Employment Courses: ‘ఉపాధి’ కోర్సులపై దృష్టి పెట్టాలి
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, సామాజిక శాస్త్ర విభాగం, తెలంగాణ ఉన్నత విద్యామండలి, ఐసీఎస్‌ఎస్‌ఆర్–దక్షిణ భారతదేశ ప్రాంతీయ కేంద్రం ఆధ్వర్యంలో ‘భారతదేశంలో ఉన్నత విద్య– సమస్యలు, నాణ్యత–సమగ్రత–సవాళ్లు’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ఆదివారం ప్రారంభమైంది.
ముఖ్యఅతిథిగా హాజరైన లింబాద్రి మాట్లాడుతూ దేశంలో ఉన్నత విద్యను అభ్యసించే వారి సంఖ్య 28.4 శాతం కాగా.. తెలంగాణలో ఇది 40 శాతంగా నమోదవడం శుభపరిణామమన్నారు. అలాగే జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో ఉన్నత విద్యను అభ్యసించే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు, మహిళల నమోదు శాతం కూడా బాగా పెరిగిందన్నారు. ఇందులో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పాత్ర కీలకమని వివరించారు.
చదవండి: Latest Central Govt Jobs 2024: టెన్త్, ఇంటర్‌తోనే కేంద్ర కొలువు.. రాత పరీక్ష ఇలా..
వర్సిటీలు నైపుణ్యంతో కూడిన, ఉపాధి అందించే కోర్సులను ప్రవేశపెట్టేలా చర్యలు చేపట్టాలని, తద్వారా ఉన్నత విద్యను అభ్యసించే వారి సంఖ్యను మరింత పెంచడానికి ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి, న్యాక్ మాజీ డైరెక్టర్ ప్రొ.వి.ఎస్.ప్రసాద్ మాట్లాడుతూ, దూర విద్యలో విస్తృత ప్రయోజనాలు, దూర విద్యా వ్యాప్తికి అపారమైన అవకాశాలు ఉన్నప్పటికీ ఉన్నత విద్య వ్యాప్తి ఆ దిశగా సాగడం ఆవేదన వ్యక్తం చేశారు.
కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె.సీతారామారావు అధ్యక్షత వహించారు. గౌరవ అతిథులుగా విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొ.ఘంటా చక్రపాణి పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో పలు విభాగాల అధిపతులు, డీన్లు, అన్ని విభాగాల అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.