చదువులకు రాజకీయ చెద
గత ప్రభుత్వ హయాంలో ‘మన బడి నాడు – నేడు’ కింద నిర్మించిన ఈ ప్రహరీని కూలగొట్టి స్థలాన్ని ఆక్రమించారు. కూటమి సర్కారు కొలువుదీరిన కొద్ది రోజులకే విశాఖలోని కప్పరాడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను బురదలో కూర్చోబెట్టి భోజనాలు చేసే దుస్థితికి తీసుకొచ్చారు. బురదగా ఉందని.. గదుల్లో కాకపోయినా కనీసం వరండాలో అయినా తింటామని విద్యార్థులు వేడుకున్నా సిబ్బంది కనికరించలేదు. కర్నూలు జిల్లా సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాలలో భోజనం సరిగా లేదని, పుచ్చిపోయిన కూరగాయలు, పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు.
ఇటీవల అనంతపురం జిల్లా ధర్మవరంలో బడిలో ఏ పని చేయాలన్నా తమకు చెప్పకుండా జరిగితే సహించేది లేదని ఉపాధ్యాయులను స్థానిక టీడీపీ నాయకులు బెదిరించారు. ఇలా ఒకటీ రెండూ కాదు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నెల రోజుల్లోనే ప్రాథమిక పాఠశాలల నుంచి యూనివర్సిటీల దాకా విద్యారంగంపై అధికార పార్టీ నేతలు జులుం ప్రదర్శిస్తున్నారు. మధ్యాహ్న భోజనం వంట వారి నుంచి వీసీల దాకా బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు.
అధికారం మాది.. పెత్తనమూ మాదే..
గత ఐదేళ్ల పాటు రాజకీయాలకు తావులేకుండా ఉన్నతంగా ఉన్న విద్యావ్యవస్థ తిరోగమనం బాట పట్టింది. ‘రాష్ట్రంలో మేం చెప్పిందే జరగాలి. అది బడైనా, యూనివర్సిటీ అయినా సరే.. !’ అని టీడీపీ, జనసేన నేతలు పెత్తనం కోసం ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ముందు వరకు పాఠశాల భవనంలో ఫ్యాన్ల కింద ఆత్మ విశ్వాసంతో మధ్యాహ్న భోజనాలు చేసిన విద్యార్థులు ఇప్పుడు బురదలో కూర్చొని తినాల్సిన పరిస్థితులు కల్పించారు.
ప్రకాశం జిల్లా దర్శి మండలం బండి వెలిగండ్ల పాఠశాలలో గత 15 ఏళ్లుగా వంట చేస్తున్న మహిళను వైఎస్సార్‌సీపీ అభిమాని అనే నెపంతో స్థానిక టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చి తొలగించారు. దీంతో ఈనెల ఒకటో తేదీన విద్యార్థులు పస్తులుండాల్సి వచ్చింది. టాయిలెట్లు శుభ్రం చేసే కార్మికులను సైతం తొలగించి తమ వారినే నియమించాలని పట్టుబట్టిన దాఖలాలు అనేకం ఉన్నాయి. ఉన్నవారు వెళ్లిపోగా కొత్తవారు ముందుకు రాకపోవడంతో నాడు–నేడు ద్వారా తీర్చి దిద్దిన మరుగుదొడ్లు దారుణంగా కనిపిస్తున్నాయి.
చట్ట వ్యతిరేకంగా వీసీలు, రిజిస్ట్రార్ల తొలగింపు
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్థానిక కూటమి నాయకులు తమ పరిధిలో విద్యా వ్యవస్థ, ఉపాధ్యాయులపై దాడులు చేస్తుంటే రాష్ట్ర స్థాయిలో టీడీపీ పెద్దలు వీసీలు, రిజిస్ట్రార్లు, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్లపై పడ్డారు. రాజ్యాంగ బద్ధమైన వర్సిటీలను రాజకీయ విష క్రీడకు బలి చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో నియమితులైన వీసీలు, రిజిస్ట్రార్లకు ఫోన్లు చేసి బెదిరించి బలవంతంగా రాజీనామాలు చేయించారు. మానవ వనరుల శాఖ మంత్రి కార్యాలయం నుంచే ఈ ఫోన్లు వెళ్లడం గమనార్హం. దీంతో విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కె.బాబ్జీ రాజీనామా చేశారు.
2026 ఫిబ్రవరి వరకూ ఆయన పదవీకాలం ఉన్నప్పటికీ వైద్య శాఖ ఉన్నతాధికారి ఒకరు ఫోన్ చేసి రాజీనామా చేయాలని ఆదేశించడంతో వైదొలిగారు. కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ బి.సుధీర్ ప్రేమ్ కుమార్‌ను సైతం ఉన్నత విద్యా మండలి ఇన్‌చార్జి చైర్మన్, డిప్యూటీ సెక్రటరీ ఫోన్ చేసి వెళ్లిపోవాలని ఆదేశించడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. కడపలోని డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ తొలి వీసీ ఆచార్య బానోతు ఆంజనేయప్రసాద్ కూడా తన పదవీకాలం పూర్తవకుండానే ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో రాజీనామా సమర్పించారు.
వైఎస్సార్ జిల్లాలోని యోగి వేమన వర్సిటీ (వైవీయూ) వీసీ ఆచార్య చింతా సుధాకర్, రిజిస్ట్రార్ ఆచార్య వై.పి.వెంకట సుబ్బయ్య, ఏఎఫ్‌యూ రిజిస్ట్రార్ ఆచార్య ఇ.సి.సురేంద్రనాథ్‌రెడ్డితోనూ బలవంతంగా రాజీనామాలు చేయించారు. పద్మావతి మహిళా వర్సిటీ వీసీ డి.భారతి పదవీ కాలం మరో రెండేళ్లు ఉన్నప్పటికీ బలవంతంగా రాజీనామా చేయించారు. జేఎన్‌టీయూ–కాకినాడ వీసీ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజుకు మరో నాలుగు నెలలు పదవీకాలం ఉన్నా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ పి.రాజశేఖర్, రెక్టార్ ప్రొఫెసర్ పి.వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్ ఆచార్య బి.కరుణ, కో–ఆర్డినేటర్లు, డైరెక్టర్లను సైతం ఒత్తిడి చేసి పదవులకు రాజీనామా చేయించారు.
ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పి.వి.జి.డి.ప్రసాదరెడ్డితో పాటు రిజిస్ట్రార్ల చాంబర్లను కూటమి నాయకులు ముట్టడించి మరీ భయపెట్టి రాజీనామా చేయించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం డైరెక్టర్ ప్రొఫెసర్ కొక్కిరాల వెంకట గోపాల ధన బాలాజీకి విద్యాశాఖ మంత్రి కార్యాలయం నుంచి బెదిరింపులు రావడంతో జూలై 7న రాజీనామా సమర్పించారు. మరో రెండున్నరేళ్ల పదవీ కాలం ఉన్నా తప్పుకునే పరిస్థితి కల్పించారు.