Govt Schools: ప్రభుత్వ పాఠశాలల్లో కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి ఆకస్మిక తనిఖీ.. ఉత్తీర్ణత శాతాన్ని పెంపొందించాలి
యలమంచిలి: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేలా బోధన సామర్థ్యాలు పెంపొందించాలని కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి తెలిపారు. మండలంలోని రేగుపాలెం, పులపర్తి ఉన్నత పాఠశాలలను జులై 20 గురువారం ఉదయం ఆయన ఆకస్మిక తనిఖీ చేపట్టారు. రేగుపాలెం పాఠశాలలో విద్యార్థుల నోట్ పుస్తకాలను, వారి రాసిన పరీక్ష పత్రాలను పరిశీలించారు. విద్యార్థులకు కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. 3, 4, 5 తరగతులకు తెలుగు, గణితం (టెర్ల్), 6, 7, 8 తరగతులకు (లిప్) లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్‌పై నిర్వహించిన పరీక్షల్లో ఏ విద్యార్థి ఎన్ని మార్కులు సాధించాడని ఆరా తీశారు. వాటికి సంబంధించిన రికార్డులను ఉపాధ్యాయులను అడిగి తనిఖీ చేశారు. విద్యార్థిలో గ్రోత్‌ను బట్టి అర్థమయ్యే రీతిలో బోధన చేపట్టాలన్నారు. ఇక్కడ నాడు –నేడు నిధులతో నిర్మిస్తున్న అదనపు గదులను మరుగుదొడ్లను కాంపౌండ్ వాల్ పనులను పరిశీలించారు. అనంతరం భవనాల నిర్మాణం వేగవంతం చేయాలని ఎంఈవో, హెచ్‌ఎంలను ఆదేశించారు. పాఠశాల ఆవరణలో అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడ చిన్నారులు ఎందుకు తక్కువగా ఉన్నారని ప్రశ్నించారు. వీరితోపాటు బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారా? బాలబాలికలకు ఏ విధంగా బోధన సాగిస్తున్నారని ఆరా తీశారు. ప్రణాళికాబద్ధంగా పిల్లలకు బోధన చేయాలని, కిశోర బాలల సర్వే ఏ విధంగా నిర్వర్తిస్తున్నారని అంగన్‌వాడీ కార్యకర్తను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు. విద్యార్థులకు విటమిన్, నులిపురుగుల మాత్రలు పంపిణీ చేస్తున్నారా లేదా అని ఏఎన్‌ఎంను ప్రశ్నించారు. పులపర్తి పాఠశాలలో విద్యార్థుల హాజరు పట్టికను, వారి నోటు పుస్తకాలను తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంపొందించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అప్పలనాయుడు, ఎంఈవోలు మీనాక్షి, అరుణ్‌కుమార్, ఏపీఎం రాణి, రేగుపాలెం, పులపర్తి పాఠశాల ఉపాధ్యాయులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.