Raavi Shastri's centenary: హిందీ, ఇంగ్లిష్ లో రావిశాస్త్రి రచనలు
తెలుగు భాష, కవిత్వం, సాహిత్యాన్ని పరిరక్షించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ కోరారు. ఆదివారం విశాఖలో రసజ్ఞ వేదిక ఆధ్వర్యంలో జరిగిన రాచకొండ విశ్వనాథశా్రస్తి(రావిశాస్త్రి) శత జయంతి వేడుకలకు సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ ముఖ్య అతిథిగా హాజరై కీలకోపన్యాసం చేశారు. రావిశాస్త్రి గొప్ప రచయితే కాకుండా మానవతావాది, మేధావి, న్యాయవాది అని కొనియాడారు. తెలుగు భాషలో రచనలు చేయడంతోపాటు మాండలీకాలను నిలబెట్టారన్నారు. ఉత్తరాంధ్ర మాండలీకంలో కవిత్వంతో తెలుగు భాష సుసంపన్నమైందని చెప్పారు. తెలుగును వాడుక భాషగా సరళతరం చేసిన గురజాడ, గిడుగు ఒరవడిని కొనసాగించారన్నారు. రావిశాస్త్రి పేదల పక్షాన వాదించిన మానవతా ధృక్పథం కలిగిన న్యాయవాది అని పేర్కొన్నారు. తన వద్దకు న్యాయంకోసం వచ్చేవారి ఆవేదనలు, సమస్యలను ఆలకించి మంచి కథల రూపంలో సమాజానికి తెలియజేశారన్నారు. తెలుగు సాహిత్యంలో న్యాయ వ్యవస్థలు, న్యాయమూర్తులు, న్యాయవాదుల గురించి రావిశా్రస్తిలా విశ్లేషించిన వారెవరూ లేరన్నారు. బీఎస్సీ చదివేటప్పుడు ఒక సభలో రావిశా్రస్తిని కలిశానని గుర్తుచేసుకున్నారు. గురజాడ, శ్రీశ్రీ, రావిశాస్త్రి లాంటి మహనీయుల నుంచి ప్రేరణ పొందినట్లు చెప్పారు. వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోతే అరాచకం వస్తుందని రావిశాస్త్రి పేర్కొనడాన్ని గుర్తించాలన్నారు.
also read: National Achievement Survey: తొలిమెట్టుతో పట్టు
రావిశాస్త్రి సూక్తులతో బోర్డులు..
‘కారులో వస్తుంటే నా ఫొటోలు, హోర్డింగులే కనిపించడం ఆవేదన కలిగించింది. విశాఖలో నా ఫొటోలకు బదులు రావిశాస్త్రి హోర్డింగులు, సూక్తులు, కవిత్వంలోని ముఖ్యాంశాలు పెట్టాల్సింది. విశాఖ లాంటి ప్రాంతాల్లో రావిశాస్త్రి సూక్తులను శాశ్వతంగా కోర్టుల వద్ద బోర్డుల రూపంలో ప్రదర్శిస్తే సమాజానికి మేలు జరుగుతుంది. రావిశాస్త్రి ఆరు సారా కథల్లో న్యాయవ్యవస్థ గురించి ఎంతో బాగా వివరించారు. వాటిని వందల సంఖ్యలో ముద్రించి తెలుగు న్యాయవాదులు, న్యాయమూర్తులకు పంచిపెట్టా’అని సీజేఐ చెప్పారు.
Also read: Engineering Education పల్లెకు దూరం.. హైదరాబాద్ చేరుతున్న విద్యార్థులు
సమాజాన్నే ఎక్కువగా చదివా..
రావిశాస్త్రి మద్రాస్ లా కాలేజీలో చదువుకున్నప్పుడు న్యాయవాద విద్య కంటే సమాజాన్నే ఎక్కువగా చదివానని చెప్పారని, అది తనకూ వర్తిస్తుందని సీజేఐ రమణ తెలిపారు. పుస్తకాలు చదివింది తక్కువే అయినా ప్రజాసమస్యలపై అవగాహనతో జీవితంలో ఆటుపోట్లను తట్టుకొని ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. పిల్లలతో తెలుగు మాట్లాడించాలని, వారితో తెలుగు పుస్తకాలను చదివిస్తూ మాతృభాషను ప్రోత్సహించాలని ఆయన సూచించారు. కాగా, అణగారిన వర్గాల వాణిని వినిపించిన రచయిత, న్యాయవాదిగా రావిశాస్త్రి చిరస్థాయిగా నిలుస్తారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు చెప్పారు. సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణను ఈ సందర్భంగా నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. తొలుత రావిశాస్త్రి సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ రచయిత్రి ఓల్గాకు జస్టిస్ ఎన్‌వీ రమణ అందజేశారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శేషసాయి, జస్టిస్ మానవేంద్రరాయ్, విశాఖ రసజ్ఞ వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జి.రఘురామారావు, ఉపాధ్యక్షుడు డాక్టర్ పెదవీర్రాజు, కార్యదర్శి ప్రయాగ సుబ్రహ్మణ్యం, రావిశాస్త్రి కుమారుడు ఉమాకుమార్‌శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
Also read: FRC: ఇంజనీరింగ్ ఫీజుల పెంపునకు ఆమోదముద్ర వేసిన ఎఫ్‌ఆర్‌సీ