Skip to main content

Scholarship: విద్యార్థులకు ఆర్థిక భరోసా

ఆసిఫాబాద్‌అర్బన్‌: పాఠశాల స్థాయిలో డ్రాపౌట్స్‌ ను తగ్గించేందుకు ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తూ ఆర్థిక భరోసాను కల్పిస్తోంది.
Scholarship
విద్యార్థులకు ఆర్థిక భరోసా

 నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి నాలుగేళ్లపాటు రూ.12వేల చొప్పున ఉపకార వేతనాలు అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌(ఎన్‌ఎంఎంఎస్‌) అందిస్తూ అండగా నిలుస్తోంది. 2023– 24 విద్యాసంవత్సరానికి సంబంధించి డిసెంబర్‌ 10న ఎన్‌ఎంఎంఎస్‌ అర్హత పరీక్ష నిర్వహించనున్నారు.

అక్టోబ‌ర్ 31 వరకు దరఖాస్తులకు గడువు ఉంది. అర్హులు సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఎంపికైన విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ పూర్తయ్యే వరకు ఏడాదికి రూ.12వేల చొప్పున అందించనున్నారు.

చదవండి: NMMS Scholarships: కేంద్ర ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు భరోసా.. ఏడాదికి రూ.12వేల స్కాలర్‌షిప్‌

ఎనిమిదో తరగతి వారు అర్హులు

ఎన్‌ఎంఎంఎస్‌ అర్హత రాత పరీక్ష కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2023– 24 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ, ఎయిడెడ్‌ తదితర పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఎన్‌ఎంఎంఎస్‌ ఉపకార వేతనాలకు అర్హులు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న గురుకులాలు, సైనిక్‌ స్కూళ్లు, ప్రైవేటు పాఠశాలలకు చెందిన వారు ఈ పథకానికి అనర్హులు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.50 లక్షలలోపు ఉండాలి. ఏడో తరగతిలో జనరల్‌, బీసీ విద్యార్థులు అయితే 55 శాతం, ఎస్సీ, ఎస్టీ వారు 50శాతం మార్కులు సాధించి ఉండాలి. జనరల్‌, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీలు రూ.50ల పరీక్ష ఫీజు చెల్లించాలి. మరిన్ని వివరాలకు https://bse. telang ana.gov.in ను సందర్శించవచ్చు.

జిల్లాలో రెండు కేంద్రాలు..!

డిసెంబర్‌ 10న నిర్వహించే రాత పరీక్ష కోసం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ పట్టణాల్లో రెండు కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఈ అర్హత పరీక్ష రెండు విభాగాలుగా ఉంటుంది.

ఒకటి మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌, మరొక్కటి అప్టిట్యూడ్‌ టెస్ట్‌. 90 మార్కుల చొప్పున 180 మార్కులకు పరీక్ష ఉంటుంది. కనీస అర్హత మార్కులు 40 శాతంగా నిర్ణయించగా, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 32 శాతం మార్కులు కటాఫ్‌గా ఉంటుంది. అర్హుల ఎంపిక సమయంలో రిజర్వేషన్లు పాటిస్తారు. అయితే విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు నింపే సమయంలో జాగ్రత్తలు పాటిస్తూ, పాఠశాల రికార్డుల్లో నమోదైన వివరాలతో సరిపోల్చుకోవాలి. అలాగే దివ్యాంగులు అయితే సంబంధిత ధ్రువీకరణ పత్రం కూడా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

Published date : 16 Oct 2023 01:53PM

Photo Stories