Kakatiya University: మహిళా ప్రొఫెసర్లపై వివక్ష
అక్టోబర్ 6న రిజిస్ట్రార్ శ్రీనివాస్ రావును కలిసి అధ్యాపకుల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఇస్తారి మాట్లాడుతూ.. హెడ్, చైర్మన్ బోర్డు ఆఫ్ స్టడీస్, డీన్లు, ప్రిన్సిపాల్ పదవులు సీనియారిటీ ప్రకారం కాకుండా వీసీ, రిజిస్ట్రార్ తమ ఇష్టానుసారంగా నియమిస్తూ పలువురు అధ్యాపకులను అవమానపరుస్తున్నారని పేర్కొన్నారు.
బాటనీ విభా గంలో ఉన్న రెగ్యులర్ అధ్యాపకురాలిని విభాగ అధిపతిగా నియమించకపోవడంతో సదరు అధ్యాపకురాలు హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని, యూనివర్సిటీ సమస్యలను కోర్టులో తేల్చుకొనే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని అన్నారు. సోషియాలజీ విభాగం అధిపతిగా, చైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్‌గా ఎక్కువకాలం ఇద్దరు ఆచార్యులనే కొనసాగిస్తూ పదవీ కాలం పూర్తయినా కూడా మరొక ప్రొఫెసర్‌కు హెడ్ లేదా బీఓఎస్. చైర్మన్ ఇవ్వకపోవడం దారుణమని అన్నారు.
చదవండి: PHD Admissions: పీహెచ్‌డీ అడ్మిషన్లలో అవకతవకలు!
భౌతిక శాస్త్ర విభాగంలో మే నెలలో మరొక అధ్యాపకురాలికి రావాల్సిన హెడ్ షిప్‌ను ఇప్పటివరకు ఇవ్వకపోవడం నిర్లక్ష్యానికి, కక్షపూరిత వైఖరికి నిదర్శనమని అన్నారు. గణిత విభాగంలో ఆ విభాగ అధిపతి పదవీ సెప్టెంబర్‌లో పూర్తి అయినప్పటికీ ఇప్పటికీ రొటేషన్ పద్దతిలో మరొక అధ్యాపకడికి హెడ్ షిప్ ఇవ్వకపోవడానికి కారణాలు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఫార్మసీలో డీన్ ఆచార్య నర్సింహారెడ్డి పదవీకాలం ముగిసి ఆరు నెలలు గడిచినా.. ఇప్పటి వరకు తర్వాతి సీనియర్ అయిన ప్రొఫెసర్ గాదె సమ్మయ్యను డీన్‌గా నియమించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. తాజాగా తెలుగు విభాగంలోని మహిళా అధ్యాపకురాలిని బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా నియమించాల్సి ఉండగా.. ఓ కాంట్రాక్టు లెక్చరర్‌ను నియమించి రెగ్యులర్ మహిళా అధ్యాపకురాలిపై వివక్ష చూపిన అధికారుల వైఖరిని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆ విభాగంలో పనిచేస్తున్న మహిళా అధ్యాపకురాలిని సంప్రదించకుండానే చైర్మన్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ పదవి ఇవ్వడానికి ఎందుకు నిరాకరించారని ప్రశ్నించారు.