Medical Seats: మెడికల్ పీజీ ‘బ్లాక్’ దందాపై.. గవర్నర్ సీరియస్
ఈ అంశంపై తక్షణమే నివేదిక ఇవ్వాలని కాళోజీ వర్సిటీ వీసీని ఆదేశించారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం ఏప్రిల్ 21న ఒక ప్రకటన జారీ చేసింది. అర్హులైన ప్రతిభ కలిగిన ర్యాంకు విద్యార్థులకు సీటు నిరాకరించే పరిస్థితి రావడంపై గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. దిద్దుబాటు చర్యలను ప్రారంభించాలని వీసీని ఆదేశించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా మెడికల్ సీట్ల బ్లాకింగ్ వ్యవహారంపై దృష్టి సారించారు. కుంభకోణానికి పాల్పడినట్టుగా భావిస్తున్న పలు మెడికల్ కాలేజీల వివరాలను సేకరిస్తున్నారు. ఎన్ ఆర్‌ఐ సీట్లుగా మారిన బీ కేటగిరీ సీట్లపై దృష్టి పెట్టి.. వారికి దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా సీటు వచ్చిందా? ఎక్కడైనా చేరారా? అక్కడ చేరి ఇక్కడకు ఎందుకు వచ్చారు? వంటి వివరాలు సేకరిస్తున్నారు. కాగా, కాలేజీల యాజమాన్యాలు పోలీసులు, విచారణ అధికారులకు సహకరించడం లేదని తెలుస్తోంది.
బయట పడేందుకు యాజమాన్యాల యత్నాలు
ఇప్పటివరకు ఏడెనిమిది కాలేజీలు ఈ దందా నిర్వహించినట్లు సమాచారం. కాగా రాజకీయ అండదండలున్న కొన్ని కాలేజీలు.. దీన్నుంచి బయటపడే ప్రయత్నాలు ప్రారంభించాయి. ప్రలోభాలకు గురైన విద్యార్థుల పేర్లు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాయి. వారి సరి్టఫికెట్లు కాలేజీల్లో లేకుండా చర్యలు తీసుకుంటున్నాయి. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే మరోవైపు ఒక్కో సీటుకు రూ. కోటి వరకు వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం.