Teachers Day: విద్యార్థి పురోగతే గీటురాయి: విద్యాశాఖ మంత్రి
ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. కరోనా కష్టకాలంలోనూ ఆన్ లైన్ లో చదువులు చెప్పిన ఉపాధ్యాయుల సేవలను మరువలేమని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో భావితరాలను తీర్చిదిద్దేందుకు ప్రతీ అధ్యాపకుడు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్‌సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో సెప్టెంబర్5న గురుపూజ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్యాంక్‌బండ్‌వద్ద సర్వేపల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులరి్పంచారు. అనంతరం రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 111 మంది అధ్యాపకులకు అవార్డులు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సమాజంలో గురువు స్థానం అత్యంత కీలకమైందన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ను ప్రతీ వ్యక్తి ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఏ దేశమైనా, రాష్ట్రమైనా పురోభివృద్ధికి మూలం విద్యారంగమే అనేది సీఎం కేసీఆర్‌దృక్పథమని, అది ఉపాధ్యాయుల వల్లే సాధ్యమని పేర్కొన్నారు.
కరోనా కాలంలోనూ మీ కష్టం మరువలేనిది
గడచిన 17 నెలలుగా కరోనా వల్ల అన్ని రంగాలతో పాటు విద్యారంగం కూడా అతలాకుతలమైందని మంత్రి సబిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో కూడా అధ్యాపకులు విద్యారంగాన్ని పరోక్షంగానైనా ముందుకు తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నం అభినందనీయమన్నారు. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా దూరదర్శన్, యూట్యూబ్, టీశాట్‌ద్వారా విద్యనందించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో కృషి చేశారని, వారి సేవలు మరువలేనివని కొనియాడారు.
తండాలకు వెళ్లి చదువు..
కరోనా విలయతాండవం చేస్తున్నా.. మారుమూల తండాల్లో సైతం పిల్లలకు విద్యను అందించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారని మంత్రి సబిత అన్నారు. టీవీలు కూడా లేని బస్తీల్లోని పిల్లలకు గోడమీదనే అక్షర జ్ఞానం కలిగించిన టీచర్లు, ఇంటింటికి వెళ్లి బోధన చేసిన అధ్యాపకులకు సబిత ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కరోనా వల్ల పిల్లలు మానసికంగా దెబ్బతిన్నారని, చదువులు మరచిపోయారని తెలిపారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు అధ్యాపకులు మున్ముందు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం..
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం దిశగా ప్రభుత్వం అడుగులేస్తోందని, ఎస్సీ, ఎస్టీ, మైనారీ్టల కోసం ఏర్పాటు చేసిన గురుకులాలు విజయవంతంగా నడుస్తున్నాయని, ప్రతీ ప్రభుత్వ పాఠశాలను కూ డా ఈ స్థాయికి తేవాలన్నది తమ లక్ష్యమని మంత్రి సబిత తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లల్లోనూ ప్రైవేటు స్కూళ్ల మాదిరి స్కూల్‌డే నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు తీసిపోని విధంగా ప్రభుత్వ స్కూళ్లల్లోనూ మౌలిక సదుపాయాలు కలి్పంచేందుకు ప్రభుత్వం రూ.4 వేల కోట్లు మంజూరు చేసిందని మంత్రి వెల్లడించారు. విద్యారంగానికి కేటాయింపులను ప్రభు త్వం ఖర్చుగా భావించడం లేదని, భావితరాల మీద పెట్టుబడిగానే చూస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది 2.5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని, ఇందులో 1.3 లక్షల మంది ప్రైవేటు స్కూళ్ల నుంచే రావడం, ప్రభుత్వ స్కూళ్లపై పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమన్నారు.
గురువులదే కీలక బాధ్యత
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గురువులదే కీలక బాధ్యతని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ప్రభుత్వం వచ్చాక విద్యారంగానికి పెద్దపీట వేసిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కె.జనార్దన్ రెడ్డి, కె.రఘోత్తమ్‌రెడ్డి, నర్సిరెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌సుల్తానియా, కమిషనర్లు నవీన్ మిట్టల్, ఒమర్‌జలీల్, దేవసేన, కార్పొరేటర్‌విజయరెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో జిల్లా స్థాయి వేడుకలేవి?
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌జిల్లా స్థాయి వేడుకలు నిర్వహించకపోవడంపై ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించినా.. జిల్లా విద్యా శాఖ మాత్రం నిద్రావస్థలో జోగుతుందని తెలంగాణ స్టేట్‌టీచర్స్‌యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్‌అబ్దుల్లా విమర్శించారు.