Skip to main content

Amrita Patwardhan: పిల్లలకు ఇవే నేస్తాలు!

పిల్లలు... కల్లాకపటం ఎరగని దివ్వెలు. ఏది మంచో ఏది చెడో తల్లిదండ్రులు, టీచర్లు నేర్పించేది సరిపోదు. ‘సాహిత్యం చదివితేనే వారు మంచి పౌరులు అవుతారు’ అంటున్నారు అమృతా పట్వర్థన్. టాటా ట్రస్ట్ సంస్థల విద్యా విభాగానికి అధిపతిగా ఉన్న అమృత పిల్లలకు మంచి సాహిత్యాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్నెం పున్నెం ఎరుగని బాలలు అనవసరపు విద్వేషాల బారిన పడుతున్న ఈ రోజుల్లో అమృత అంటున్న మాటలు విలువైనవి.
Books are friends for children
పిల్లలకు పుస్తకాలే నేస్తాలు!

టాటా ట్రస్ట్ సంస్థల విద్యా విభాగం కింద పని చేసే ఎన్.జి.ఓ ‘పరాగ్’ ప్రతి సంవత్సరం ‘పరాగ్ ఆనర్ లిస్ట్’ పేరుతో ఆ సంవత్సరం మన దేశంలో ఇంగ్లిష్– హిందీ భాషల్లో వెలువడ్డ మంచి బాలల పుస్తకాల పట్టికను ప్రకటిస్తుంది.అమృతా పట్వర్థన్ ఈ పనిని పర్యవేక్షిస్తారు. ‘పరాగ్ ఆనర్ లిస్ట్–2022’ పట్టిక తాజాగా వెలువడింది. 23 మంది పబ్లిషర్లు అక్టోబర్ 2020 నుంచి సెప్టెంబర్ 2021 మధ్య ప్రచురించిన తమ పుస్తకాలను ఎంట్రీలుగా పంపితే వాటిలో ఉత్తమమైన వాటిని, పిల్లలకు ఉపయుక్తమైన వాటిని ఈ లిస్ట్లో ప్రకటించారు. ఈ లిస్ట్లో ఎంపికైన పుస్తకాలు ఒక రకంగా గుర్తింపును, గౌరవాన్ని పొందినట్టు లెక్క.
ఈసారి ఇంగ్లిష్లో ఎంపికైన పుస్తకాలలో ‘యానిమల్ ఆల్ఫాబెట్స్’ (జంతువుల ద్వారా అక్షరాలు నేర్పడం ఆ క్రమంలో జంతువుల గురించి చెప్పడం), ‘అసామో ఈజ్ దట్ యూ’ (మాన్స్టర్స్ మీద సాహసయుద్ధం), ‘జమ్లో వాక్స్’ (లాక్డౌన్లో నడిచిన ఒక బాలిక కథ), ‘వెన్ ఆదిల్ స్పీక్స్, వర్డ్స్ డాన్స్’ (బధిరుడైన బాలుడు తన సైన్ లాంగ్వేజ్తో ఎలా ఆకట్టుకుంటాడనే కథ), ‘కశ్మీర్ కశ్మీర్’ (కశ్మీర్ జీవన కథలు), ‘మై నేమ్ ఈజ్ గులాబ్’ (మురికివాడ అమ్మాయి తన సమస్యను తానే గెలవడం), ‘హావ్ యూ మెట్ పార్శీస్’ (పార్శీల జీవనం గురించి అవగాహన)... తదితర 37 పుస్తకాలు ఉన్నాయి. ఇవి కాక హిందీ పుస్తకాలు 9 ఎంపికయ్యాయి. అంటే ఇవన్నీ నేటి బాలలు తప్పక చదవాల్సిన పుస్తకాలు అన్నమాట.
‘పుస్తకాలు బాలలను ఎప్పుడూ చూడని జీవితాల్లోకి, తాము జీవిత కాలంలో ఎదుర్కొనని అనుభవాల్లోకి తీసుకెళతాయి. ఎదుటి వ్యక్తుల గురించి తెలుపుతాయి. పొరుగువాడిని అర్థం చేయిస్తాయి. ఇవన్నీ వారిని మంచి పౌరులుగా మార్చుతాయి’ అంటారు అమృతా పట్వర్థన్. టాటా ట్రస్ట్ల విద్యా విభాగం దేశంలో వివిధ బడులలో, పట్టణాల్లో బాలల పుస్తకాలు అందుబాటులో ఉండేలా చూడటం, లైబ్రరీల నిర్వహణ, బాల సాహిత్యం ప్రచురణకు ప్రోత్సాహం తదితర కార్యకలాపాలలో నిమగ్నమై ఉంది. ఆ విభాగం హెడ్గా అమృత పిల్లల వికాసం గురించి ఎప్పుడూ ఆలోచన చేస్తూనే ఉంటారు. ‘మేము 10 రాష్ట్రాల్లో 2000 స్కూళ్లల్లో పిల్లలకు సాహిత్యం అందే ఏర్పాటు చేస్తున్నాము. ఈ స్కూల్సన్నీ దాదాపుగా గిరిజన ప్రాంతాల్లో, పల్లెల్లో, మురికివాడల్లో ఉన్నాయి. బాలల పుస్తకాలు ఈ వర్గాల బాలలకు మన దేశంలో అందడం లేదనే ఈ పని చేస్తున్నాము’ అంటారామె.
‘పిల్లలు పుస్తకాలు చదవడానికి మొదలెట్టవలసిన మొదటి భాష వారి మాతృభాష. ఆ తర్వాత వేరే భాషల పుస్తకాలు చదివితే ఆ భాషలూ సంస్కృతులు తెలుస్తాయి. అదొక్కటే కాక పిల్లల్ని కథల్లోకి లాగాలంటే మంచి బొమ్మలు కూడా ఉండాలి. కనుక మంచి బొమ్మలు ఉన్న పుస్తకాలు వారికి ఇవ్వాలి’ అంటారామె.
‘పిల్లలు తమకు తాముగా పుస్తకాలు చదివే వయసుకు రాక మునుపే ఇంట్లో తల్లిదండ్రులు, పెద్దలు వారికి పుస్తకాలు చదివి వినిపిస్తే అలా విన్న బాలలు ఎంతో ఆరోగ్యంతో పెరుగుతున్నారని, ఆ తర్వాత పుస్తకాల పట్ల ఆకర్షితులవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. పుస్తకాలు చదివే పిల్లల భాషా సంపద పుస్తకాలు చదవని పిల్లలకు ఉండటం లేదు. అన్నింటికి మించి పుస్తకాలు చదివే పిల్లలు ఎదుటివారికి వచ్చిన సమస్యలను వారి స్థానంలో నిలబడి అర్థం చేసుకుంటారు. కనుక వారికి సహనం, సానుభూతి, సహజీవనం అలవడుతాయి’ అంటారు అమృత.
పెద్దల సాహిత్యం, బాల సాహిత్యం లేని ఇళ్లు ఉండటం ఏ జాతి సాంస్కృతిక ఔన్నత్యానికైనా అడ్డంకి. హింస, విద్వేషాలు, పీడన, వివక్ష ఇవన్నీ ఆలోచనల విస్తరణకు, జ్ఞానానికి, అవగాహనకు వీలు కల్పించే పుస్తకాలకు దూరంగా ఉండటం వల్లే మనుషుల్లో ఏర్పడుతాయి. ‘కాని విషాదం ఏమిటంటే యు.కెలో ప్రతి ఒక్క పిల్లాడికి ఆరు బాలల పుస్తకాలు అందుబాటులో ఉంటే మన దేశంలో 11 మంది పిల్లలకు ఒక్క బాలల పుస్తకం అందుబాటులో ఉంది. అలాగే మన దేశంలో ప్రతి వంద బాలల పుస్తకాల్లో 45 ఇంగ్లిష్లో, 25 హిందీలో ఉండి మిగిలిన 30 పుస్తకాలు ఇతర భారతీయ భాషల్లో ఉంటున్నాయి. బాలల పుస్తకాలు తమ తమ మాతృభాషల్లో విస్తృతంగా రావాలి. పిల్లల చేత వాటిని చదివించాలి. అప్పుడే మనం మంచి సమాజం ఉండే దేశాన్ని నిర్మించగలం’ అంటారు అమృత.
అనవసర గేమ్స్ వల్ల, అనవసర ప్రభావాల వల్ల ఆలోచించే గుణం కోల్పోయినట్టుగా తయారవుతున్న మన దేశ బాలలకు పుస్తకమే విరుగుడు అని అందరం ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.

పుస్తకాలు చదివే పిల్లల భాషా సంపద పుస్తకాలు చదవని పిల్లలకు ఉండటం లేదు. అన్నిటికీ మించి పుస్తకాలు చదివే పిల్లలు ఎదుటివారికి వచ్చిన సమస్యలను వారి స్థానంలో నిలబడి అర్థం చేసుకుంటారు. కనుక వారికి సహనం, సానుభూతి, సహజీవనం అలవడుతాయి.
– అమృత

Published date : 16 Feb 2022 06:36PM

Photo Stories