్తి చేస్తేనే అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) డిగ్రీకి అర్హులవుతారు. అదే విద్యార్థి నాలుగేళ్లలో 160 క్రెడిట్ల ను పూర్తి చేస్తేనే యూజీ ఆనర్స్ డిగ్రీ పట్టా లభిస్తుంది. అలా గే ఆనర్స్ డిగ్రీ కోర్సుల్లో చేరేవారు రీసెర్చ్ కోసం వెళ్లాలనుకుంటే తమ నాలుగేళ్ల కోర్సులోనే రీసెర్చ్ ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉంటుంది.
ఇక ప్రస్తుతం మూడేళ్ల డిగ్రీ కోర్సులు చే స్తున్నవారు కూడా నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులకు మారేందుకు కొత్త కరిక్యులం ఫ్రేమ్ వర్క్ అవకా శం కల్పిస్తుంది. ఇప్పటికే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) ప్రకారం మూడేళ్ల యూజీ కోర్సుల్లో పేర్లు నమోదు చేసు కు న్న, అభ్యసిస్తున్న విద్యార్థులు కూడా నా లుగేళ్ల యూజీ ఆనర్స్ కొనసాగించడానికి అర్హులని కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు.
చదవండి: Collector Appreciation: పోటీల్లో గెలిచిన విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసలు
ఆనర్స్ వైపు ఆకర్షణ
తెలంగాణ సహా దేశంలోని అన్ని రాష్ట్రాలూ మూడేళ్ళ డిగ్రీ కోర్సుల స్థానంలో నాలుగేళ్ళ ఆనర్స్ కోర్సులకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను యూజీసీ రూపొందించింది. తెలంగాణలో నాలుగేళ్ళ బీఎస్సీ (ఆనర్స్) కంప్యూటర్స్‌ను 50కి పైగా కాలేజీల్లో అందుబాటులోకి తెచ్చారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి అతి ముఖ్యమైన అంశాలు ఆనర్స్‌లో చోటు చేసుకోబోతున్నాయి. దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఈ కామర్స్ రాజ్యమేలుతోంది. దీంతో కామర్స్ డిగ్రీ నేపథ్యం ఉన్న వారికి మంచి డిమాండ్ వచ్చింది. కంప్యూటర్స్ పరిజ్ఞానంతో కూడిన అనలిస్టులు, అక్కౌంటెంట్లకు మంచి వేతనాలతో కూడిన ఉపాధి లభిస్తోంది. ఈ కారణంగా డిగ్రీ కోర్సుల్లో కామర్స్‌ను ఎంచుకునే వారి సంఖ్య 36 శాతం నుంచి 41 శాతానికి పెరిగింది.
బీకాం కోర్సులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. బీకాం జనరల్‌తో పాటు, కంప్యూటర్స్, టాక్సేషన్, ఆనర్స్, బిజినెస్ అనలిటిక్స్ వంటి కొత్త స్పెషలైజేషన్‌ను తీసుకొచ్చారు. ఇక బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ)లో చేరికలు కూడా ఆరేళ్లల్లోనే ఏడు రెట్లు పెరిగాయి. బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ)లో ప్రవేశాలు 9 రెట్లు పెరిగాయి.
కొన్నేళ్లుగా డిగ్రీలో ప్రవేశాలు ఇలా..
సంవత్సరం |
డిగ్రీలో చేరిన వారు |
2017–18 |
2,00,806 |
2018–19 |
2,33,946 |
2019–20 |
2,15,467 |
2020–21 |
2,47,601 |
2021–22 |
2,55,132 |
2022–23 |
2,12,818 |
నైపుణ్యం వెలికితీసేలా మూల్యాంకనం
విద్యార్థిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసే మూల్యాంకన విధానం అందుబాటులోకి రాబోతోంది. దీనిపై ఇప్పటికే అధ్యయనం పూర్తయింది. డిగ్రీ కోర్సులు ఇక మీదట పూర్తి నైపుణ్యంతో అందించాలని, అంతర్జాతీయ ప్రమాణాలతో ముందుకు తీసుకెళ్ళాలని భావిస్తున్నాం. ఇప్పటికే ఈ ప్రయోగం మొదలైంది. భవిష్యత్‌లో దీని వేగం పెరుగుతుంది. ఇక మీదట డిగ్రీ కోర్సు చేసినా మంచి ఉపాధి పొందుతారనే విశ్వాసం విద్యార్థుల్లో వస్తుంది.
– ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్)