Telangana: ఉన్నత విద్యకు దూరం
కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, పెంచికల్‌పేట్, సిర్పూర్ (టి) మండలాల్లోని ఆర్థికంగా వెనుకబడి ఉన్న కు టుంబాల పిల్లలకు ఉన్నత విద్య అందని ద్రాక్షలా మారింది. డిగ్రీ చదవాలంటే విద్యార్థులు 60 కిలో మీటర్ల దూరంలోని కాగజ్‌నగర్, 100 కిలోమీటర్ల దూరంలోని ఆసిఫాబాద్‌కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఐదు మండలాల్లో ఏటా 1000 మందికి పై గా విద్యార్థులు ఇంటర్ పూర్తిచేస్తున్నారు.
చదవండి: DEO Ashok: విద్యార్థుల్లో పరిశీలన శక్తి పెంపొందించాలి
కౌటాలలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాల ఉన్నా ఫీజులు నిరుపేదలకు భారంగా మారాయి. కౌటాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే కౌటాల, బెజ్జూర్, చింతలమానెపల్లి, పెంచికల్‌పేట్, సిర్పూర్(టి) మండలా ల్లోని ఎంతోమంది నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుందని నవంబర్ 10న ‘సాక్షి’ నిర్వహించిన ప్రజాఎజెండాలో కౌటాల ప్ర భుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు తెలిపారు.
డిగ్రీ కళాశాల ఏర్పాటుతో మేలు
ప్రస్తుతం కౌటాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నా. స్థానికంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లలేక ఇంట్లోనే ఉండాల్సి రావొచ్చు. కౌటాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే నిరుపేద విద్యార్థులకు మేలు జరుగుతుంది.
– టి.స్వాతి
పార్ట్‌టైం ఉద్యోగాలు
కౌటాలలో డిగ్రీ కళాశాల లేక చాలామంది గ్రామీణ విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్లి పార్ట్‌టైం ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుంటున్నారు. ఇంటర్ తర్వాత ఏం చేయాలో అర్థం కావడం లేదు. దీంతో చాలా మంది ఇంటి వద్దే ఉంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేయాలి.
– ఎ.ప్రకాశ్
తల్లిదండ్రులకు ఆర్థికభారం
గ్రామీణ ప్రాంత విద్యార్థులు పట్టణాలకు వెళ్లకుండా కౌటాల మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే ఐదు మండలాల విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుంది. దూరప్రాంతాల్లో చదివించడం తల్లిదండ్రులకు ఆర్థికంగా భారం అవుతుంది. డిగ్రీ కళాశాల ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలి.
– జె.మీనాక్షి