Prof. G Haragopal: వర్సిటీలపై వివక్ష తగదు
ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాలను ఆర్ధికంగా ఆదుకోకపోగా జీత భత్యాలకు అవసరమైన సొమ్మును కూడా విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నాయన్నారు. జనవరి 29న డా.బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, సామాజిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘భారతదేశంలో ఉన్నత విద్య: నాణ్యమైన విద్య, సమస్యలు, సవాళ్లు’ అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన కీలకోపన్యాసం చేశారు. ప్రస్తుత సమాజంలో మతం శక్తి వనరుగా మారి తాజాగా విద్యారంగంలోకి కూడా పాకిందన్నారు.
చదవండి: ASP Success Story : తినడానికి సరైన తిండి లేక.. యూనివర్సిటీలో చేరా.. కానీ అక్కడ..
డా.బీ.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తుందన్నారు. నేర్చుకునే క్రమంలోనే ప్రశ్నించే తత్వం అలవడాలని తద్వారా జ్ఞానం వస్తుందన్నారు. వర్సిటీ వీసీ ఆచార్య.కె.సీతారామారావు మాట్లాడుతూ దేశంలో అన్ని ఉన్నత విద్యా సంస్థలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, ఆయా సంస్థలను పర్యవేక్షించే రెగ్యులేటరీ బాడీలు తీసుకునే అనాలోచిత నిర్ణయాలు, అప్పటికప్పుడు మార్చుకునే నిర్ణయాలతో విద్యా సంస్థలకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
గౌరవ అతిథిగా పాల్గొన్న విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొ.ఘంటా చక్రపాణి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో జరిగే పరిశోధనలు సమాజాభివృద్ధికి దోహదం చేస్తాయని, పరిశోధనల్లో నాణ్యత పెరగాలని సూచించారు. జనవరి 31న పదవీ విరమణ చేయనున్న చక్రపాణిని ఈ సందర్భంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆచార్య హన్మంత రావు, ఆచార్య ఆర్.వి. రమణమూర్తి, ఆచార్య వై.పార్థసారధి, ఆచార్య జి నాగరాజు, ఆచార్య చెన్న బసవయ్య తదితరులు పాల్గొన్నారు.