పిల్లలు 7 గంటలకే స్కూల్కు వెళ్తుంటే... మేం తొమ్మిదింటికి కోర్టుకు రాలేమా?
జూలై 15న జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్రభట్, జస్టిస్ సుధాంశు ధూలియాలతో కూడిన ధర్మాసనం ఉదయం 9.30 గంటలకే కోర్టు ప్రొసీడింగ్స్ ప్రారంభించింది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రొసీడింగ్స్ 9.30 గంటలకే ప్రారంభం కావడాన్ని సీనియర్ న్యాయవాది ముకుల్ రొహత్గి ప్రశంసించగా జస్టిస్ లలిత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘పిల్లలు ఉదయం 7 గంటలకు స్కూల్‌కి వెళ్లగలిగినప్పుడు, 9 గంటలకు మనం ఎందుకు రాలేమని నేనెప్పుడూ అంటుంటాను. కోర్టుల్లో కార్యకలాపాలు ఉదయం 9.30 గంటలకు మొదలైతే మరీ మంచిది‘ అని ఆయన అన్నారు. ‘కోర్టులు ముందుగా మొదలైతే, విధులను కూడా తొందరగానే ముగించొచ్చు. తర్వాతి రోజు కేసుల అధ్యయనానికి సాయంత్రం ఎక్కువ సమయం ఉంటుంది’ అన్నారు. ఆగస్ట్ చివరికి ఈ ఏర్పాట్లు మొదలవుతాయని భావిస్తున్నానని రొహత్గి పేర్కొనగా, ఇవి కొన్ని మాత్రమేనని జస్టిస్ లలిత్ చెప్పారు. సుప్రీంకోర్టుల్లో విచారణలు సాధారణంగా ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు జరుగుతుంటాయి. ఆగస్ట్ 26వ తేదీన రిటైర్ కానున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్థానంలో జస్టిస్ లలిత్ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది.
చదవండి:
- Supreme Court: ‘బెయిల్ చట్టం’ తీసుకురండి - కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
- High Court: ఐదుగురు న్యాయమూర్తులకు చీఫ్ జస్టిస్‌లుగా పదోన్నతి