Bar Council of India: పీయూలో లా డిపార్ట్‌మెంట్
ఉమ్మడి జిల్లాలో లా చదవాలనుకునే వాళ్లు హైదరాబాద్, వరంగల్, కర్నూలు తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో అడ్మిషన్లు పొందేవారు. అయితే త్వరలోనే మహబూబ్‌నగర్ జిల్లాలోనే లా చదువుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు యూనివర్సిటీలో లా డిపార్ట్‌మెంట్ ఏర్పాటు చేసేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అప్లియేషన్ పొందేందుకు డిసెంబర్ 12న ఆన్‌లైన్ తనిఖీలు జరిగాయి. వీలైనంత త్వరలో అనుమతులు వస్తే పీయూ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమం కానున్నట్లు పీయూ అధికారులు చెబుతున్నారు.
చదవండి: Kapu Vinuthnna: ‘NLU’ ప్రవేశ పరీక్షల్లో ‘వినూత్న’ ప్రతిభ
వీడియో కాల్ ద్వారా..
పీయూలో లా డిపార్ట్‌మెంట్ ఏర్పాటు కోసం డిసెంబర్ 12న బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆన్‌లైన్ అప్లియేషన్ తనిఖీలు జరిగాయి. వీడియో కాల్ ద్వారా పీయూ ముఖద్వారం నుంచి ఎగ్జామినేషన్, అడ్మినిస్ట్రేషన్, లా డిపార్ట్‌మెంట్ విభాగం వంటి వాటిని కౌన్సిల్ సభ్యులు వీక్షించారు.
ఆన్‌లైన్‌లో వారు అడిగిన ప్రశ్నలకు పీయూ లా డిపార్ట్‌మెంట్ డీన్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, లా డిపార్ట్‌మెంట్ బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్ రాంప్రసాద్, పీయూ వీసీ ఓఎస్డీ మధుసూదన్‌రెడ్డి సమాధానాలు చెప్పారు.
ఇందులో పీయూ ఎప్పుడు ఏర్పాటైంది.. అందులో ఉన్న సదుపాయాలు.. సీసీ కెమెరాలు.. విద్యార్థులకు కల్పిస్తున్న వసతులపై ఆరాతీశారు. దీంతో వీలైనంత త్వరగా డిపార్ట్‌మెంట్ ఏర్పాటుకు అనుమతి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే నిజమైతే పీయూ ఏర్పడిన తర్వాత ఒక కీలక ఘట్టంగా లా కళాశాల ఏర్పాటును చెప్పుకోవచ్చు.
శుభపరిణామం..
పీయూలో లా డిపార్ట్‌మెంట్ ఏర్పాటు ఒక శుభపరిణామంగా భావిస్తున్నాం. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కూడా లా కళాశాల లేకపోవడంతో చాలామంది లా కళాశాల ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్నారు. డిపార్ట్‌మెంట్ ఏర్పాటు అప్లియేషన్ తనిఖీలు జరిగాయి. పీయూలో లా, ఇంజినీరింగ్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ల ఏర్పాటు కోసం గతంలోనే ప్రతిపాదనలు పంపాం. డిపార్ట్‌మెంట్ ఏర్పాటు కానున్న నేపథ్యంలో మరోసారి లా కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిస్తాం. దీని ద్వారా పాలమూరులో లా విద్య అందుబాటులోకి రానుంది.
– లక్ష్మీకాంత్‌రాథోడ్, వీసీ,పాలమూరు యూనివర్సిటీ